ఎలా ఉన్నారు..?
తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి శృతి హాసన్. కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందీ చిన్నది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి.. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘క్రాక్’ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శృతి తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శృతి పోస్ట్ చేసిన ఓ ఫొటో తన ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. వివిధ రకాల ముఖ కవళికలతో (ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్) దిగిన ఫొటోలన్నింటినీ ఒక చోట చేర్చిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘మీరంతా ఎలా ఉన్నారు?’ అనే క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.
20 ఏళ్ల ‘బద్రి’!
‘నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్’ ఈ సినిమా డైలాగ్ తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2000, ఏప్రిల్ 20న వచ్చిన ‘బద్రి’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఆ రోజుల్లో రికార్డులు తిరగరాసింది. ఇక నటి రేణూ దేశాయ్ ‘బద్రి’ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయమే పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల మధ్య ప్రేమకు దారి తీసింది.
నేటికి (ఏప్రిల్ 20) ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘బద్రి’ సినిమాతో తనకున్న జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది రేణు. 20 ఏళ్ల క్రితం షూటింగ్లో పాల్గొన్న సమయంలో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ అప్పటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..
ఇంటి పనులు పూర్తి చేశానోచ్!
లాక్డౌన్ కారణంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలు, పార్టీలతో బిజీబిజీగా గడిపే సినీ తారలు కూడా ప్రస్తుతం ఎంచక్కా ఇంటి పట్టునే ఉంటూ.. ఇంటి పనులు చేసుకుంటున్నారు. కొంత మంది సెలబ్రిటీలు ఇంట్లో పనులు చేస్తున్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న విషయం తెలిసిందే.
తాజాగా అందాల తార పాయల్ రాజ్‌పుత్ కూడా ఇలాంటి ఫొటోనే షేర్ చేసింది. షూటింగ్‌లు లేకపోవడంతో ఇంట్లోనే ఖాళీగా ఉండడంతో ఫ్యాన్‌ను శుభ్రం చేసిందీ బ్యూటీ. నిచ్చెనెక్కి క్లాత్‌తో ఫ్యాన్ క్లీన్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పాయల్.. ‘ఇంటి పనులు పూర్తి చేశాను’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఈ ఫొటోలు చూస్తుంటే.. ఈ ముద్దుగుమ్మ ఇంటి పనులు చేస్తున్నా ఎంత అందంగా ఉందో.. అనిపిస్తోంది కదూ! కావాలంటే మీరూ చూడండి..
మాకోసం నువ్వు ఎంతో చేశావు నాన్నా..!
‘సూపర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుష్క అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక ‘అరుంధతి’ సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఈ ‘జేజమ్మ’ మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తెలుగులో అగ్రహీరోలతో సమానమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది.. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది.
ఇదిలా ఉంటే కేవలం సినిమాల్లోనే తప్ప బయట ఎక్కువగా కనిపించని అనుష్క.. సోషల్ మీడియాలోనూ చాలా అరుదుగా అభిమానులను పలకరిస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను ఆకట్టకుంటోంది. తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అనుష్క.. ‘నేనిప్పటి వరకు చూసిన వారందరిలోకెల్లా.. ఎంతో ప్రేమగా చూసుకుంటూ, అన్నింటా ప్రోత్సహించే తండ్రివి నువ్వే నాన్నా! మా కోసం మీరెన్నో గొప్ప పనులు చేశారు. ఇది మీ రోజు.. మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని సంతోషంగా ఉంచేది అదే. హ్యాపీ బర్త్‌డే నాన్నా..’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది దేవసేన.
హ్యాపీ బర్త్‌డే క్వీన్..!
తనదైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ పటౌడీ కోడలు.. తన వృత్తిగత, వ్యక్తిగత విశేషాలతో పాటు తన కొడుకు తైమూర్ ఫొటోలను కూడా అందులో పంచుకుంటుంటుంది.
తాజాగా కరీనా ఇన్‌స్టా వేదికగా తల్లి బబిత, తండ్రి రణ్‌ధీర్ కపూర్‌తో కలిసి గతంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. నేడు (ఏప్రిల్ 20) తల్లి బబిత పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫొటోతో పాటు.. ‘హ్యాపీ బర్త్‌డే క్వీన్’ అనే క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్ మామ్.