సినిమాల్లో నటించడమే కాదు మహిళా సమస్యలు, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది బాలీవుడ్ నటి రిచా చద్దా. వీటితో పాటు సామాజిక సేవ కోసం సమయాన్ని కేటాయించడంలోనూ ముందుంటుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ... మూగ జీవాల సంరక్షణ కోసం తనదైన శైలిలో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జంతువులపై హింసకు వ్యతిరేకంగా పలు ఛారిటీ ఈవెంట్లలో పాల్గొని పెద్ద మనసు చాటుకుందీ బ్యూటిఫుల్ యాక్ట్ట్రెస్. మూగజీవాలపై ప్రేమతో మూడేళ్ల క్రితం ‘వీగన్’గా మారిపోయిన ఈ పెట్ లవర్ ‘వీగన్ ఫ్యాషన్’ను మాత్రమే ఫాలో అవుతూ పలువురికీ స్ఫూర్తినిస్తోంది. ఈ క్రమంలో జంతువుల సంరక్షణ కోసం రిచా చేస్తున్న కృషిని గుర్తించిన ‘పెటా ఇండియా’ ఆమెను ‘బెస్ట్ వీగన్ స్టైల్ ఐకాన్’ పురస్కారంతో గౌరవించింది.
బెస్ట్ వీగన్ ఫ్యాషన్ ఐకాన్‌గా!
మనం నిత్యం వినియోగించే దుస్తులు, వాచ్‌లు, షూస్, చెప్పులు ఇంకా పలు కాస్మెటిక్స్ లాంటి ఉత్పత్తుల తయారీలో జంతు చర్మాలను ఎక్కువగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతువులపై హింసకు వ్యతిరేకంగా ‘వీగన్ ఫ్యాషన్’ పేరుతో పెటా ఇండియా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జంతువులపై జాలి చూపాలని, వీటి చర్మాలతో తయారయ్యే ఉత్పత్తులను వినియోగించవద్దని కోరుతోంది. ఈ క్రమంలో పెటా ఇచ్చిన పిలుపుతో మూడేళ్ల క్రితం పూర్తి వీగన్‌గా మారిపోయింది రిచా చద్దా. వీగన్ డైట్ కారణంగా తన లైఫ్స్టైల్లో ఎలాంటి మార్పులొచ్చాయో పలుసార్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఈ విషయానికి సంబంధించి పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, క్యాంపెయిన్లలో కూడా భాగమైందీ అందాల తార.
అలాంటి ఫ్యాషన్లకు నేను దూరం!
సాధారణంగా సినిమా తారలంటే కొత్త కొత్త ఫ్యాషన్లకు పర్యాయపదంగా నిలుస్తుంటారు. నేటి తరం మెచ్చే దుస్తులు, వాచ్‌లు, షూస్, కాస్మెటిక్స్ ఉత్పత్తులనే వాడుతుంటారు. కానీ వీగన్ ఫ్యాషన్‌ను ఫాలో అవుతోన్న రిచా జంతు చర్మాలతో చేసిన ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రకృతిని, జంతువులను ఇబ్బందిపెట్టే ఫ్యాషన్లకు తాను దూరమంటూ కేవలం కాటన్, న్యాచురల్ ఫ్యాబ్రిక్ దుస్తులకే ప్రాధాన్యమిస్తోంది. అదేవిధంగా జంతువుల చర్మాలతో తయారుచేసే సిల్క్, లెదర్ దుస్తులను అందరూ త్యజించాలని క్యాంపెయిన్లు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలపై అవగాహన కల్పిస్తోంది. ఇలా తన వీగన్ ఫ్యాషన్‌తో పలువురిలో స్ఫూర్తి నింపుతోన్న రిచా సేవలు ప్రశంసనీయమంటోంది పెటా ఇండియా. ఈ సందర్భంగా ఆమె సేవలకు గుర్తింపుగా తనను ‘బెస్ట్ వీగన్ స్టైల్ ఐకాన్’ అవార్డుతో గౌరవించింది.
వీగన్లు బలహీనులు కారు!
ఈ క్రమంలో పెటా ఇండియా పురస్కారం అందుకున్న రిచా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ‘వీగన్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు పెటా ఇండియాకు ధన్యవాదాలు. సాధారణంగా వీగన్లు చాలా బలహీనులని... డిన్నర్లు, పార్టీల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిపై పెద్ద ఎత్తున జోకులు, కామెంట్లు వినిపిస్తుంటాయి. కానీ ఒకసారి మీరూ ఈ హెల్దీ లైఫ్‌స్టైల్‌ను పాటించి చూడండి. వీగన్ డైట్, ఫ్యాషన్ మన శరీరానికే కాదు సమాజానికీ ఎంతో మంచిది. దీనిని అలవాటు చేసుకుంటే పర్యావరణ పరిరక్షణతో పాటు జంతువుల సంక్షేమం కూడా సాధ్యమవుతుంది. అయినా కచ్చితంగా ఈ హెల్దీ లైఫ్‌స్టైల్‌ను పాటించాలని ఎవ్వరూ బలవంతపెట్టాల్సిన అవసరం లేదు. ‘Live And Let Live’ అన్న మాటననుసరించి మార్పు మన మనసులోంచే మొదలవ్వాలి. అలాంటి మార్పు కోరుకుంటూ ముందుకొస్తున్న వారందరికీ నా ప్రేమ, ఆశీర్వాదాలు’ అని రాసుకొచ్చింది రిచా.
సమాజ శ్రేయస్సులోనూ సినిమాకు భాగం!
‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’, ‘మసాన్’, ‘ఫక్రీ’, ‘రామ్‌లీలా’, ‘మై ఔర్ ఛార్లెస్’ ‘సరబ్జిత్’, ‘ఫక్రీ రిటర్న్స్’, ‘సెక్షన్-375’, ‘పంగా’.. తదితర హిట్ చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రిచా. దీంతో పాటు మహిళా సమస్యలు, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మహారాష్ర్ట ప్రభుత్వం ఆమెను అంబేడ్కర్ అవార్డుతో సత్కరించింది. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుందీ అందాల తార.
‘సినిమా ఇండస్ర్టీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, గాడ్‌ఫాదర్ లేని నాకు ఈ పురస్కారం దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పురస్కారాలు నా బాధ్యతను, పని పట్ల విధేయతను మరింత పెంచుతాయి. సినిమాలంటే కేవలం వినోదాన్ని పంచేవే కాదు... సమాజ శ్రేయస్సులోనూ సినిమాకు భాగం ఉంది. మాతో పాటు అందరూ సమాజం పట్ల బాధ్యతగా మెలుగుదాం’ అని ఈ సందర్భంగా పిలుపునిచ్చిందీ ముద్దుగుమ్మ.