ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్... అని రెండు రకాల భావోద్వేగాలుంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకపోయినా, ప్రతికూల ఆలోచనలు మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఈ తరహా ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈక్రమంలో తాను కూడా గతంలో నెగెటివ్ ఆలోచనలతో ఎంతగానో ఇబ్బందిపడ్డానంటోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ అవికా గోర్. చెడు ఆలోచనలతో తన విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానంటోంది. అయితే ఆ తర్వాత తనను తాను నమ్ముకున్నానని, చుట్టూ ఉన్న వాళ్లతో సమయం గడిపి ఈ సమస్యను అధిగమించానంటోంది. ఈక్రమంలో ప్రతికూల ఆలోచనలకు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ ముద్దుగుమ్మ. ప్రతిరోజూ మనతో మనం మాట్లాడుకుంటే, మనల్ని మనం ప్రేమించుకుంటే అన్ని సమస్యలు తీరుతాయనే చక్కటి సందేశాన్ని అందిస్తోన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
‘సెల్ఫ్ లవ్’ అంటూ!
11 ఏళ్ల క్రితం ‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘రాజుగారి గది-3’ సినిమాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఆ సమయంలో తనను తాను అద్దంలో చూసుకొని అసహ్యించుకునేదాన్నని.. అయితే ఆ తర్వాత తన శరీరాన్ని ప్రేమించుకుంటూ తనకు నచ్చినట్లుగా మలచుకున్నానంటూ తన వెయిట్‌లాస్ జర్నీకి సంబంధించిన ఓ ఆసక్తికర పోస్ట్‌ని ఇటీవలే ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తాజాగా ‘సెల్ఫ్ లవ్’ పేరుతో ఎవరి శరీరాన్ని ప్రేమించుకోవాలంటూ మరో పోస్ట్‌తో మన ముందుకొచ్చింది అవిక. ఈక్రమంలో నెగెటివ్ ఆలోచనలకు సంబంధించి తన అనుభవాలను అందరితో పంచుకుంది.
ప్రతికూల ఆలోచనలతో ఇబ్బంది పడ్డాను!
‘ఒంటరితనం వల్ల మీరెప్పుడైనా భయపడ్డారా? ఎప్పుడైనా మీ ఆలోచనలు మిమ్మల్ని కంగారు పెట్టాయా? గతేడాది వరకూ...ఈ ప్రపంచంతో పాటు నా జీవితం గురించి నేను తప్పుగానే ఆలోచించాను. చెడు ఆలోచనల నుంచి బయటపడడం కోసం నా చుట్టూ ఉన్న వారితో ఎక్కువ సమయం గడిపేదాన్ని. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని, కొత్త విషయాలు తెలుసుకునే తాపత్రయంలో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాననిపించేది. అందరి మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపాలంటే నా చుట్టూ ఉన్న వాళ్లతో సమయం గడపాలని, లేకపోతే నెగెటివ్ ఆలోచనల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయం నన్ను వెంటాడేది. ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను‘
మీతో మీరు కొంత సమయాన్ని గడపండి!
‘ఆ తర్వాత కొన్నాళ్లకు వాటి నుంచి బయటికొచ్చి నన్ను నేను ప్రేమించుకోవడం, సంరక్షించుకోవడం మొదలుపెట్టా. ఈ క్రమంలో నాతో నేను ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకున్నా. కొన్నిసార్లు నా ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చేదాన్ని. మరికొన్నిసార్లు డ్యాన్స్, వర్కవుట్లు చేసేదాన్ని. ఇప్పటికీ ఈ అలవాట్లు కొనసాగిస్తున్నా. ఒక్కొక్కసారి నా మనసులో మెదిలే ఆలోచనలను మథించడమే పనిగా పెట్టుకునేదాన్ని. నేను గుంపులో ఉన్నా జోక్స్ వేస్తూ వారందరినీ నవ్వించడం, ఉత్సాహ పరుస్తూ ఆ సంతోషాన్ని వారికి కూడా పంచుతున్నాను. ఎందుకంటే ప్రతికూల ఆలోచనల వల్ల కలిగే భయం ఎలాంటిదో నాకు అనుభవమే! అలాంటి ఫీలింగ్స్ వల్ల నేను కొన్నేళ్ల పాటు బాధపడ్డాను. కాబట్టి ఇలాంటి ఆలోచనల్ని దూరం చేసుకొని సంతోషంగా ఉండాలంటే మీతో మీరు కొంత సమయం గడపండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సెల్ఫోన్లు, కంప్యూటర్లు... ఇవేవీ లేకుండా మీ ఆలోచనలతో మీరు మీ సమయాన్ని ఆస్వాదించండి’ అని రాసుకొచ్చింది అవిక.
అటు ఆలోచింపజేస్తూ, ఇటు చక్కటి సందేశాన్ని అందిస్తోన్న అవిక ‘సెల్ఫ్ లవ్’ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఆమె పోస్టుపై స్పందిస్తున్నారు. ‘బ్యూటిఫుల్’, ‘చాలా అద్భుతంగా చెప్పావు’, అంటూ కామెంట్లు పెడుతున్నారు.