భోగ భాగ్యాలనిచ్చే భోగి, బోలెడన్ని సరదాల్ని తీసుకొచ్చే సంక్రాంతి, కమ్మని విందు చేసే కనుమ... వెరసి ఇలా మూడు పండగలు కలగలిపి తెలుగు లోగిళ్లకు సందడిని తీసుకొచ్చే అతిపెద్ద పండగే మకర సంక్రాంతి. భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడూ బసవన్నలు, పిండి వంటలు, విందులు, వినోదాలు... ఇలా ఎన్నో సరదాల సమ్మేళనమైన ఈ పండగను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకొంటారు. ఈ క్రమంలో పలువురు తారలు సైతం షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సంక్రాంతిని తమదైన రీతిలో సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేనా... ఆ సంబరాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి మన అందాల తారల సంక్రాంతి సంబరాలపై ఓ లుక్కేద్దాం రండి..
‘మెగా’ సంబరాలు!
పండగంటే పదిమందితో కలిసి సంతోషంగా జరుపుకొనే వేడుక. ఈ మాటలను అక్షరాలా నిరూపిస్తూ ఏ పండగైనా కుటుంబం మొత్తం ఒకేచోట చేరి, అసలు సిసలైన పండగంటే తమదే అన్నట్లు ఎంతో సందడిగా సెలబ్రేట్ చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంది మెగా కుటుంబం. ఉపాసన-రామ్‌చరణ్ ఆతిథ్యమిచ్చిన ఈ వేడుకల్లో ఇటీవల మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన మెగా ప్రిన్సెస్ నిహారిక-చైతన్య దంపతులు ప్రత్యేకాకర్షణగా నిలిచారు. వీరితో పాటు సుస్మిత, శ్రీజ, అల్లు స్నేహలత, సాయితేజ్, వైష్ణవ్ తేజ్...తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా కుటుంబమంతా కలిసి దిగిన ఫొటోలను నిహారిక, ఉపాసన తమతమ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
అలరించిన మ్యూజికల్ నైట్
ఇక సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున పాల్గొని సందడి చేశాడు.

అనంతరం మెగా హీరోలందరితోనూ కలిసి సరదాగా ఫొటోలు దిగాడు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్ దేవ్ చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘యమహా నగరి’ పాట పాడి అతిథులందరినీ అలరించాడు.
అందరి ఇళ్లల్లో ఆనంద కాంతులు నింపాలి!
వీరితో పాటు కాజల్ అగర్వాల్, కీర్తి సురేశ్, రకుల్ ప్రీత్‌సింగ్, మంచులక్ష్మి, అనసూయ, సుమ కనకాల, ఈషారెబ్బా, స్నేహ, వరలక్ష్మి, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, విరానిక- మంచువిష్ణు, శిల్పాశెట్టి, ప్రియాంకా మోహన్, సుహాసిని, హంసానందిని, రిచాపనయ్, రష్మీగౌతమ్, వేదిక, అక్కినేని సమంత, సాయిపల్లవి, నందితా శ్వేత, సీరత్ కపూర్ తదితరులు పండగ పూట సంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారు. అనంతరం తమ వేడుకల విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాల సంక్రాంతి అందరి ఇళ్లల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు.