‘హాష్’ మాటలు విన్నారా?
నటి సమంత పెట్ లవర్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సామ్ ‘హాష్’ అనే శునకాన్ని పెంచుకుంటోంది. ఇంట్లో ఉన్నప్పుడు తన పెంపుడుకుక్కకు కూడా సమయం కేటాయిస్తూ దాంతో ఆడిపాడుతుందీ బ్యూటీ. ఈ క్రమంలో తన కుక్కతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటుంది సామ్. ఒక్క మాటలో చెప్పాలంటే చై, సామ్‌లు దీన్ని తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. మరి నిజంగానే ‘హాష్’కు మాటలు వస్తే తన మమ్మీకి (సమంతకు) శుభాకాంక్షలు ఎలా చెబుతుంది.? ఇలా ఆలోచిస్తేనే ఆసక్తిగా ఉంది కదూ..! అయితే ఈ ఆలోచననే ఆచరణలో పెట్టారు ‘ఓ బేబీ’ చిత్ర యూనిట్.
ఏప్రిల్ 28న సామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ అందాల తారకు ఎంతోమంది శుభాకాంక్షలు తెలిపారు. అయితే అన్నిటిలో ఒకటి మాత్రం సమంతను విపరీతంగా ఆకట్టుకుంది. అదే తన పెంపుడుకుక్క హాష్ తనకు బర్త్‌డే విషెస్ చెప్పడం. ఒకవేళ సమంతకు హాష్ బర్త్‌డే విషెస్ చెబితే ఎలా ఉంటుందో.. అలా ఓ వాయిస్ ఓవర్ చేసి రూపొందించిన వీడియోను ఆమెకు పంపించారు ‘ఓ బేబీ’ చిత్ర యూనిట్. ఇక సమంత ఈ వీడియోను.. ‘నాకు వచ్చిన క్యూటెస్ట్ విష్ ఇదే’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఆస్ట్రేలియాను తాకిన ‘బుట్టబొమ్మ’..!
అల్లుఅర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో ఈ సినిమాకు సంబంధించిన పాటలు సంచలనం సృష్టించాయి. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాట రికార్డులు సృష్టించింది. ఇక టిక్‌టాక్‌లో ఈ పాటకు ఎంతో క్రేజ్ లభించింది కూడా! సినీ సెలబ్రిటీలతో పాటు విదేశీయులు కూడా టిక్‌టాక్‌లో ఈ పాటకు కాలు కదిపారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశాడు. కేవలం తానొక్కడే కాకుండా భార్య క్యాండీస్‌తో కలిసి కాలు కదపడం విశేషం. భార్యాభర్తలిద్దరూ డ్యాన్స్ చేస్తుండగా వీరి చిన్నారి కూడా వెనకాల స్టెప్పులు వేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. డేవిడ్ ఈ టిక్‌టాక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ బ్యాట్స్‌మన్ అనే విషయం తెలిసిందే.
ఇక ఈ వీడియో చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. డేవిడ్ వార్నర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బన్నీ.. ‘ఇది నిజంగా అభినందించాల్సిన విషయం.. థ్యాంక్యూ వెరీ మచ్’ అంటూ ట్వీట్ చేశాడు.
నిహారిక స్పెషల్ డ్యాన్స్ చూశారా..?
మెగాస్టార్ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోందీ మెగా డాటర్. ఇదిలా ఉంటే నిహారికలో ఒక మంచి డ్యాన్సర్ కూడా ఉందన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు.
అయితే ఈ క్రమంలో నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో తనలోని మంచి డ్యాన్సర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే (ఏప్రిల్ 29) సందర్భంగా తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిందీ క్యూట్ హీరోయిన్. ఇందులో నిహారిక అద్భుతంగా చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు..!
బాలీవుడ్ అందమైన ప్రేమ జంటల్లో బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఒకరు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలే వీరి అన్యోన్యతకు ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. ‘మంకీ లవ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జంట తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెబుతుంటారు.
2016, ఏప్రిల్ 30న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. నేడు తమ పెళ్లి రోజును పురస్కరించుకొని బిపాసా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. బిపాసా, కరణ్‌ల వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘ప్రేమను మించిన భావోద్వేగం మరొకటి లేదు. ప్రేమకు ఉండే శక్తి మరే ఎమోషన్‌కు ఉండదు. నేనెంతగానో ప్రేమించిన వ్యక్తితో నా జీవితంలోని ప్రతి రోజునీ గడపడం నా అదృష్టం. మేమిద్దరం ప్రతిరోజూ చిన్న చిన్న పనుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. తద్వారా మాకు జీవితంపై కృతజ్ఞతా భావం పెరుగుతుంది. ప్రేమ, సానుకూల దృక్పథం, నమ్మకం, మ్యాజిక్, కృతజ్ఞత.. ఇదే మా అన్యోన్యతకు సూత్రం. జీవితంలో ప్రతిరోజునూ ఓ వేడుకలాగా జరుపుకుంటూ.. అభిమానించే వారిని గుర్తుచేసుకుంటూ.. జీవితానికి కృతజ్ఞత చెబుతూ ప్రతిరోజునూ పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. నేడు మా నాలుగో వివాహ వార్షికోత్సవం. కాలం వేగంగా కరిగిపోతుంది.. కాబట్టి ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచుకోవాలి. ఈ విలువైన సమయంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలి. మాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్యూ..’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చిందీ బ్యూటీ.