ఇండియన్ సినిమా... దేశాలను దాటి... ఖండాంతరాలను చేరుకుంది. ఇప్పుడు అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్ వంటి దేశాల్లోనూ భారతీయ చిత్రాలు విడుదలవుతున్నాయి. అక్కడి ప్రేక్షకులను కూడా తమ మాయాజాలంతో మెప్పిస్తున్నాయి. ఇక మన సినిమాలకు ఉన్న క్రేజ్ చూసి.. బాలీవుడ్, టాలీవుడ్‌లలో నటించడానికి విదేశీ సుందరీమణులు సైతం సిద్ధమైపోతున్నారు. కత్రినా కైఫ్(లండన్), జాక్వెలిన్ ఫెర్నాండెజ్(శ్రీలంక), కల్కి కొచ్లిన్(ఫ్రాన్స్), అమీ జాక్సన్(బ్రిటన్), నోరా ఫతేహి(కెనడా), ఎవ్లీన్ శర్మ(జర్మనీ), నర్గిస్ ఫక్రి(అమెరికా).. వీరంతా ఇలా వచ్చి సెటిలైన వారే! తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల తార చేరింది. ఆమే బ్రిటన్‌కు చెందిన ఒలీవియా మోరిస్.
‘హ్యాపీ బర్త్ డే జెన్నిఫర్’
తన సినిమాలతో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతర్జాతీయంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. రామ్‌చరణ్, తారక్, అలియా భట్, శ్రియ, అజయ్ దేవ్‌గణ్ తదితర ప్రధాన తారగణంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు రాజమౌళి. సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా అలియా నటించనుండగా, తారక్ ప్రేయసిగా ఒలీవియా సందడి చేయనుంది. తాజాగా ఆమె పుట్టిన రోజును (జనవరి 30) పురస్కరించుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర బృందం తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ‘అందమైన, ప్రతిభావంతురాలైన జెన్నిఫర్@ ఒలీవియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అంటూ ట్విట్టర్లో ఒలీవియా పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అనంతరం తారక్ కూడా ‘హ్యాపీ బర్త్ డే డియర్ జెన్నిఫర్’ అంటూ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉంటే చిత్ర బృందం షేర్ చేసుకున్న పోస్టర్లో షార్ట్ హెయిర్‌తో యువరాణిలా మెరిసిపోయింది ఒలీవియా. ప్రస్తుతం ఆమె పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లందరూ ఈ అందాల తార గురించి తెగ మాట్లాడుకుంటున్నారు.. ఆమె గురించి తెలుసుకోవడానికి తెగ శోధించేస్తున్నారు.
ఆమే నా రోల్ మోడల్!
* ఇటీవల 24వ వసంతంలోకి అడుగుపెట్టిన ఒలీవియా యూకేలోని వేల్స్లో 1997 జనవరి 29న పుట్టింది. ప్రస్తుతం లండన్‌లోనే నివాసముంటోంది. * ఒలీవియా చదువు విషయానికొస్తే.. వేల్స్‌లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం లండన్‌లోని ‘రాయల్ వెల్ష్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా’లో థియేటర్ అండ్ పెర్ఫార్మెన్స్లో డిగ్రీ పట్టా అందుకుంది.
* చదువుకునే సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించిందీ బ్రిటిష్ సుందరి. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగుపెట్టి పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటించింది. * 2018లో ఆమె నటించిన ‘7 Trails In 7 Days’ అనే సిరీస్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌తోనే అశేష అభిమానులను సొంతం చేసుకుందీ అందాల తార.
* అద్భుతంగా డ్యాన్స్ చేసే ఒలీవియా గతంలో డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుందట. ఇలా నటిగా, డ్యాన్సర్‌గా, థియేటర్ ఆర్టిస్టుగా బుల్లితెరపై బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తోందీ ముద్దుగుమ్మ.
* ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో తారక్ ప్రేయసిగా మొదట హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ను ఎంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఒలీవియా పేరు తెర మీదకొచ్చింది. 2019 నవంబర్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర బృందం ఆమె పేరు ప్రకటించగానే తన గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాటపడ్డారు సినీ ప్రేక్షకులు. దీంతో ఆ రోజు (2019 నవంబర్ 20) రెండు లక్షల సెర్చెస్తో ఒక్కసారిగా గూగుల్ ట్రెండ్స్‌లో మొదటి ప్లేస్‌లోకి వెళ్లిపోయిందీ ముద్దుగుమ్మ. * ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రకటనతో సోషల్ మీడియాలో కూడా ఆమె ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు ఒలీవియా ఇన్‌స్టా ఫాలోవర్లు 2,640 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 67వేలకు చేరుకోవడం విశేషం. ట్విట్టర్లోనూ సుమారు 41వేల మంది ఆమెను అనుసరిస్తున్నారు.
* సిల్వర్ స్ర్కీన్‌పై ట్రౌజర్ ధరించి నటించిన తొలి అమెరికన్ నటి క్యాథరిన్ అంటే ఒలీవియాకు ఎంతో అభిమానం. తనను స్ఫూర్తిగా తీసుకునే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బ్రిటిష్ బ్యూటీ. * సాహసాలు చేయడమంటే ఇష్టపడే ఒలీవియా.. ఫిట్‌నెస్‌కూ అధిక ప్రాధాన్యమిస్తుంటుంది. ఈ క్రమంలో తాను వ్యాయామం చేస్తోన్న పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుందీ ముద్దుగుమ్మ.
|
చాక్లెట్స్ అంటే ఇష్టం!
ఇష్టమైన నటీమణులు: ఏంజెలినా జోలీ, కేట్ విన్స్లెట్ నటులు: బ్రాడ్‌పిట్, లియోనార్డొ డికాప్రియో, క్రిస్హెమ్స్ వర్త్ కలర్: తెలుపు, ఎరుపు ఇష్టంగా తినేవి: చాక్లెట్స్ హాబీలు: మ్యూజిక్ వినడం, ఫొటోగ్రఫీ
|
ఇప్పటివరకు బుల్లితెరపైనే కనిపించిన ఒలీవియా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో మొదటిసారిగా సిల్వర్‌స్ర్కీన్‌పై సందడి చేయనుంది. ఇప్పటికే అత్యధిక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది.