తెలుగు చిత్ర సీమకు సంబంధించి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది అనుష్క. గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తూనే, నాయికా ప్రాధాన్యమున్న చిత్రాలకు పూర్తి న్యాయం చేస్తోందీ అందాల తార. అందం, అభినయంతో దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకులతో సమానంగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఆమె నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు నటించిన ఈ థ్రిల్లర్ మూవీలో మాటలు రాని, వినికిడి లోపంతో బాధపడే యువతిగా మరోసారి తన అద్భుతమైన నటనతో మెప్పించింది అనుష్క. ఈ సందర్భంగా ఇటీవల ట్విట్టర్లోకి అడుగుపెట్టిన ఆమె #AskAnushka అంటూ తొలిసారిగా అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. మరి అనుష్క, అభిమానుల మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
హాయ్ స్వీటీ... ‘నిశ్శబ్దం’ సినిమాలో మాటలు రాని, వినికిడి లోపం ఉన్న అమ్మాయిగా అద్భుతంగా నటించారు? దీని కోసం ఎలాంటి శిక్షణ తీసుకున్నారు?
ఈ విషయంలో హైదరాబాద్‌లో ఉండే రమ్య, ఆమె టీం నాకు శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా సియాటెల్‌లో ఉంటున్న ఒలీవియా డుంక్లే అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్పించారు. దర్శకుడు హేమంత్ మధుకర్ కూడా సాయం చేశారు.
ఈ లాక్డౌన్లో మీరేం తెలుసుకున్నారు?
ఈ జీవితం, మనచుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ప్రతి క్షణానికి, ప్రతి మనిషికి విలువ ఇవ్వాల్సిందే.
మీ జీవితంలో స్ఫూర్తి నింపిన వ్యక్తులెవరు?
నా తల్లిదండ్రులు, యోగా గురువు... అలాగే నేను ప్రతిరోజూ కలిసేవాళ్లు. అందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు.
మేడమ్ మీ ట్విటర్ అకౌంట్‌కు బ్లూ టిక్ మార్క్ పెట్టించుకోండి. లేకపోతే ఇది మీ ఖాతానా? కాదా? అని అభిమానులు తికమక పడుతున్నారు.
ప్రస్తుతం ఆ ప్రక్రియ కూడా జరుగుతోంది. త్వరలోనే పూర్తవుతుంది.
సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించడానికి భాష అడ్డంకి అని మీరు భావిస్తున్నారా?
నాకు వ్యక్తిగతంగా కొత్త భాషలు నేర్చుకోవడమంటే చాలా ఆసక్తి. ఇక సినిమాల్లో అయితే కొత్త భాషలు నేర్చుకుని నటిస్తేనే నాకు సౌకర్యంగా ఉంటుంది. అదే నాకు ఆసక్తి.
మేడమ్! మీ వాయిస్ చాలా బాగుంటుంది. కనీసం ఒక సినిమాలోనైనా మీ పాత్రకు మీరు డబ్బింగ్ చెప్పుకుంటే వినాలని ఉంది.
భవిష్యత్‌లో కచ్చితంగా చేస్తాను.
మేడమ్! దక్షిణాదిలో కాకుండా ఇతర భాషల్లో నటించే ఉద్దేశం ఏమైనా ఉందా?
సినిమా కంటెంట్ బాగుంటే ఏ భాషలో నటించడానికైనా నేను సిద్ధం. భారతీయ భాషలతో పాటు, కొరియన్, ఇరానియన్, ఫ్రెంచ్ సినిమాల్లో నటించాలని నాకు ఆసక్తి.
నాకు బాధగా అనిపించిన ప్రతిసారీ మీ చిరునవ్వును చూస్తుంటాను. నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు!
నాలో భాగమైనందుకు మీకు కూడా థ్యాంక్స్.
సినిమాలకు సంబంధించి దర్శకుడు, రచయితల ఆలోచనలు మీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
నేను దర్శకుల నటిని. వారి విజన్‌ను అనుసరిస్తాను. నాకంటే సినిమా కంటెంట్ ముఖ్యమని భావిస్తాను.
స్వీటీ... మీ తర్వాతి రెండు సినిమాలు ఏంటి? ‘భాగమతి’ తర్వాత ‘నిశ్శబ్దం’ కోసం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది? ఈ ఎదురుచూపులు మమ్మల్ని చంపుతున్నాయి, మా వల్ల కావడం లేదు.
త్వరలోనే అన్నీ చెబుతాను. అన్నీ కుదిరిన తర్వాతే నిర్మాణ సంస్థలు అధికారికంగా తమ సినిమాలను ప్రకటిస్తాయి.
స్వీటీ... మీ అమ్మ, నాన్న, తమ్ముడు... ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు?
అందరూ బాగున్నారు. థ్యాంక్యూ...బీ సేఫ్!
సాక్షి (‘నిశ్శబ్దం’లో అనుష్క క్యారక్టర్) వంటి సవాలుతో కూడుకున్న పాత్రలో నటిస్తున్నప్పుడు మీకేం అనిపించింది. సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
నటిగా నా పరిధి దాటి నటించిన పాత్ర ఇది. దీని కోసం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఇలాంటి సినిమాలు నా దగ్గరకు రావడం నా అదృష్టం.
మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి?
అందరికీ హాయ్. నేను మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నా. మీ ప్రేమాభిమానాలను నా గుండెల్లో భద్రంగా దాచుకుంటున్నాను. ధన్యవాదాలు!
ఇప్పటివరకు మీరు నటించిన పాత్రల్లో ఇష్టమైనది?
సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం రావడం నా అదృష్టం. అందులో నా మొదటి సినిమా ‘సూపర్’, ‘అరుంధతి’, ‘వేదం’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘సైజ్ జీరో’, ‘బాహుబలి’, ‘తాండవం’ (తమిళం)... సినిమాల్లోని పాత్రలంటే ఇష్టం. ఇలాంటి క్యారక్టర్లు ఇచ్చిన నా దర్శక, నిర్మాతలకు, చిత్ర బృందాలకు ధన్యవాదాలు.
నాది బిహార్, మీకు చాలా పెద్ద అభిమానిని. ప్రభాస్‌తో కలిసి మరో సినిమా చేయండి. మీ జంట చూడముచ్చటగా ఉంటుంది.
మీ ప్రేమకు కృతజ్ఞతలు. కథ కుదిరితే మళ్లీ తప్పకుండా ఆయనతో నటిస్తాను.
‘నిశ్శబ్దం’ సినిమా నుంచి మీరు నేర్చుకున్న మంచి విషయం ఏంటి? భవిష్యత్‌లో మీరు నెగెటివ్ రోల్లో నటించే అవకాశాలు ఉన్నాయా?
‘నిశ్శబ్దం’ సినిమాలోని సాక్షి పాత్ర పోషించడం ద్వారా సైన్ లాంగ్వేజ్‌ను నేర్చుకున్నాను. కథ బాగుంటే అన్ని క్యారక్టర్లు చేయడానికి నేను సిద్ధం.
ఈ డ్రాయింగ్ గీయడానికి నాలుగు గంటలు పట్టింది. ఎలా ఉంది?
థ్యాంక్యూ, థ్యాంక్యూ! (స్మైల్ ఎమోజీని జత చేస్తూ)
నా ఒక్క ప్రశ్నకు కూడా మీరు జవాబు చెప్పలేదు. లవ్యూ సో మచ్ ( ఏడుస్తున్న జిఫ్ షేర్ చేస్తూ).
లవ్యూ.. సారీ.. వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నిస్తున్నాను.
మీ ట్విటర్ ఖాతాను మీరే నడుపుతున్నారా?
నేను, నా టీం కలిసి చూసుకుంటున్నాం.
మీ సీక్రెట్స్‌ను ఎవరితో షేర్ చేసుకుంటారు?
భగవంతుడు నాకు గొప్ప స్నేహితులను, కుటుంబ సభ్యులను ఇచ్చాడు (స్మైలీ ఎమోజీలను షేర్ చేస్తూ)
మీకు ఇష్టమైన యానిమేటెడ్ క్యారక్టర్?
నాకు ‘మోనా’ అంటే చాలా ఇష్టం. ఇంకా ‘నీమో’ పాత్ర కూడా ఇష్టమే.
గతాన్ని మార్చుకోవాలి అనుకుంటారా?
నా జీవితంలోని ప్రతి క్షణం ఈరోజు నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైనదే. అందుకే నేను గతాన్ని మార్చుకోవాలనుకోను.
ఈ ఫొటో గురించి ఒక్కమాట చెప్పండి?
‘మిర్చి’ సినిమా షూటింగ్లో భాగంగా ఓ సన్నివేశం గురించి నేను, ప్రభాస్ మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఆపై అందమైన పోస్టర్‌గా మారింది. నా హృదయానికి చాలా చేరువైన సినిమా ‘మిర్చి’. థ్యాంక్యూ ప్రమోద్, వంశీ, విక్కీ.
మీరు పుస్తకాలు చదువుతారా?మీకిష్టమైన పుస్తకం పేరేంటి?
ది ఆల్కెమిస్ట్.
మీకు ఇష్టమైన జంతువు?
డాల్ఫిన్ అంటే బాగా ఇష్టం.
జీవితం గురించి చెప్పాలంటే?
నన్ను నేను ఇంకా ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను.
మీకు బెంగాలీ తెలుసా? హౌరా బ్రిడ్జి చూశారా? నేను మీకు పెద్ద అభిమానిని.
చూశాను. అక్కడ షూటింగ్ కూడా జరిగింది. నాకు బెంగాలీ స్నేహితులు చాలామంది ఉన్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు.
యోగా టీచర్‌గా మీరేం నేర్చుకున్నారు?
మన సమాజంలో రకరకాల మనుషులున్నారు.. ఎవరి ప్రత్యేకత వాళ్లదే. కాబట్టి మనల్ని మనం గౌరవించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు.