Photo: Instagram
‘నీ వయసెంత?’ అని ఎవరైనా అడిగితే.. అప్పుడున్న వయసుకు కచ్చితంగా నాలుగైదు సంవత్సరాలు తక్కువ చేసి చెబుతుంటారే కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే వారు చాలా తక్కువమందే! అంతేకాదు.. తమ వయసును దాచిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కూడా! ఇలా పెరుగుతోన్న తమ వయసును అంగీకరించరు సరికదా.. ఏదో తెలియని అభద్రతా భావానికి గురవుతుంటారు. గతంలో తాను కూడా ఇలాంటి ఫీలింగ్‌కి లోనయ్యానంటోంది బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డి. అయితే ఆ విషయాన్ని త్వరలోనే గ్రహించి తనను తాను అంగీకరించడం మొదలుపెట్టానని చెబుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా బాడీ పాజిటివిటీ, అమ్మతనం, బ్రెస్ట్‌ఫీడింగ్.. వంటి విషయాల్లో నేటి మహిళల్లో స్ఫూర్తి నింపేలా పోస్టులు పెడుతుంటుంది సమీర. ఈ క్రమంలోనే ఈ నెలలో తాను 42వ వసంతంలోకి అడుగిడబోతోన్న సందర్భంగా.. మనల్ని మనం అంగీకరించడం వల్ల కలిగే ఆనందం, సంతృప్తి ఎంతో విలువైనవంటోంది. ఇదే విషయం గురించి అందరిలో స్ఫూర్తి నింపేలా ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిందీ అందాల అమ్మ.
సమీరా రెడ్డి.. నటిగా సినీ ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ.. తన సోషల్ మీడియా పోస్టులతోనూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. వీరిలో మహిళలే ఎక్కువమంది ఉంటారనడంలో సందేహం లేదు. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే ఈ బాలీవుడ్ మామ్.. బాడీ పాజిటివిటీ, అమ్మతనం, బ్రెస్ట్‌ఫీడింగ్.. వంటి విషయాల్లో తాను ఎదుర్కొన్న అనుభవాలను రంగరిస్తూనే.. స్ఫూర్తిదాయక సందేశాల్ని సైతం తన పోస్ట్‌కి జత చేస్తూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది.
అప్పుడు నా ఫీలింగ్ అదే!
అయితే ఈ చక్కనమ్మ త్వరలోనే 42వ వసంతంలోకి అడుగుపెట్టేందుకు రడీ అవుతోంది. ఈ సందర్భంగా తన వయసెంతో చెప్పడానికి తానెప్పుడూ మొహమాటపడనని, ఈ క్రమంలో ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడంలోనే అసలు సిసలైన ఆనందం దాగుందంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది.
క్యూట్‌గా నవ్వుతూ క్లిక్‌మనిపించిన ఓ సెల్ఫీని ఇన్‌స్టాలో పంచుకున్న ఈ అందాల అమ్మ.. ‘బొటాక్స్ (వయసును దాచిపెట్టే ఓ సౌందర్య చికిత్స) లేదు, ఫిల్టర్ (యాప్స్/ఫీచర్స్ సహాయంతో ఫొటోను అందంగా తీర్చిదిద్దే ప్రక్రియ) లేదు, ఏమీ లేదు. న్యాచురల్‌గా దిగిన అందమైన ఫొటో ఇది. చాలా విషయాల్లో మనపై మనమే డౌట్ పడుతుంటాం. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనల్ని మనం అంగీకరించం.. కొన్నేళ్ల క్రితం నా ఫీలింగ్ కూడా ఇదే! నా వయసును దాచిపెట్టడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను.. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఆ భావన నుంచి బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది.. ప్రస్తుతం నేను ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాను. ఇలాంటి సంతోషం, సంతృప్తి, మానసిక ప్రశాంతత కంటే విలువైంది ఈ లోకంలో మరేదీ లేదు.
ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి!
డిసెంబర్ 14న నాకు 42 ఏళ్లు నిండుతాయి.. ఇలా నా వయసు గురించి నేను బయటికి చెప్పడానికి అస్సలు మొహమాటపడను. ఈ విషయం చెప్పగానే చాలామంది మహిళలు తాము సంతోషంగా, ప్రశాంతంగా ఉండడానికి కారణాలేంటో చెబుతూ నాకు సందేశాలు పంపించారు. ఈ క్రమంలో వారిని వారు ఎలా స్వీకరిస్తున్నారో, తద్వారా ఎంత సంతోషంగా ఉంటున్నారో నాకు అర్థమైంది. కాబట్టి మీలోని భయాలు, మొహమాటాలను పక్కన పెట్టండి.. ఏ వయసులో ఉన్నా మిమ్మల్ని మీరు స్వీకరించడం నేర్చుకోండి.. ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.. ప్రశాంతంగా ఉండండి.. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది..!’ అంటూ మరోసారి బాడీ పాజిటివిటీకి అసలు సిసలైన అర్థం చెప్పిందీ బాలీవుడ్ మామ్.
ఇలా సమీర పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘ఆ సంతోషం, ప్రశాంతత మీ ముఖంలోనే కనిపిస్తోంది..’, ‘మీరో అద్భుతమైన మహిళ.. మీ సందేశం అత్యద్భుతం..!’ అంటూ నెటిజన్లు ఈ ముద్దుగుమ్మను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.