సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే మామూలు విషయమేమీ కాదు. పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునే దాకా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎన్నో భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల మెప్పు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ఈ క్రమంలో కెరీర్ తొలినాళ్లలో తాను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది దీపికా పదుకొణె. మొదటి సినిమా తర్వాత తన యాస బాగుండదని, తనకు నటించడం రాదన్న విమర్శలు తనను తీవ్రంగా బాధించాయంటోంది. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాల గురించి అందరితో షేర్ చేసుకుందీ స్టార్ హీరోయిన్.
విమర్శలు ఎదుర్కొన్నాను!
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది దీపిక. అనతికాలంలోనే బాలీవుడ్ అగ్రకథానాయికగా మారిపోయింది. కేవలం గ్లామర్ డాల్‌గానే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో దీపిక నటించిన మొదటి సినిమా ‘ఓం శాంతి ఓం’ విడుదలై 13 ఏళ్లు పూర్తయ్యాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను ఫరాఖాన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌పేర్ అవార్డు కూడా అందుకుంది దీపిక. అయితే ఈ సినిమా తర్వాత తాను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానంటోందామె. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తనకెదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుందీ ముద్దుగుమ్మ.
ఎన్నో కలలతో ముంబయికి వచ్చాను!
‘మా అమ్మానాన్నలు సంప్రదాయాలకు పెద్దపీట వేసినా మాకెంతో స్వేచ్ఛనిచ్చారు. మేం కచ్చితంగా ఇది చేయాలని ఎప్పుడూ మమ్మల్ని బలవంతం చేయలేదు. చిన్నప్పుడు నేను, మా చెల్లి తరగతి గది కంటే ఇతర సాంస్కృతిక వేదికల పైనే ఎక్కువగా కనిపించేవాళ్లం. ఇక మా నాన్న ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో నేను కూడా ఆ కెరీర్‌నే ఎంచుకుంటానని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్లే టీనేజ్ వయసుకు వచ్చేవరకు బ్యాడ్మింటన్ కోర్టులోనే గడిపాను. కానీ నాకు మోడలింగ్, నటనపై ఆసక్తి ఉందని, ముంబయికి వెళతానని అమ్మానాన్నలతో ఒకరోజు చెప్పేశాను. అప్పటివరకు మా కుటుంబంలో ఎవరికీ నటనకు సంబంధించిన అనుభవం లేదు. అయినా మా అమ్మానాన్న నా నిర్ణయాన్ని స్వాగతించారు. వారు నాపై పూర్తి నమ్మకం ఉంచి నన్ను ముంబయి పంపించారు. అలా చేతిలో ఒక సూట్ కేస్ పట్టుకుని ఎన్నో కలలతో ఈ మహానగరానికి చేరుకున్నాను.’
వారు ముందుండి నడిపించారు!
‘అలా కొన్నేళ్ల పాటు మోడలింగ్ చేసిన నేను మలైకా అరోరా కారణంగా ‘ఓం శాంతి ఓం’ సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యాను. తనే నా గురించి డైరెక్టర్ ఫరాఖాన్‌కు చెప్పారట. అలా 19 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టాను. షారుఖ్‌ఖాన్ లాంటి అగ్రహీరో, గ్రేట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, ఇంకా ఎందరో ప్రముఖ వ్యక్తులు ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. నేను ఎలాంటి సినిమాతో అయితే ఎంట్రీ ఇవ్వాలని కలలు కన్నానో అది ‘ఓం శాంతి ఓం’ సినిమాతో సాకారమైంది. ఇదిలా ఉంటే మరోవైపు అందరి అంచనాలు అందుకుంటానో.. లేదో అన్న ఆందోళన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పైగా అప్పటికి నటనపై నాకు అంతగా అవగాహన లేదు. కానీ షారుఖ్, ఫరాఖాన్ నన్ను చేయిపట్టి ముందుకు నడిపించారు’..
నా యాస బాగోలేదన్నారు!
‘ఇక 2007లో నా మొదటి సినిమా తర్వాత చాలామంది నా నటనను ప్రశంసించారు. అదే సమయంలో కొందరు నా నటనను ఎగతాళి చేశారు. ‘ఆమె ఓ మోడల్. ఆమెకు యాక్టింగ్ రాదు’ అంటూ ప్రత్యేకించి నా యాసపై కామెంట్లు చేశారు. ఆ మాటలు నన్నెంతగానో బాధించాయి. 21 ఏళ్ల వయసుకే విమర్శలు, అవమానాలు ఎదురైతే ఆ ప్రభావం జీవితంపై కచ్చితంగా పడుతుంది. కానీ సినిమాల కన్నా ముందు నేను ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని. అప్పుడే గెలుపోటములను సమానంగా స్వీకరించడం నేను అలవాటు చేసుకున్నా. అందుకే నాకెదురైన అవమానాలను ఆయుధంగా మలుచుకున్నాను. విమర్శలను ఇంధనంగా మార్చుకున్నాను. మొదటి సినిమా తర్వాత నేను మరింతగా కష్టపడ్డాను. నాలోని నటనా నైపుణ్యాలను మరింతగా పెంచుకున్నాను.

ఇక మా అమ్మానాన్నలు మమ్మల్ని పెంచిన విధానం కూడా నా కెరీర్‌కు ఉపయోగపడింది. గౌరవం, వినయం, నిజాయతీ, క్రమశిక్షణ, అంకిత భావం వంటి విషయాలను జీవితంలో భాగం చేసుకోవాలని వారు మాకు చిన్నప్పటి నుంచి చెబుతూ వచ్చారు. అలాగే జీవితంలో వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో మా తల్లిదండ్రులను చూసే నేర్చుకున్నాను’ అని చెప్పుకొచ్చింది దీప్స్.
అలా బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న దీపిక చివరిగా ‘చఫాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తోన్న ‘83’ చిత్రంలో తన భర్త రణ్వీర్ సింగ్ సరసన నటిస్తోంది. దీంతో పాటు ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఓ క్రేజీ ప్రాజెక్టులోనూ ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంపికైంది.