శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే కాస్త ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అందుకే సెలబ్రిటీలందరూ బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని సమయం దొరికినప్పుడల్లా ఔటింగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి తన పుట్టిన రోజు వేడుకల కోసం గోవా వెళ్లింది. తన ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణ, కొద్దిమంది స్నేహితులతో కలిసి అక్కడ తన జన్మదిన వేడుకలు జరుపుకొంది. ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో ఈ ప్రయాణం చాలా అసౌకర్యంగా సాగిందంటూ తన గోవా టూర్‌కు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుందీ మంచు వారి వారసురాలు.
మంచు లక్ష్మి... టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. వెండితెరతో పాటు బుల్లితెరపై మెరుస్తోన్న ఆమె నటిగా, నిర్మాతగా, గాయనిగా, యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది. 2006లో ఆండీ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్న లక్ష్మికి విద్యా నిర్వాణ అనే ఆరేళ్ల కూతురు ఉంది. లాక్‌డౌన్‌లోనూ పలువురు సెలబ్రిటీలతో వర్చువల్‌గా ఇంటర్వ్యూలు నిర్వహించి ఆకట్టుకున్న ఈ అందాల తారకు స్నేహితులతో కలిసి వెకేషన్లకు వెళ్లడం చాలా ఇష్టం. కానీ లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం నిర్వాణ, కొద్దిమంది స్నేహితులతో కలిసి గోవా వెళ్లింది. ఈ సందర్భంగా గోవా పర్యటనతో పాటు ఇటీవల తనపై వస్తున్న ఆన్లైన్ ట్రోల్స్‌కు సంబంధించి తన అనుభవాలను అందరితో షేర్ చేసుకుంది.
అదొక అసౌకర్యమైన అనుభవం!
‘లాక్డౌన్లో నేను పూర్తిగా ఇంట్లోనే ఉన్నాను. కరోనా కారణంగా ఎలాంటి వెకేషన్లకు వెళ్లలేదు. అయితే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాగైనా ఔటింగ్‌కు వెళ్దామని గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకోసం జులై నుంచే ప్రణాళిక వేసుకున్నాను. అనుకున్నట్లుగానే ఇటీవల నా కూతురు, కొద్ది మంది స్నేహితులతో కలిసి గోవా టూర్‌కు వెళ్లాను. సాధారణంగా కరోనా పరిస్థితులు రాకముందు విమానాశ్రయం నుంచే మా సెలబ్రేషన్స్ మొదలయ్యేవి. కానీ కరోనా ప్రభావంతో మా ప్రయాణం చాలా భయంగా అనిపించింది. ఇక ఈ జర్నీలో నా ఆలోచనలన్నీ నిర్వాణ చుట్టూనే తిరిగాయి. సాధ్యమైనంతవరకు తను దేనినీ తాకకుండా చూసుకోవడం పైనే దృష్టి పెట్టాను. మాస్కులు, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్ ధరించే ప్రయాణం చేశాం. నిత్యం శానిటైజర్‌ను వినియోగించాం. ఇలా ఎన్నో జాగ్రత్తల మధ్య సాగిన గోవా ప్రయాణం మాకు ఓ అసౌకర్యమైన అనుభవాన్ని అందించింది.
కానీ ఒక్కసారి గోవా బీచ్‌లోకి అడుగుపెట్టగానే ప్రయాణంలో మాకెదురైన ఇబ్బందులన్నింటినీ మర్చిపోయాం. ఇద్దరం కలిసి సంతోషంగా సమయాన్ని ఆస్వాదించాం. విద్యకు కూడా ఇలాంటి వెకేషన్ చాలా అవసరమనిపించింది. తను ఈ టూర్‌ను బాగా ఎంజాయ్ చేసింది. నా పుట్టిన రోజు వేడుకల కోసం కొద్దిమంది స్నేహితులు కూడా గోవా వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు నా వెంట ఉన్నందుకు నేనెంతో సంతోషించాను. అయితే గతంలో జరిగిన టూర్లతో పోల్చుకుంటే ఈ పర్యటన చాలా భిన్నంగా సాగింది. బర్త్ డే పార్టీకి దూరంగా ఉండి ప్రార్థనలకే అత్యధిక సమయం కేటాయించాం’ అని చెప్పుకొచ్చింది లక్ష్మి.
వర్చువల్‌గా ప్రేక్షకులను అలరించేందుకు!
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్లీ సినీ తారలందరూ షూటింగ్‌లకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా ‘కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు’ అనే ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది లక్ష్మి. వర్చువల్‌గా సాగే ఈ ఆన్లైన్ షో ద్వారా అంతర్జాతీయంగా పేరుపొందిన సెలబ్రిటీల జీవన విధానాన్ని అందరికీ పరిచయం చేయనుందీ అందాల తార.
‘కరోనా ప్రభావంతో నేను ఇప్పుడే షూటింగ్‌లకు హాజరు కాలేను. అందుకే సాధ్యమైనంతవరకు ఇలాంటి వర్చువల్ షోల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ‘కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు’ అనేది ఇంగ్లిష్‌లో నేను చేస్తున్న మొట్టమొదటి కార్యక్రమం. ఇండియా నుంచే కాకుండా అంతర్జాతీయగా కీర్తి గడించిన సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ షో కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని అంటోందీ మంచు వారి వారసురాలు.
అలాంటి వారు మారతారని అనుకోవడం లేదు!
బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తికి మద్దతునిస్తూ ఇటీవల ఓ పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మి. ఈ కేసుకు సంబంధించి టాలీవుడ్ నుంచి స్పందించిన మొదటి సెలబ్రిటీ తనే. అయితే ఈ పోస్టును తప్పుపడుతూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా లక్ష్మిపై విమర్శలు కురిపించారు.
‘ఇటీవల నేను రియాకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాను. దీంతో చాలామంది నాపై నెగెటివ్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా ముసుగులో దాక్కొని కొంతమంది వ్యక్తులు కావాలనే ఇలాంటి నీచమైన కామెంట్లు పెడుతున్నారు. అలాంటి వారు మారతారని నేను ఆశించడం లేదు. ఎవరైనా నెగెటివ్ కామెంట్ చేస్తే వాళ్లని బ్లాక్ చేయడమే నాకు మంచిదనిపించింది. అయితే రియా విషయంలో నాపై వచ్చిన కామెంట్లు చూసి మా అమ్మ ఎంతో కంగారు పడింది. ప్రతిదానికీ మేం సమాధానం చెప్పలేం. మాపై కామెంట్లు చేసే వారు ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది లక్ష్మి.