అమ్మ కావడమనేది ఓ అందమైన అనుభూతి.. కడుపులో నలుసు పడిన మరుక్షణం నుంచి నెలలు నిండి బిడ్డ పుట్టే వరకు ఎదురయ్యే చిన్న చిన్న అనారోగ్యాల్ని సైతం ఇష్టంగా భరిస్తూ అమ్మయ్యే ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తుంటారు మహిళలు. అంతేనా.. ఈ క్రమంలో ఎదురయ్యే మధురానుభూతుల్ని అందరితో పంచుకుంటూ మురిసిపోతుంటుంది కూడా! బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా ప్రస్తుతం ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది. త్వరలోనే తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోన్న ఈ బ్యూటిఫుల్ మామ్.. ఈ క్రమంలో కాబోయే అమ్మగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూనే.. మరోవైపు తన అనుభవాలను వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఇక ఇప్పుడు తన ఈ మధురానుభూతులన్నీ రంగరించి ఓ పుస్తకం రూపంలో మన ముందుకు తీసుకురాబోతోందట ఈ అందాల అమ్మ. తాజాగా తన కొడుకు తైమూర్ పుట్టినరోజు సందర్భంగా తన ప్రెగ్నెన్సీ పుస్తకం గురించిన పలు విషయాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది బెబో.
అందం, అంతకుమించిన అభినయంతో సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది పటౌడీ కోడలు కరీనా కపూర్. ప్రస్తుతం ఓవైపు తన నాలుగేళ్ల కొడుకు తైమూర్ ఆలనా పాలనతో బిజీగా ఉన్న ఈ బ్యూటిఫుల్ మామ్.. రెండోసారీ అమ్మగా ప్రమోషన్ పొందబోతోంది. అంతేనా.. నిండు గర్భంతోనూ తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఈ తరం అమ్మలందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది బెబో. అయితే ప్రస్తుతం రెండోసారి గర్భిణి అయిన ఆమె.. కాబోయే అమ్మగా తనకెదురవుతోన్న అనుభవాలను ఓ పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నట్లు తాజాగా ప్రకటించిందీ బాలీవుడ్ అందం. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి తన కొడుకు తైమూర్ పుట్టినరోజు (డిసెంబర్ 20)ను మించిన మంచి తరుణం లేదంటోంది కరీనా.
మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇదే!
బెబో తన రెండో ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించినప్పట్నుంచి అసలు తను గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటుంది? ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతుంది? తన ఫిట్‌నెస్‌కు కారణమేంటి? గర్భం ధరించిన తర్వాత ఎదురయ్యే చిన్న చిన్న అనారోగ్యాల్ని ఎలా దూరం చేసుకోగలుగుతుంది? ఇలా చాలామందిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అంతేకాదు.. తన ప్రెగ్నెన్సీ సీక్రెట్స్ గురించి అంతర్జాలంలో శోధించిన వారూ చాలామందే! అయితే వీటన్నింటికీ తాను త్వరలో తీసుకురాబోయే తన పుస్తకంలోనే సమాధానం దొరుకుతుందంటోంది బెబో. ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తాను రాసిన పుస్తకంలో తన ప్రెగ్నెన్సీ అనుభవాలన్నీ పొందుపరిచానని చెబుతోందీ అందాల అమ్మ. ఇలా తన పుస్తకం గురించిన పలు విషయాలను తన కొడుకు తైమూర్ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టా వేదికగా అందరితో షేర్ చేసుకుందీ పటౌడీ బ్యూటీ.
నా అనుభవాలే పుస్తకంగా!
తన పుస్తకానికి సంబంధించిన ఓ ఇలస్ట్రేషన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన బెబో.. ‘ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు. ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో నేను రాసిన పుస్తకం గురించి మీ అందరితో పంచుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి లేదు. కాబోయే అమ్మలందరికీ ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భం ధరించిన సమయంలో ఎదురయ్యే వేవిళ్లు (మార్నింగ్ సిక్నెస్), తీసుకునే ఆహారం, ఫిట్నెస్.. ఇలా గర్భిణిగా నేను ఎదుర్కొన్న అనుభవాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాను. మీరంతా ఈ పుస్తకాన్ని ఎప్పుడెప్పుడు చదువుతారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నా. జగ్గర్నాట్ బుక్స్ డిజిటల్ పబ్లిషర్స్ సౌజన్యంతో వచ్చే ఏడాది ఈ పుస్తకం మీ ముందుకు రాబోతుంది..’ అంటూ తన పుస్తకంలోని పలు విషయాలను పంచుకుందీ ముద్దుగుమ్మ.
కాబోయే అమ్మల కోసమే..!
గర్భం ధరించడమనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినా, ఈ క్రమంలో ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఎదురవుతుంటాయి. అలా తన అనుభవాలన్నీ రంగరించిన ఈ పుస్తకం కాబోయే అమ్మలందరికీ ఉపయోగపడితే చాలంటోంది బెబో. ‘గర్భధారణ అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని నేను నమ్ముతాను. ఈ క్రమంలో ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండడం చాలా ముఖ్యం. అలా నేను గర్భం ధరించిన రెండుసార్లు నాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి..? వాటిని నేను ఎలా మేనేజ్ చేయగలిగాను.. వంటి విషయాలన్నీ ఈ పుస్తకంలో రాశాను. అవన్నీ కాబోయే అమ్మలందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, మీ ప్రెగ్నెన్సీని పూర్తిగా ఆస్వాదించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాయని అనుకుంటున్నా..’ అంటోందీ బాలీవుడ్ అందం.
ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఆ సమయంలోనూ మహిళలు తమ వృత్తిని కొనసాగించగల సమర్థులని నిరూపిస్తూ ప్రస్తుతం నిండు గర్భంతోనూ తన సినిమా షూటింగ్స్‌లో భాగమవుతోందీ అందాల తార. ప్రస్తుతం కరీనా నటిస్తోన్న ‘వీరే ది వెడ్డింగ్ 2’, ‘తఖ్త్’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.