ఒక పనిలో పరిపూర్ణత రావాలంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా భరించాలంటోంది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్. ఎలాంటి పాత్రకైనా తనదైన రీతిలో పర్ఫెక్షనిజాన్ని తీసుకొచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘తలైవి’ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం, ఆన్‌స్క్రీన్‌పై జయలలిత పాత్రలో ఒదిగిపోవడానికి ఏకంగా 20 కిలోలు పెరిగిన ఈ మనాలీ బ్యూటీ.. ప్రస్తుతం తాను పెరిగిన బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తనకెదురైన పలు అనుభవాలను సైతం అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటోంది కూడా! ఈ క్రమంలోనే తలైవి కోసం భరతనాట్యం నేర్చుకున్నప్పుడు వెన్ను తీవ్రంగా గాయపడిందని, అయినా పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేయగలిగానన్న సంతృప్తి ముందు ఆ బాధ ఏపాటిదంటూ తన షూటింగ్ అనుభవాలను ట్వీట్స్ రూపంలో పోస్ట్ చేసింది కంగన.
సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోయడానికి చాలామంది హీరోయిన్లు ఎంత కష్టపడడానికైనా సిద్ధపడిపోతున్నారు. ఈ క్రమంలో బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా, మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడానికైనా.. ఇలా తమకొచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కంగన కూడా ‘తలైవి’ కోసం అదే చేసింది. జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జయలాగా కనిపించడానికి ఏకంగా 20 కిలోలు పెరిగిందీ మనాలీ బ్యూటీ. అంతేకాదు.. ఈ చిత్రం కోసం భరతనాట్యం కూడా నేర్చుకుంది. ఇలా పాత్రకు పరిపూర్ణత తీసుకురావడమే తన అంతిమ లక్ష్యమంటోందీ బాలీవుడ్ బేబ్.
30 ఏళ్ల వయసులో 20 కిలోలు!
బరువు పెరగడం, తగ్గడం అనేది అంత సులభమైన విషయం కాదంటోంది కంగన. ఈ క్రమంలో తలైవి సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను కొలేజ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ భామ.. ‘భారతీయ సినీ తెరపై శక్తిమంతమైన మహిళ పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టం. ఇందులోని పాత్రకు తగినట్లుగానే అంతే శక్తిమంతంగా నా శరీరాన్ని మార్చుకోగలిగాను. ఈ క్రమంలోనే 30 ఏళ్ల వయసులో 20 కిలోలు పెరిగాను.. భరతనాట్యం నేర్చుకున్నాను. అయితే వీటి కారణంగా నా వెన్ను తీవ్రంగా గాయపడింది. అయినా సరే.. పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగానన్న సంతృప్తి ఈ బాధలన్నింటినీ మరిపించింది..’ అంటోంది కంగన.
అదంత సులభం కాదు!
అంతేకాదు.. తాను సినిమా కోసం పెరిగిన 20 కిలోల బరువు తగ్గడానికి ప్రస్తుతం తీవ్ర కసరత్తులు చేస్తోందీ అందాల తార. ఈ క్రమంలోనే ఓ కఠినమైన వ్యాయామం చేస్తున్నప్పుడు క్లిక్‌మనిపించిన ఫొటోను ట్విట్టర్లో పంచుకుంటూ.. ‘పెరిగిన బరువు తిరిగి తగ్గడమంటే మాట్లాడుకున్నంత సులభం కాదు. గత ఏడు నెలలుగా నా మునుపటి దృఢత్వాన్ని సొంతం చేసుకోవడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నా. అయినా అది సాధ్యం కావట్లేదు. అందుకు మరో ఐదు కిలోల దూరంలో ఉన్నానన్న నిరాశ నాలో ఉన్నప్పటికీ తలైవి ఫుటేజ్ పర్ఫెక్ట్గా రావడంతో నాలోని బాధ అంతా హుష్‌కాకి అయిపోయింది. ప్రస్తుతం నేను హ్యాపీ!’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుందీ ఆన్‌స్క్రీన్ మణికర్ణిక.
మరి, కంగన చెప్పేది నిజమే కదా! మనం చేసే పనేదైనా సక్సెస్‌ఫుల్‌గా, పరిపూర్ణంగా పూర్తైతే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, బాధలు కూడా ఆ ఆనంద సమయంలో మనకు గుర్తుకు రావు. ఇలా ఈ సినిమాతో పని పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి చాటుకుందీ బాలీవుడ్ బ్యూటీ.
Also Read: ఆ 20 కిలోలు తగ్గడానికే ఈ శ్రమంతా!