ఎవరైనా తాను అనుకున్న గమ్యానికి చేరుకున్నప్పుడు...తను సాధించిన విజయమే పైకి కనిపిస్తుంది తప్ప.. ఆ గెలుపును చేరుకోవడానికి వాళ్లు పడిన కష్టాలు, కన్నీళ్లు, చేసిన ప్రయత్నాలు ఎవరికీ కనిపించవు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్‌గా వెలుగొందుతోన్న ఎంతోమంది తారలు తమ కెరీర్ ప్రారంభంలో ఎన్నో రకాల ఇబ్బందులు, ఛీత్కారాలు ఎదుర్కొన్న వారే..! ఈక్రమంలో తన జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్లున్నాయంటోందీ బాలీవుడ్ అందాల తార భూమీ పెడ్నేకర్. తాను సినిమాల్లోకి రావడం తన తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదంటోన్న భూమి.. ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
సరిగ్గా ఐదేళ్ల క్రితం ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి. ఆ సినిమాలో సంధ్యా వర్మ అనే పాత్రలో కనిపించిన ఆమె తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకుంది. ఆ సినిమా సమయంలో 89 కిలోలతో బొద్దుగుమ్మగా ఉన్న భూమి.. ఆ తర్వాత ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గింది. ఆ తర్వాత ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథా’, ‘శుభ్ మంగళ్ సావ్ధాన్’, ‘లస్ట్ స్టోరీస్’, ‘సోంఛిరియా’, ‘శాండ్ కీ ఆంఖ్’, ‘బాలా’, ‘పతి పత్నీ ఔర్ వో’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’, ‘భూత్’, ‘డోలీ కిట్టీ ఔర్ వో ఛమక్తే సితారే’.. వంటి కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. కరోనా కారణంగా గత ఏడు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ బాలీవుడ్ భామ.. తిరిగి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికీ కలలాగే ఉంది!
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది భూమి. ఈ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు అధిగమించిన తర్వాతే నటి కావాలనుకున్న తన లక్ష్యం నెరవేరిందంటోందీ సొగసరి. ‘నేను బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అప్పుడే ఐదేళ్లు పూర్తయ్యాయంటే అస్సలు నమ్మలేకపోతున్నా. ఇదంతా ఓ కలలా ఉంది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. చాలామంది నటీనటుల్లాగే నేను కూడా ముంబయిలోనే పుట్టాను. కానీ మా కుటుంబంలో ఎవరికీ సినిమా ఇండస్ర్టీకి సంబంధించిన పరిజ్ఞానం లేదు. నాకు కూడా సినీ ప్రముఖులతో పరిచయాలు లేవు. దీంతో సినిమా పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టాలో నాకు అసలు అర్థం కాలేదు.
లోన్ తీసుకుని ఫిల్మ్ స్కూల్లో చేరాను!
నేనేదో యాదృచ్ఛికంగా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. ఎన్నో ఏళ్ల నుంచే నాకు సినిమాల్లో నటించాలని కోరిక. కానీ ఈ విషయమై మా అమ్మానాన్నలను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను. వారు నా రక్షణ గురించి బాగా ఆలోచిస్తారు. అందుకే నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పగానే వారి ముఖంలో కొంచెం బాధ, విచారం కనిపించాయి. అయినా నా నిర్ణయానికి కట్టుబడి ఫిల్మ్ స్కూల్లో చేరాను. ఫీజు మరీ ఎక్కువగా ఉండడంతో లోన్ తీసుకున్నాను.
13 లక్షల రుణం నా నెత్తిన పడింది!
నటనకు సంబంధించి అంతకుముందు నాకెలాంటి అనుభవం లేదు. పైగా ఫిల్మ్ స్కూల్లో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. అయితే కొన్ని కారణాలతో నేను క్లాసులకు సరిగ్గా హాజరు కాలేకపోయాను. దీంతో ఫిల్మ్ కోర్సులో నేను ఫెయిల్ అవడంతో అక్కడి నుంచి నన్ను బయటకు పంపించారు. ఫలితంగా నటిని కావాలనుకున్న నా ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. పైగా ఫిల్మ్ కోర్సు కోసం తీసుకున్న రూ.13లక్షల లోన్ తీర్చాల్సిన బాధ్యత నాపై పడింది. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. దీంతో మా అమ్మానాన్నలు ఇకనైనా బుద్ధిగా చదువుకోమని సలహా ఇచ్చారు.
ఆరేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా!
జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం సహజం. అంతమాత్రాన మన లక్ష్యాన్ని మార్చుకోలేం కదా...అందుకే అటు ఉద్యోగం చేస్తూనే.. ఇటు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. ఈక్రమంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలో క్యాస్టింగ్ అసిస్టెంట్ చేరాను. అక్కడ జరిగే సినిమా షూటింగ్‌లను దగ్గరి నుంచి చూశాను. సినిమాకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. అక్కడ ఆరేళ్ల పాటు పనిచేసిన తర్వాతే ‘దమ్ లగా కే హైసా’ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. నటిగా నా ప్రతిభేంటో అందరికీ తెలిసింది. అదృష్టవశాత్తూ మంచి కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించే అవకాశాలొచ్చాయి. అలా ఇప్పటివరకు 12 సినిమాల్లో నటించాను’ అని తన అనుభవాలను గుదిగుచ్చిందీ అందాల తార.
సినిమాల విషయానికొస్తే భూమి ప్రస్తుతం ‘దుర్గావతి’ అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులో అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.