తన మధురమైన స్వరంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రస్తుతం సింగిల్ పేరెంట్‌గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపార వేత్త రామ్ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో సునీత పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పాతికేళ్లుగా తన పాటలతో అలరిస్తోన్న సునీత కొద్ది రోజుల క్రితం మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించింది. ఇందులో భాగంగా డిసెంబర్7న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ జంట. అనంతరం సినిమా ఇండస్ట్రీలోని స్నేహితులు, సన్నిహితులకు వరుసగా ప్రి వెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేశారు. రేణుదేశాయ్, సుమతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
పసుపు రంగు చీరలో మెరిసిపోతూ!
ఇక పెళ్లి వేడుకల్లో భాగంగా మెహెందీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సునీత స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో పసుపు రంగు చీర ధరించిన సునీత పెళ్లికూతురుగా చేతులకు మెహెందీ పెట్టుకుని ఎంతో ఆనందంతో కనిపించింది. ఇక పసుపు ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో షేర్ చేసుకుందీ బ్యూటిఫుల్ సింగర్. ఇందులో భాగంగా తన కుమారుడు ఆకాశ్, కుమార్తె శ్రేయాలను ఆప్యాయంగా హత్తుకుంటూ కనిపించిందామె. స్టార్ యాంకర్ సుమతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.