‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్లో ఆనందిగా పరిచయమైన అవికా గోర్ తన అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే అభినయంతో పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ ముంబయి ముద్దుగుమ్మ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల సన్నజాజి తీగలా మారి తన అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది. తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిందీ అందాల తార. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిన అవిక... వివిధ సందర్భాల్లో అతడితో కలిసి దిగిన ఫొటోలను అందరితో షేర్ చేసుకుంది.
ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్!
11 ఏళ్ల వయసులోనే ‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్. పలు హిందీ సీరియల్స్‌తో పాటు ‘మార్నింగ్ వాక్’, ‘పాఠశాల’, ‘తేజ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. ఏడేళ్ల క్రితం ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’... వంటి సినిమాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఇక గతేడాది ‘రాజు గారి గది-3’లో అందరినీ భయపెట్టిన ఈ సొగసరి ఇటీవల సన్నగా మారింది. తన వెయిట్‌లాస్ సీక్రెట్స్‌ను అందరితో షేర్ చేసుకున్న అవిక తాజాగా తన ప్రేమ విషయంపై పెదవి విప్పింది. ఓ స్వచ్ఛంద సంస్థకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
నా విషయంలో అది నిజమైంది!
ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన ప్రియుడి ఫొటోలను షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... తన రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘నా ప్రార్థనలకు సమాధానం దొరికింది. నా లైఫ్‌లో లవ్ దొరికింది. ఇకపై అతను నా వాడు. నేను అతనికే చెందుతాను. మనల్ని అర్థం చేసుకుని, నమ్మకం ఉంచుతూ, స్ఫూర్తి నింపుతూ, మన ఎదుగుదలకు దోహదం చేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే జీవిత భాగస్వామిని పొందేందుకు మనం అర్హులం. అయితే అలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం అసాధ్యమని చాలామంది అనుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం ఇది నిజమైంది. అందుకే ఇదంతా ఇప్పటికీ కలలాగే అనిపిస్తోంది. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. ప్రస్తుతం నేను ఎలా ఫీల్ అవుతున్నానో... మీరూ అదే అనుభూతిని పొందాలని ఆశిస్తున్నాను’.
నా జీవితాన్ని పరిపూర్ణం చేశాడు!
‘నాకు ఈ మధురానుభూతిని అందించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు. ఈ బంధం నా జీవితంలో ఎంతో కీలకంగా మారనుంది. అలా అని ఇప్పుడే మాకు వివాహం చేసుకునే ఉద్దేశం లేదు. నా కోసం, నన్ను నిరంతరం సంతోషంగా ఉంచడం కోసం ఒకరు నా జీవితంలోకి వచ్చారు. అది నాకు ఎంతో అందమైన అనుభూతిలా అనిపిస్తోంది. ప్రస్తుతం దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఇడియట్ నా హృదయాన్ని కదిలించాడని చెప్పుకునేందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు చాలా థ్యాంక్స్ మిలింద్. నిన్ను హృదయ పూర్వకంగా ప్రేమిస్తున్నాను’ అని తన ప్రేమకు అక్షర రూపమిచ్చింది అవిక.
ఈ సందర్భంగా తాను ప్రేమలో ఉన్నట్లు తెలుపుతూ అవిక షేర్ చేసిన పోస్ట్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో- పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
అలా ప్రేమలో పడ్డారు!
గతంలో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసిన మిలింద్ ఆ తర్వాత సామాజిక దృక్పథంతో సోషల్ యాక్టివిస్టుగా మారాడు. ఈ క్రమంలో ‘క్యాంప్ డైరీస్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించాడు. ప్రస్తుతం ఈ ఎన్జీవోకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన పలు ప్రభుత్వ పాఠశాలలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు చిత్రలేఖనం, సంగీతం, డ్యాన్స్...వంటి అంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నాడు. సేవా కార్యక్రమాలతో పాటు సినిమాలంటే ఆసక్తి చూపే మిలింద్ ప్రముఖ హిందీ ఛానల్లో ప్రసారమవుతోన్న ఓ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ‘క్యాంప్ డైరీస్’ సంస్థ నిర్వహించిన ఓ సామాజిక సేవా కార్యక్రమంలో అవిక పాల్గొంది. అప్పుడే మొదటిసారిగా మిలింద్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పలు సామాజిక కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నారీ లవ్లీ కపుల్. ఈ ఏడాది మార్చిలో మిలింద్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ అతనితో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది అవిక. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్లు వినిపించాయి. అయితే ఎవరూ తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదు. తాజాగా తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్లు ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్.