అమ్మ.. ‘బొమ్మాళీ’!
హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో అనుష్కా శెట్టి ఒకరు. ‘అరుంధతి’ సినిమాతో మహిళా ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిందీ బొమ్మాళి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది స్వీటీ. అనుష్కకు సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.
తాజాగా అనుష్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞత చెబుతూ ఓ పోస్ట్ చేసిందీ బ్యూటీ. 30 లక్షల ఫాలోవర్లు, అందరికీ థ్యాంక్యూ చెబుతున్నట్లుగా ఓ అందమైన పెయింటింగ్ థీమ్‌తో కూడిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన స్వీటీ.. ‘నాపై ఎనలేని ప్రేమ చూపిస్తూ, నా వెన్నంటే ఉండి నాకు సహకరిస్తోన్న వారందరికీ కృతజ్ఞతలు. మీరంతా బాధ్యతాయుతంగా ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను..’ అని క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. తనను ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలో అవుతుండగా.. అనుష్క మాత్రం కేవలం 17 మందినే ఫాలో అవుతోంది.
సముద్రం లేదు.. అలలూ లేవు..!
తనదైన పంచ్ డైలాగ్‌లతో, హాస్యచతురతతో ఎలాంటి వేదికనైనా షేక్ చేసేస్తుంది ప్రముఖ యాంకర్ సుమ కనకాల. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సుమక్క.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు అనుక్షణం టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు ఫన్నీ పోస్ట్‌లు పెడుతూ అందరికీ మరింత చేరువవుతోందీ సూపర్బ్ యాంకర్.
ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా సుమ చేసిన ఓ పోస్ట్ నవ్వులు పూయిస్తోంది. ‘వావ్.. సముద్రపు ఒడ్డున’ అనే క్యాప్షన్‌ను జోడించి ఓ వీడియోను పోస్ట్ చేసింది సుమ. ఇక ఈ వీడియోలో తాను మాట్లాడుతూ.. ‘ఆహా.. ఈ సముద్రతీరంలో.. ఈ సమయంలో.. ఈ చల్ల గాలిలో.. ఎంత బాగుందో’ అని చెబుతూ కెమెరాను దూరంగా తీసుకెళ్లింది. అదేంటీ..? లాక్డౌన్ సమయంలో సుమ బీచ్‌కు ఎలా వెళ్లిందనేగా మీ డౌట్..? అసలు విషయమేంటంటే.. సుమ తన అపార్ట్మెంట్ బాల్కనీలో గాలి వీస్తోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్ చేసింది. ‘సముద్ర తీరం లేదు.. అలలూ లేవు.. బాల్కనీలో ఉన్నాను. ఒట్టి ఊహే.. అలా ఉన్నట్లు భావిద్దాం’ అంటూ వీడియో చివర్లో సుమ చెప్పిన మాటలు ఆమెలోని హాస్యచతురతను మరోసారి బయటపెట్టాయి.
ఏ వారమైతే ఏంటి..?
లాక్డౌన్ కారణంగా వ్యాపారవేత్తల దగ్గర్నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేక ఇంట్లోనే ఉండడంతో క్యాలెండర్లో మారుతోన్న తేదీలు, వారాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రావట్లేదు.
తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్. ‘ఏదైతే ఏముంది’ అన్నట్లుగా ఉన్న స్టిల్‌లో క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ డస్కీ బ్యూటీ.. ‘ఈ లాక్డౌన్ సమయంలో ఆదివారం, సోమవారం.. ఏ వారమైనా ఒకటే..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.
‘కొంటె పిల్ల’.. క్వారంటైన్ మూడ్స్ చూశారా?
‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార ప్రియా ప్రకాశ్ వారియర్. సినిమా విడుదలకు ముందే కొంటెగా కన్ను గీటి రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయిందీ మలయాళీ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన లేటెస్ట్ ఫొటోలు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా లాక్డౌన్లో భాగంగా ఇంటికే పరిమితమైన ప్రియ.. ప్రస్తుతం తన మూడ్ ఎలా ఉందో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. రకరకాల హావభావాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘క్వారంటైన్ మూడ్స్’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
కూతురితో స్టెప్పులేసిన గబ్బర్!
తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్ననే హీరోగా భావించి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంది కూతురు. ఇక కూతురిని తన కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నాన్న. అలాంటి తండ్రీకూతుళ్ల అమూల్యమైన ప్రేమకు అద్దం పడుతోంది టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో.
మంగళవారం (మే 5) శిఖర్ ధావన్ కూతురు (స్టెప్ డాటర్) అలియా ధావన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అలియాతో కలిసి గతంలో ఓసారి డ్యాన్స్ చేసిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శిఖర్.. ‘హ్యాపీ బర్త్‌డే మై ఏంజెల్..! నువ్వెప్పటికీ తారలా వెలుగుతూనే ఉండాలి. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. జాగ్రత్తగా ఉంటూ ఈరోజును బాగా ఆస్వాదించు..’ అనే క్యాప్షన్‌ను జోడించాడీ స్టార్ ప్లేయర్.