ప్రస్తుత తరంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ వెండితెరపై వెలిగిపోయే సెలబ్రిటీలకు తమ వృత్తితో పాటు సోషల్ మీడియా కూడా ముఖ్యమే. ఎందుకంటే తమను ఆరాధించే అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సామాజిక మాధ్యమాలు వారధిగా ఉపయోగపడుతున్నాయి. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఈ వేదిక ద్వారానే తమ అభిమానులతో పంచుకుంటున్నారు. అలా సోషల్ మీడియా సినీ తారల జీవితాల్లో భాగమైపోయింది. ఈ క్రమంలో ఆసియా-పసిఫిక్ రీజియన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ ఆసియా. ఫోర్బ్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా విడుదల చేసిన ఈ లిస్టులో అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్, రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్, అలియా భట్, కత్రినా కైఫ్, అనుష్కాశర్మ ...తదితర బాలీవుడ్ తారలు చోటు దక్కించుకున్నారు.
సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, వారిని అనుసరించే ఫాలోవర్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత విజయాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ జాబితాను తయారుచేసింది ఫోర్బ్స్ ఆసియా. అదేవిధంగా సామాజిక మాధ్యమాల వేదికగా సామాజికంగా వీరెలాంటి ప్రభావం చూపుతున్నారన్న విషయాన్ని ఆధారంగా తీసుకుంది. ఈ క్రమంలో ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో డిజిటల్ మాధ్యమాల్లో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను రూపొందించింది. మరి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న బాలీవుడ్ తారలెవరో తెలుసుకుందాం రండి.
అలియా భట్
ప్రముఖ డైరెక్టర్ మహేశ్ భట్ వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అలియా ఇప్పటివరకు 24 సినిమాల్లో నటించింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. సినిమాలే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మకు మొత్తం 74 మిలియన్ల మంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నారు. అదేవిధంగా 18 అంతర్జాతీయ బ్రాండ్లకు సెలబ్రిటీ ఎండార్సర్‌గా వ్యవహరిస్తోందీ అందాల తార. ఈ ఘనతలే ఆమెను అందలమెక్కిస్తున్నాయని ఈ సందర్భంగా ‘ఫోర్బ్స్ ఆసియా’ పేర్కొంది.
కత్రినా కైఫ్
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కత్రినాకు ఇన్‌స్టాలో 45 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఓ ఎండార్స్‌మెంట్‌కు సంబంధించి ఆమె నటించిన ఓ వీడియోకు 15 మిలియన్ల లైకులు రావడం విశేషం. ఆమె నటించిన ‘భారత్’ అనే సినిమా 2019లో అత్యధిక కలెక్షన్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంకకు చెందిన ఈ మాజీ మిస్ యూనివర్స్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. లాక్డౌన్లో ‘మిస్టర్ సీరియల్ కిల్లర్’ లాంటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో ఆకట్టుకున్న ఈ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జులైలో పిజ్జా హట్, పెప్సీ సంయుక్తంగా కలిసి రూపొందించిన ఓ ప్రకటనలో జాక్వెలిన్ నటించింది. దీనికి సంబంధించిన వీడియో 3 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం ఆమె క్రేజ్‌కు నిదర్శనమని ‘ఫోర్బ్స్ ఆసియా’ చెప్పుకొచ్చింది.
నేహాకక్కర్
బాలీవుడ్లో స్టార్ సింగర్‌గా పేరు పొందిన నేహా కక్కర్ అక్టోబర్‌లో మరో సింగర్ రోహన్ ప్రీత్‌సింగ్‌తో కలిసి పెళ్లి పీటలెక్కింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వివాహ సమయంలో తన వెడ్డింగ్ గౌన్‌కు సంబంధించి షేర్ చేసిన పోస్టుకు 4.8 మిలియన్ల లైకులు రావడం విశేషం. ఇదే కాదు... తన పెళ్లి వేడుకలు, హనీమూన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలకు మిలియన్ల కొద్దీ లైకులు వచ్చాయి. తన గాత్ర ప్రతిభకు గుర్తుగా ‘మిర్చి నేషనల్ మ్యూజిక్ అవార్డ్స్-2020’ పురస్కారాల్లో ‘లిజనర్స్ ఛాయిస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుందీ క్రేజీ సింగర్.
అనుష్కా శర్మ
మరికొద్ది రోజుల్లో అమ్మగా ప్రమోషన్ పొందనున్న అనుష్కాశర్మకు మొత్తం 84 మిలియన్ల మంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నారు. నటిగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటుతున్న ఆమె ‘గూగుల్ డుయో’, ‘స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్’ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
శ్రేయా ఘోషల్
బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ అద్భుతమైన పాటలు పాడి అశేష అభిమానులను సొంతం చేసుకుంది శ్రేయాఘోషల్. తన గాన ప్రతిభకు గుర్తుగా ఈ ఏడాది ‘మిర్చి నేషనల్ మ్యూజిక్ అవార్డ్స్’ లో ‘ఫిమేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని సొంతం చేసుకుందీ స్టార్ సింగర్. ఇక లాక్డౌన్ కాలంలో సంగీత కళాకారులను ఆదుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఎన్నో వర్చువల్ కచేరీలు నిర్వహించి తన పెద్ద మనసు చాటుకుంది. ఈ వీడియోలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి.
మాధురీ దీక్షిత్
తన అసమాన నటన, అందం, డ్యాన్స్‌తో బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది మాధురీ దీక్షిత్. బాలీవుడ్లో డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరొందిన ఆమె డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్న వారికి ‘DanceWithMadhuri.com’ వేదిక ద్వారా 2013 నుంచే ఆన్లైన్ శిక్షణ ఇస్తోంది. ఇక లాక్డౌన్ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన శిక్షణ తరగతులను మరింత విస్తృతం చేసిందీ అందాల తార. అంతేకాదు ‘కళంక్’ సినిమాలోని తన నటనకు గాను ‘ఫిల్మ్‌ఫేర్’ ఉత్తమ సహాయనటి పురస్కారానికి నామినేట్ అయ్యింది.