టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. మరికొన్ని గంటల్లో (అక్టోబర్ 30) ఈ చందమామ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడవనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్ పొందనున్న ఈ అందాల తారకు సెలబ్రిటీలు, నెటిజన్లు, అభిమానులు ముందస్తుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మెహెందీతో మొదలయ్యాయి!
ఈ సందర్భంగా తన మెహెందీ వేడుకకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది కాజల్. సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి కళ తన మొహంలోనే ఉట్టిపడుతుందేమో అన్నట్లుగా రడీ అయిన ఈ చందమామ.. మెహెందీ చేతులను చూపిస్తోన్న ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. వేడుకల్లో భాగంగా గ్రీన్ కలర్ షరారా అవుట్‌ఫిట్ ధరించింది కాజల్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే రూపొందించిన ఈ డ్రస్ ఖరీదు సుమారు రూ.25వేలని తెలుస్తోంది. డ్రస్‌పై ఫ్లోరల్ ప్రింట్స్, చెవికి ధరించిన పెద్ద రింగులు ఈ కాబోయే పెళ్లికూతురు అందాన్ని రెట్టింపు చేశాయి. ఈ సందర్భంగా కాజల్ సోదరి, నటి నిషా అగర్వాల్, స్టైలిస్ట్ నీరజా కోనలతో పాటు ఇతర నటీనటులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక వరుడు గౌతమ్ కిచ్లూ ఇంట్లో కూడా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతికి కంకణం కట్టుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు గౌతమ్. #kajgautkiched అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ అవుతోన్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఆ ప్రేమకథ కాజల్ చెబుతుంది!
ఈక్రమంలో కాజల్ పెళ్లి కోసం తమ కుటుంబం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోందని చెబుతోంది నిషా అగర్వాల్. ‘కాజల్ తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతోంది. ఇది మా కుటుంబానికి భావోద్వేగంతో కూడుకున్న సమయం. కాజల్ పెళ్లి కోసం మా కుటుంబమంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. కాబట్టి ఇవి మాకు చాలా ప్రత్యేకమైన రోజులు. మరోవైపు కాజల్ వివాహం చేసుకుని, ఇంటి నుంచి వెళ్లిపోతుండడం మమ్మల్ని చాలా బాధిస్తోంది. అందుకే ఇప్పుడే వీలైనంత సమయం అక్కతో గడిపేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఇలాంటి సమయంలో అందరూ పెళ్లి కుమార్తెతో మాట్లాడాలని, తనతోనే ఉండాలని అనుకుంటారు. అందుకే నాకు అక్కతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరకడం లేదు. కరోనా వైరస్ నేపథ్యంలో పెళ్లి వేడుకల్ని నిరాడంబరంగా జరుపుతున్నాం. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరవుతున్నారు. కొవిడ్ ఆంక్షలను పాటిస్తూనే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మా సంప్రదాయం ప్రకారం హల్దీ, మెహెందీ లాంటి ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలన్నీ ఇంట్లోనే జరుగుతాయి. పెళ్లి రోజే సంగీత్ కూడా ఏర్పాటుచేశాం. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, సంతోషం, ప్రేమను పంచుకోనున్నాం. గౌతమ్ గొప్ప వ్యక్తి. అతడిని మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రేమకథ గురించి కాజల్ స్వయంగా ముందుకు వచ్చి ఈ ప్రపంచానికి చెబుతుంది’ అని చెబుతోంది నిషా.
కొత్త ఇంట్లోనే కాపురం!
వివాహ వేడుకలు ముగియగానే ముంబయిలోని కొత్త ఇంట్లోకి మారునున్నారు కాజల్-గౌతమ్. ఇప్పటికే ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్‌ని తమ అభిరుచికి తగ్గట్లుగా చేయించుకుంటున్నారీ లవ్ బర్డ్స్. పైగా గౌతమ్ ఇంటీరియర్ డిజైనర్ కావడంతో కొత్త హంగులతో తమ సొంత ఇంటిని డిజైన్ చేయిస్తున్నారు.