తనుశ్రీ దత్తా... మన దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి నాంది పలికిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పడంతోనే ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. ఆమె అందించిన ధైర్యంతోనే వివిధ రంగాలకు చెందిన మహిళలు ‘మాపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి’ అంటూ ఒక్కొక్కరు పెదవి విప్పారు. అంతకుముందు పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన తనుశ్రీ ఈ ఉద్యమం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. అమెరికాలో స్థిరపడినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానంటూ తన అభిమానులకు ఓ తీపి కబురు అందించిందీ అందాల తార. ఈ సందర్భంగా సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
మళ్లీ వస్తున్నా!
జంషెడ్‌పూర్‌కు చెందిన తనుశ్రీ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2004లో ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడామె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆ మరుసటి ఏడాదే ‘ఆషిక్ బనాయే ఆప్నే’ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత ‘చాకొలెట్’, ‘భాగమ్ భాగ్’, ‘36 చైనా టౌన్’, ‘రకీబ్’, ‘ధోల్’, ‘రిస్క్’, ‘గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్’, ‘స్పీడ్’, ‘అపార్ట్మెంట్’... తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక బాలకృష్ణకు జోడీగా ‘వీరభద్ర’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. మొత్తం 15 సినిమాల్లో నటించిన ఆమె తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది.
‘మీటూ’ అంటూ!
2010లో ‘అపార్ట్మెంట్’ అనే బాలీవుడ్ సినిమాలో చివరిగా కనిపించింది తనుశ్రీ. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అయితే రెండేళ్ల క్రితం ‘మీటూ’ ఉద్యమంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇందులో భాగంగా 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయంలో పలువురు ఆమెకు మద్దతు తెలుపుతూ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తనుశ్రీ అందించిన స్ఫూర్తితో మరికొందరు బాధితులు ‘మీటూ’ వేదికగా తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తారు. దీంతో ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపులకు సంబంధించి కొంతమంది ప్రముఖులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తనుశ్రీ కేసుకు సంబంధించి గతేడాది జూన్‌లో నానాపటేకర్ నిర్దోషి అని ముంబయి కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన తనుశ్రీ సోషల్ మీడియా వేదికగా తన ఆవేశాన్ని వెళ్లగక్కింది. న్యాయం జరిగినా...జరగక పోయినా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
అందుకే ఆ జాబ్ వదులుకున్నాను!
ముంబయి కోర్టు తీర్పు తర్వాత తనుశ్రీ అమెరికా వెళ్లిపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తూ లాస్ ఏంజెలిస్లోనే స్థిరపడిందని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్లో తన రీ ఎంట్రీ గురించి అభిమానులకు శుభవార్త వినిపించిందీ ముద్దుగుమ్మ. దీంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇన్‌స్టా వేదికగా అందరితో షేర్ చేసుకుంది.
‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ జాబ్ చేస్తున్నాననే వార్తలు బాగా వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. జాబ్ కోసం శిక్షణ తీసుకున్నది నిజమే. కానీ ఉద్యోగంలో మాత్రం చేరలేదు. నిజం చెప్పాలంటే అమెరికా డిఫెన్స్ రంగంలో నాకో మంచి ఉద్యోగం వచ్చింది. అది ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జాబ్. అందుకు కావాల్సిన అర్హతలన్నీ నాలో ఉన్నాయి. అందులో పనిచేస్తే నా గౌరవం మరింత పెరుగుతుందని నాకు తెలుసు. సాధారణంగా ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరూ అంత సులభంగా వదులుకోరు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత లాస్‌ఏంజెలిస్‌లో కానీ, న్యూయార్క్‌లో కానీ నాకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఉద్యోగాల్లో సెక్యూరిటీ క్లియరెన్స్ లాంటి కఠిన నిబంధనలు అధికంగా ఉంటాయి. పైగా ఉద్యోగంలో చేరే సమయంలో మూడేళ్ల కాంట్రాక్టు కచ్చితంగా ఇవ్వాలి. ఒక్కసారి ఒప్పందంపై సంతకం చేస్తే మూడేళ్ల పాటు అమెరికా విడిచి వెళ్లడానికి లేదు. అయితే నేను నటిగా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకే నా సినిమా కెరీర్‌పై మళ్లీ దృష్టి సారించేందుకు ఈ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది’.
సినిమాల కోసం 15 కేజీల బరువు తగ్గాను!
‘నాకు నటన అంటే చాలా ఇష్టం. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరి చెడ్డవారి కారణంగా నా పనిని మధ్యలోనే వదిలేశాను. అయితే అనుకున్నంత సులభంగా నా వృత్తిని మార్చుకోలేకపోయాను. ఇండస్ట్రీలో మళ్లీ అడుగుపెడదామని నిర్ణయించుకున్నాను. సినిమా పరిశ్రమతో పాటు ముంబయిలో నాకు చాలా మంచి పేరు ఉంది. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేశాను. ఇక ఇక్కడి నుంచే నా సినిమా ప్రాజెక్టులకు సంబంధించిన వర్క్ ప్రారంభిస్తాను. ఇప్పటికే కొన్ని సినిమా ఆఫర్లు చర్చల దశలో ఉన్నాయి. అదేవిధంగా బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సంబంధించి ముంబయిలోని 12 క్యాస్టింగ్ ఆఫీసులు నన్ను సంప్రదించాయి. సినిమా ఇండస్ట్రీలో నా గురించి పూర్తిగా తెలిసిన కొందరు పెద్దలు నాకు కావాల్సిన సాయం, నైతిక మద్దతు అందిస్తున్నారు. నేను అంగీకరించిన కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో షూటింగ్‌లన్నీ వాయిదా పడుతున్నాయి. సినిమాల్లో నటించడం కోసం 15 కిలోల బరువు తగ్గాను. ఇటీవల పాల్గొన్న ఓ యాడ్ షూటింగ్లో ఇంతకు ముందు సినిమాల్లో మాదిరిగా చాలా స్లిమ్‌గా, అందంగా కనిపించాను’ అని ఆ సుదీర్ఘమైన పోస్ట్‌లో రాసుకొచ్చిందీ అందాల తార.