విడాకులు... ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అత్యంత కఠినమైన మలుపు..! సర్వస్వం తానే అనుకున్న జీవిత భాగస్వామితో మధ్యలోనే విడిపోవడం...తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపే రోజులొస్తాయన్న ఆలోచనే తీరని ఆవేదనను కలిగిస్తుంది. ఇలా విడాకులు తీసుకుని భాగస్వామికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత వరకు బాధను మర్చిపోవడానికి, వివిధ రకాలుగా సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో విడాకులు తీసుకున్న చాలామంది సెలబ్రిటీలు కూడా సినిమాలు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివారిలో నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా ఒకరు. 2019 చివరిలో తన భర్త రోహిత్ మిట్టల్‌తో విడిపోయిన ఈ అందాల తార మళ్లీ వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోంది. తద్వారా తన వైవాహిక బంధం మిగిల్చిన చేదు అనుభవాల నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్ ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్‌ను తన వైపుకి తిప్పుకుంది. ఈ చిత్రంలో ‘ఎకడా’? అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె చెప్పిన డైలాగ్‌ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఈ సినిమాతో పాటు ‘కాస్కో’, ‘రైడ్’, ‘కళావర్ కింగ్’.. తదితర తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని తమిళ, బెంగాలీ సినిమాల్లోనూ కనిపించింది. ఈక్రమంలో వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడిందీ అందాల తార. ఆ తర్వాత ముంబైకి చెందిన ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌తో ప్రేమలో పడిందామె. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018, డిసెంబర్ 13న పుణే వేదికగా ఏడడుగుల బంధంతో ఒక్కటైంది. బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
భర్తతో విడిపోయాక మళ్లీ సినిమాల్లో బిజీ!
ఇలా నాలుగేళ్ల ప్రేమను మూడుముళ్ల బంధంగా మార్చుకున్న శ్వేత-రోహిత్ 2019 డిసెంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించి ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఏడాది కూడా కాకుండానే...సరిగ్గా మొదటి పెళ్లి రోజుకు మూడు రోజుల ముందే బ్రేకప్ ప్రకటించారీ మాజీ కపుల్. ఆ సమయంలో పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన ఈ జంట గతేడాది విడాకులు తీసుకుని లీగల్‌గా విడిపోయారు. భర్తతో విడిపోయాక మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయిన శ్వేత ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘సీరియస్ మెన్’, ‘షుక్రాను’, ‘కామెడీ కపుల్’ తదితర సినిమాలతో సందడి చేసింది. అయితే రోహిత్‌తో విడిపోవడం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకుందీ ముద్దుగుమ్మ.
నాకు నేను స్నేహితురాలిగా మారిపోయాను!
‘పెళ్లైన పదేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా చాలామంది దంపతులు విడిపోవడం మనం చూస్తుంటాం. కానీ మేమిద్దరం ఎనిమిది నెలల్లోనే దూరం కావాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని విడాకులు అనే పెద్ద పదంతో పోల్చడం కంటే బ్రేకప్ అనడం కరక్ట్ అనిపిస్తుంది. రోహిత్, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. అతనికి దూరమైన సమయంలో నేను ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో నా కుటుంబం, స్నేహితులు నాకు తోడుగా నిలిచారు. ఇప్పుడు నాకు నేను ఓ మంచి స్నేహితురాలిగా మారిపోయా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది శ్వేత.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ‘జామూన్’, ‘ఇండియా లాక్డౌన్’ చిత్రాలతో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.