సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సినీ తారల్ని చూసి ‘అబ్బ...వీళ్లు నిజంగా లక్కీ! చేతి నిండా డబ్బు.. లగ్జరీ లైఫ్‌స్టైల్...! అసలు లైఫ్ అంటే సినిమా వాళ్లదే!’ అని అనుకుంటాం. కానీ వాళ్లు ఆ దశకు చేరుకోవడానికి మొదట్లో ఎంత కష్టపడ్డారో చాలామంది ఊహించరు. ఈక్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, వివిధ రకాల వేధింపుల గురించి కొంతమంది తారలు పలు సందర్భాల్లో పంచుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెబుతోంది బాలీవుడ్ అందాల తార సన్నీ లియోనీ. సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె చిన్నతనంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానంటోంది. ఈ సందర్భంగా స్కూలింగ్‌లో తన తోటి విద్యార్థులు ఎలా ఏడిపించారో అందరితో షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.
హిందీ ‘బిగ్ బాస్-5’ టీవీ షో ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ ‘జిస్మ్-2’, ‘రాగిని ఎంఎంఎస్-2’, ‘ఏక్ పహేలీ లీలా’, ‘స్పోర్ట్స్ విల్లా’... తదితర సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. మంచి డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు పొందిన ఆమె పలు ప్రత్యేక గీతాల్లో కూడా నటించి మెప్పించింది. 2011లో న్యూయార్క్‌కు చెందిన మ్యుజీషియన్ డేనియర్ వెబర్‌ను వివాహమాడిన సన్నీ 2017లో ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు ముద్దుగా ‘నిషా కౌర్ వెబర్’ అని పేరు పెట్టుకున్న ఈ అందాల జంట 2018లో సరోగసీ ద్వారా మరో ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఓవైపు ముగ్గురు పిల్లల తల్లిగా అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న సన్నీ.. మరోవైపు సినిమాలు, స్పెషల్ సాంగులతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది.
నా స్కిన్ కలర్‌ని చూసి టీజ్ చేశారు!
కెనడాలో స్థిరపడ్డ సిక్కు కుటుంబానికి చెందిన సన్నీ విద్యాభ్యాసమంతా కెనడాలోనే గడిచింది. ఈక్రమంలో పంజాబీ మూలాలున్న ఆమె స్కిన్ కలర్, డ్రస్సింగ్ విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందట. ‘నేను కెనడాలో చదువుకుంటున్నప్పుడు కొందరు విద్యార్థులు నన్ను అవహేళనగా చూసేవారు. మరికొంతమంది సూటిపోటి మాటలతో నన్ను ఏడిపించేవారు. ఎందుకంటే నేను ఒక ఇండియన్ అమ్మాయిని. అప్పుడు నేను కాస్త నలుపు రంగులో ఉండేదాన్ని. నా జుట్టు కూడా బ్లాక్‌గా కనిపించేది. అదేవిధంగా నా చేతులు, కాళ్లపై వెంట్రుకలు ఉండడాన్ని చూసి చాలామంది నన్ను హేళనగా చూసేవారు. నేను సన్నగా ఉండడమే కాకుండా సరైన దుస్తులు వేసుకోలేదంటూ వెక్కిరించేవారు. ఇలాంటి వేధింపుల కారణంగానే నా తల్లిదండ్రులు నన్ను పబ్లిక్ స్కూల్ మాన్పించి క్యాథలిక్ స్కూల్లో చేర్పించారు’.
ధైర్యంగా వీటిని ఎదుర్కోవాలి..!
‘స్కూల్లో నాకెదురైన చేదు అనుభవాలను చూసి ఆ సమయంలో ఇవన్నీ మామూలే అనుకున్నాను. కానీ ఇలాంటి అవమానాలు నా కెరీర్ ఆసాంతం కొనసాగాయి. వాటిని తలచుకుంటుంటే ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుంది. కొందరు ఇతరులను టీజ్ చేయడమే ఓ పనిగా పెట్టుకుంటారు. వారిని చూసి మరికొందరు ఇలాంటి పనులకు పూనుకుంటారు. కాబట్టి ఎక్కడో ఒకచోట దీనికి అడ్డుకట్ట పడాలి. ఇలాంటి అవమానాలు, అవహేళనలు ఎదురైనప్పుడు బాధపడకుండా... విమర్శలకు నిరుత్సాహ పడకుండా ధైర్యంగా ముందుకెళ్లాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. అవమానాలు, అవహేళనలను అనుభవాలుగా మార్చుకుని ముందుకు వెళ్లాలని ఇతరులకు సలహా ఇస్తుంటాను. ఇలాంటి సలహాలతో వేధింపులు పూర్తిగా ఆగుతాయని నేను చెప్పడం లేదు. కానీ మన మాటలు విని అర్థం చేసుకున్న కొందరైనా ఇలాంటి వేధింపులకు పాల్పడరు కదా!’ అని చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ.
సన్నీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘కరణ్‌జీత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలో సన్నీ చిన్నతనంలో ఎదుర్కొన్న పలు చేదు అనుభవాలు, అవమానాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ప్రస్తుతం ఆమె చేస్తోన్న సినిమాల విషయానికొస్తే... విక్రమ్ భట్ డైరెక్షన్లో ‘అనామిక’ అనే సినిమా షూటింగ్‌కు హాజరవుతోంది సన్నీ. దీంతో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.