గర్భం ధరించిన మహిళలు నెలలు నిండుతున్న కొద్దీ ప్రతి క్షణాన్నీ ఎంతగా ఆస్వాదిస్తారో.. ఈ క్రమంలో పలు సవాళ్లను సైతం ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారం విషయంలో ఎన్నడూ లేనన్ని సందేహాలు వారి మదిని తొలిచేస్తుంటాయి. ఒకరి కోసం తినాలా? ఇద్దరి కోసం తినాలా?, ఏ ఆహారం తినాలి? ఎంత మోతాదులో తినాలి?, ఈ సమయంలో ఆహారపు కోరికల్ని తీర్చుకోవడం సబబేనా? ఇలా వారి మదిలో మెదిలిన ప్రతి సందేహాన్నీ నిపుణులను అడిగి నివృత్తి చేసుకుంటుంటారు. తాను కూడా అదే చేశానంటోంది బాలీవుడ్ న్యూ మామ్ అనుష్కా శర్మ. ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. గర్భిణిగా ఉన్నప్పుడు తాను తీసుకున్న ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించానో.. ఈ క్రమంలో తన మనసులో మెదిలిన డౌట్స్‌ని నివృత్తి చేసుకోవడానికి తన డాక్టర్ బుర్ర అంతగా తిన్నానంటోంది. కాబోయే అమ్మగా గడిచిన తొమ్మిది నెలల్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే.. ఈ క్రమంలో తాను పాటించిన ఆహార నియమాలు, ఫుడ్ క్రేవింగ్స్ గురించి ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుందీ లవ్లీ మామ్.
గతేడాది ఆగస్టులో ‘త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నాం’ అని విరుష్క జంట తమ ప్రెగ్నెన్సీని ప్రకటించిన క్షణం నుంచి వారి బేబీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ వచ్చారు ఫ్యాన్స్. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఇటీవలే అనుష్క పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు వారి బేబీని ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారా అన్న ఆతృత అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే గర్భంతో ఉన్నప్పుడు అనుష్క ఎంత యాక్టివ్‌గా కనిపించిందో, నెలలు నిండుతున్నా తన సినిమా ప్రాజెక్టుల్లో ఎంత చురుగ్గా పాల్గొందో మనందరం చూశాం. అయితే ఇందుకు కారణమేంటా అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు నెట్ప్రియులు. అదే సమయంలో గర్భంతో ఉన్నప్పుడు అనుష్క తీసుకున్న ఆహార నియమాలేంటో తెలుసుకోవాలన్న ఆతృత కూడా చాలామంది మహిళల్లో నెలకొంది. ఇలా అందరి సందేహాలకు సమాధానమిస్తూ తన ప్రెగ్నెన్సీ ఫుడ్ క్రేవింగ్, ఆహార నియమాల గురించి ఇలా చెప్పుకొచ్చిందీ యమ్మీ మమ్మీ.
కిచెన్‌లోకి వెళ్లలేకపోయేదాన్ని!
‘గర్భం ధరించిన మొదటి త్రైమాసికంలో చాలామంది మహిళలకు వికారం, వాంతులు, విపరీతమైన అలసట.. వంటి లక్షణాలున్నట్లే నేనూ నా తొలి త్రైమాసికంలో ఈ సమస్యలతో బాధపడ్డా. ఆ సమయంలో కొన్ని వాసనలంటే అస్సలు పడేవి కావు.. దాంతో వంటగది దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయేదాన్ని. ఇలా ప్రెగ్నెన్సీలో వచ్చిన ఈ లక్షణం ఇక పోదేమోనని ఒక్కోసారి అనిపించేది. విపరీతమైన అలసట అని చెప్పను కానీ.. ఈ దశలో కాస్త నీరసంగా అనిపించినా ఎంతో ఉత్సాహంగా ఉండేదాన్ని. ఎందుకంటే ఇప్పుడే కాదు.. యాక్టివ్‌గా ఉండడం నాకు ముందు నుంచీ అలవాటే! ఇక ఆహారం విషయానికొస్తే.. మొదటి మూడు నెలలు టోస్ట్, క్రాకర్స్ మాత్రమే తీసుకున్నా. కొన్ని రోజుల తర్వాత నా మనసు వడాపావ్, భేల్‌పూరీ పైకి మళ్లింది. ఆపై అవి కూడా బోర్ కొట్టేవి. ఇలా ఈ సమయంలో ఎక్కువ రోజులు ఫలానా పదార్థం తీసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు. అందుకే ప్రత్యేకంగా ఆహారపు కోరికలంటూ ఏవీ లేవని చెప్తా.
డాక్టర్ బుర్ర తినేసేదాన్ని!
గర్భిణిగా ఉన్న సమయంలో చాలామంది మహిళలు తీసుకునే ఆహారం విషయంలో కలిగే సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదువుతారు.. ఇంటర్నెట్లో ఎంతో శోధిస్తారు. నేను కూడా అలాగే చేశాను. ఇక చెకప్స్‌కి వెళ్లినప్పుడు నా సందేహాలతో డాక్టర్ బుర్ర తినేసేదాన్ని! కొంతమంది ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కరి కోసం కాదు.. ఇద్దరి కోసం తినాలి అని చెబుతుంటారు. కానీ మా డాక్టర్ మాత్రం ఇది కేవలం అపోహ మాత్రమే అని చెప్పారు. ఇక ఈ తొమ్మిది నెలల కాలంలో గ్లూటెన్-రహిత ఆహారంతో పాటు శాకాహారానికే అధిక ప్రాధాన్యమిచ్చా. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాను. పానీ పూరీ దగ్గర్నుంచి, సింధీ వంటకాల దాకా.. నాకు ఏది తినాలనిపించినా తాజాగా ఇంట్లో వండించుకొని తీసుకునేదాన్ని. ఇలా నేను తీసుకున్న ఆహారంతో పాటు రోజూ ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నా. ఇక డాక్టర్ సలహా మేరకు ఈత, యోగా, నడక, ట్రెడ్‌మిల్‌పై జాగింగ్.. వంటివీ చేశా. ఈ అలవాట్లే నన్ను ఈ సమయంలోనూ ఎంతో చురుగ్గా ఉండేలా, నా శరీరాన్ని బ్యాలన్స్ చేసుకునేలా చేశాయి..’ అంటూ తన ప్రెగ్నెన్సీ డైట్ సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ బాలీవుడ్ బ్యూటీ.
ఇలా ఈ తొమ్మిది నెలల పాటు కడుపులో పెరుగుతోన్న బిడ్డకు, తల్లికి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుందని చెబుతోన్న అనుష్క.. ప్రస్తుతం అమ్మగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తోంది. తన కూతురి ఆలనా పాలనతో బిజీగా మారిపోయింది.
గమనిక: గర్భం ధరించిన ప్రతి మహిళ ఆరోగ్య పరిస్థితి, ఆహారపు కోరికలు ఒకేలా ఉండాలని లేదు. అయితే మీకు తినాలనిపించిన పదార్థాలు ఈ సమయంలో తినడం మంచివా? కాదా? అన్నది ఒకసారి నిపుణుల్ని అడిగి తెలుసుకోవడం మంచిది. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యులు సూచించిన ప్రెగ్నెన్సీ డైట్ ఛార్ట్ ప్రకారం ఆహారం తీసుకుంటే ప్రెగ్నెన్సీలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించచ్చు.. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చు..!