ప్రియాంకా చోప్రా... బాలీవుడ్‌తో ఆగకుండా హాలీవుడ్ వరకూ తన క్రేజ్‌ను విస్తరించుకున్న అందాల తార. అమెరికన్ టీవీ షోలలో సైతం పాల్గొంటూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇక ఫ్యాషన్ల విషయానికొస్తే ఎందరికో ఆమె ఓ ఆరాధ్య తార..! ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుపొందిన నాటి నుంచి ఆస్కార్, కేన్స్, మెట్‌గాలా లాంటి ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో తనదైన స్టైల్‌తో ఆకట్టుకుందామె. రెడ్‌కార్పెట్‌ను హీటెక్కించే తన ఫ్యాషన్ దుస్తులు, అవుట్ఫిట్లతో ఫ్యాషన్ గోల్స్‌ను సెట్ చేసింది. అయితే ఈ అందం, ఫ్యాషన్ వెనక కనిపించని కష్టం ఉందంటోంది ప్రియాంక. పలు సందర్భాల్లో తాను ధరించిన దుస్తుల వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యానంటోంది. ఈ క్రమంలో తాను ఇబ్బందిగా ఫీలైన అవుట్‌ఫిట్స్, ఆ సందర్భాలేంటో అందరితో షేర్ చేసుకుందీ ఫ్యాషన్ క్వీన్.
భారత ఫ్యాషన్ చరిత్రలో 2000 సంవత్సరాన్ని మరిచిపోలేనిదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏడాదే ఫ్యాషన్ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. 1999లో యుక్తాముఖి ‘మిస్ వరల్డ్’ కిరీటం సొంతం చేసుకుంది. ఈ పరంపరను అలాగే కొనసాగిస్తూ 2000లో లారా దత్తా ‘మిస్ యూనివర్స్’ టైటిల్ దక్కించుకోగా అదే ఏడాది ప్రియాంక ‘ప్రపంచ సుందరి’గా అవతరించింది. ఈ కిరీటం కోసం 95 మంది అందాల రాణులు పోటీ పడడం విశేషం. అప్పటివరకు జరిగిన పోటీలతో పోల్చుకుంటే ఎక్కువమంది పోటీదారులు పాల్గొనడం అదే మొదటిసారి. లండన్‌లోని మిలీనియం డోమ్‌లో ఫైనల్ రౌండ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుపు రంగు డ్రస్‌లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయిన ప్రియాంక అందరినీ అధిగమించి ప్రపంచ సుందరి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అప్పుడు చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను ప్రియాంక తాజాగా మరోసారి గుర్తుకు తెచ్చుకుంది.
డ్రస్ జారిపోకుండా అలా చేశాను!
‘2000లో నేను మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నాను. ఆ సమయంలో వేసుకున్న తెలుపు రంగు డ్రస్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆ డ్రస్ నా శరీరానికి తేలిగ్గా అతుక్కుని ఉంది. ఆ పోటీల్లో చిట్టచివరికి నేనే గెలిచాను. అయితే అప్పటికే నా డ్రస్ టేప్ మొత్తం ఊడిపోవడం మొదలైంది. వేదిక మీద నడిచిన ప్రతిసారి ‘నమస్కారం’ పెడుతున్నట్లు చేతులతో డ్రస్‌ను పట్టుకునే ప్రయత్నం చేశాను. ఇది తెలియక అందరూ ‘నమస్కారం’ చేస్తున్నారని అనుకున్నారు. కానీ నిజానికి నా డ్రస్ జారిపోకుండా ఉండేందుకే అలా చేయాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
ఆ డ్రస్‌లో భోజనం కూడా చేయలేకపోయాను!
ఇక ఫ్యాషన్ షోలలో ‘మెట్ గాలా’కు కూడా ప్రత్యేక స్థానముంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రముఖ తారలు, థీమ్ డిజైనింగ్‌తో కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్ ధరించి సందడి చేస్తారు. ఈ నేపథ్యంలో 2018 న్యూయార్క్ వేదికగా జరిగిన ‘మెట్‌గాలా’ ఫ్యాషన్ షోకు తన భర్త నిక్‌జొనాస్‌తో కలిసి హాజరైంది ప్రియాంక. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన దుస్తులు ధరించి పోటీలకు హాజరైందీ ముద్దుగుమ్మ. అయితే రెడ్ కార్పెట్‌పై తనను ఎంతో అందంగా చూపించిన ఈ దుస్తులు శారీరకంగా మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురి చేశాయట.
2018 మెట్ గాలా పోటీలకు గోల్డెన్ హుడ్ కలిగిన బ్లడ్ రెడ్ కలర్ అవుట్‌ఫిట్ ధరించి హాజరయ్యాను. ఈ డ్రస్ నన్ను ఎంతో అందంగా చూపించింది. కానీ దాన్ని ధరించిన తర్వాత నేను ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాను. ఆ డ్రస్ బరువుకు నా పక్కటెముకల ఆకారం మారిపోతుందేమోనని భయమేసింది. ఆ డ్రస్‌లో ఉన్నంత సేపు కనీసం భోజనానికి కూడా కూర్చోలేకపోయాను. ఆరోజు రాత్రి కూడా సరిగా తినలేకపోయాను’ అని తన ఫ్యాషన్ కష్టాల్ని గుర్తుకు తెచ్చుకుంది ప్రియాంక.