ఒత్తిడి, ఆందోళన... ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఎంతగా కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుంటాయీ మానసిక రుగ్మతలు. వీటిని భరించలేక ఒకానొక సమయంలో చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఇక కరోనా వచ్చాక మానసిక కుంగుబాటుకు గురయ్యే బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. వైరస్ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు... ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈక్రమంలో కరోనా కారణంగా తానూ అలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నానంటోంది నటి రాయ్ లక్ష్మి. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె ఇటీవల పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్ చేసుకుంది.
నేనూ కరోనా బారిన పడ్డాను!
క్యాలెండర్ మారినా కరోనా మాత్రం ప్రపంచాన్ని వీడడం లేదు. వివిధ దేశాల్లో ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంచెం ఉపశమనం కలిగిస్తున్నా.. వైరస్ మహమ్మారి మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. లక్షణాలు తెలియనివ్వకుండా, కొత్త కొత్త లక్షణాలతో వ్యాపిస్తూ అందరిలో అలజడి రేపుతోంది. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈక్రమంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బాలీవుడ్లో సినిమాలు, ప్రత్యేక పాటలతో అలరిస్తోన్న రాయ్ లక్ష్మి కొద్ది రోజుల క్రితం కరోనా బాధితుల జాబితాలో చేరిపోయింది. సుమారు రెండు వారాల పాటు హోం ఐసోలేషన్‌లో గడిపిన ఆమె ఇటీవల కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను పంచుకునేందుకు ఇలా మన ముందుకు వచ్చింది.
నాన్న కళ్లముందే చనిపోయారు!
‘గతేడాది నాకు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. దీంతో పాటు ఎన్నో పాఠాలను కూడా నేర్పించింది. 2020 మార్చిలోనే మా నాన్న(రామ్ రాయ్)కు నోటి క్యాన్సర్ ఉందని నిర్ధారితమైంది. సరిగ్గా అదే సమయంలో దేశమంతా లాక్డౌన్ విధించారు. ఎవరూ బయటికి అడుగుపెట్టే అవకాశం లేకపోవడం, కరోనా బాధితులకు తప్ప...ఇతర రోగులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించే సౌకర్యం లేకపోవడంతో మా కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యాం. లాక్డౌన్ ప్రారంభమయ్యాక చాలా రోజులకు కానీ మా నాన్నకు అత్యవసర వైద్య చికిత్స అందించలేకపోయాం. దురదృష్టవశాత్తూ ఆ వైద్యం కూడా నాన్నను కాపాడలేకపోయింది. క్యాన్సర్‌తో పోరాడుతూనే మా కళ్ల ముందే ఆయన కన్నుమూశారు. ఈ సంఘటన మా కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. ఇక నాన్న మరణం తర్వాత నా చుట్టూ అంతా చీకటి ఆవరించినట్లయింది. జీవితంలో అన్నీ కోల్పోయినట్లు ఎంతో వెలితిగా అనిపించింది. మానసికంగా బాగా కుంగిపోయాను. కొన్ని రోజుల అనంతరం ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటకు రావాలని, మళ్లీ సాధారణ జీవితం ప్రారంభించాలని అనుకున్నాను. ఆ సమయంలోనే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో జరిగే ఓ కార్యక్రమంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చింది. దీంతో నేను ఎంతో సంతోషంతో దుబాయ్ వెళ్లాను. అయితే దురదృష్టవశాత్తూ రెండు రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుందనగా నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారితమైంది’.
12 రోజుల తర్వాత నెగెటివ్!
‘న్యూ ఇయర్ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లిన నాకు మొదట నీరసంగా, అలసటగా అనిపించింది. ఎక్కువ సేపు పని చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మొదట అనుకున్నాను. ఆ తర్వాత తీవ్రమైన గొంతునొప్పి మొదలైంది. చాలా అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నాను. అలా కొవిడ్ పాజిటివ్ అని తేలిన కొన్ని రోజులకు వాసన గ్రహించే సామర్థ్యం కూడా కోల్పోయాను. ఇక చికిత్సలో భాగంగా స్వీయ నిర్బంధంలో ఉండడం ఎంతో కష్టమనిపించింది. దుబాయ్‌లో నాకు తెలిసిన వాళ్లెవరూ లేరు. దీంతో నేను ఒక్కదాన్నే ఐసోలేషన్ రూంలో ఉండిపోయాను. కరోనా లక్షణాలు మరీ తీవ్రంగా లేనప్పటికీ మానసికంగా నేను మరింత కుంగిపోయాను. ఎంతో అసౌకర్యంగా అనిపించినప్పటికీ ప్రతి నాలుగు రోజులకొకసారి కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. అదృష్టవశాత్తూ 12 రోజుల తర్వాత నెగెటివ్‌గా తేలింది.’
2020 నాకు చాలా నేర్పింది!
‘2020నాకు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. అదే సమయంలో ఎన్నో పాఠాలను కూడా నేర్పింది. కరోనా కారణంగా మనం ఎంతో కృతజ్ఞతగా ఉండాలని, మనకున్న వాటితోనే జీవితాన్ని ఆస్వాదించాలనే విషయాలు నేను తెలుసుకున్నాను. ఖరీదైన వస్తువుల్లో సంతోషం ఉండదని, మన చుట్టూ ఉన్న మనుషుల్లోనే అసలైన సంతోషం దొరకుతుందని అర్థం చేసుకున్నాను. సానుకూల దృక్పథంతో ఈ సంవత్సరాన్ని గడిపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలకు సైన్ చేశాను. అదేవిధంగా కొన్ని వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటిస్తున్నాను’ అని తన కరోనా కథను చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.