సలహా ఇవ్వచ్చుగా..!
లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు నటీమణులు. ఒకప్పుడు తీరిక లేకుండా బిజీగా గడిపిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే పేరుకు ఇంటికే పరిమితమైనా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అందాల ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఏదో ఆలోచిస్తున్నట్లున్న ఫొటోను పోస్ట్ చేసిన ఈ చిన్నది.. ‘ఈ ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలా అని ఆలోచిస్తున్నాను.. కాస్త సలహా ఇవ్వచ్చుగా..!’ అనే క్యాప్షన్‌తో పాటు ‘లాక్డౌన్’, ‘క్వారంటైన్ జీవితం’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
లాక్డౌన్లో ఇదీ నా రొటీన్!
‘నీ తోడు కావాలి’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార ఛార్మి. అనంతరం పలువురు అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ మంచి విజయాలను సొంతం చేసుకుంది. కొన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తూ నిర్మాతగా కూడా మారిందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ఛార్మి.. ఖాళీ సమయంలో తానేం చేస్తోందో ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. టేబుల్‌పై పసందైన వంటకం, చేతిలో కూల్ డ్రింక్‌తో గతంలో ఓ రెస్టరంట్లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘లాక్డౌన్ సమయంలో నేను రోజంతా ఇలానే గడుపుతున్నాను.. తినడం, తాగడం, ఆడుకోవడం, పడుకోవడం.. వీటినే రిపీట్ చేయడం..’ అంటూ సరదాగా రాసుకొచ్చిందీ ఛార్మింగ్ బ్యూటీ.
మీ ప్రొఫైల్ పిక్చర్‌ని మార్చండి..!
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు.. ఇలా ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అలాంటి కరోనా యోధులకు సంఘీభావంగా అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు వివిధ రకాలుగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి, ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ‘కొవిడ్ పోరులో ముందుండి పనిచేస్తోన్న వారందరికీ సంఘీభావం తెలుపుతూ.. మీ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్లను నీలం రంగులోకి మార్చండి..’ అని రాసున్న పోస్ట్‌ని షేర్ చేస్తూ.. తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా నీలం రంగు బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చేసిందీ సూపర్ మామ్.
ఎదగాలంటే ముందు ఆ పనిచేయండి..!
‘మాయ’, ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి చిత్రాల్లో నటించిన నందినీ రాయ్ ‘బిగ్‌బాస్-2’తో పాపులారిటీ సంపాదించుకుంది. తన అందమైన కళ్లతో ఆకట్టుకునే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ భామకు అలవాటు.
ఈ క్రమంలోనే యెల్లో కలర్ శారీలో ట్రెండీగా ముస్తాబై క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘ఎప్పుడైతే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో.. అప్పుడే మీలో మార్పొస్తుంది.. జీవితంలో ఎదుగుతారు..’ అనే స్ఫూర్తిదాయక క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.