ఆడపిల్లల భద్రతపై మరోసారి సందేహాలు రేకెత్తించింది హథ్రాస్ హత్యాచార ఘటన. నలుగురు దుర్మార్గుల చేతుల్లో ఓ అభాగ్యురాలు బలైపోయిన తీరు, ఆ తర్వాతి పరిణామాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ముక్తకంఠంతో ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను ఉరితీయాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై బాలీవుడ్ నటి కృతి సనన్ స్పందించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఆమె... ఇంటి నుంచే మార్పు మొదలైతేనే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుందంటూ అందులో చెప్పుకొచ్చింది.
ఆ వ్యాఖ్యలను సరిచేయండి!
‘ఆమె అత్యాచారానికి గురైంది’ అని చెప్పకుండా ‘అతడు ఆమెను రేప్ చేశాడు’ అని చెప్పండి. ‘కూతుళ్లను కాపాడుకోండి’ అని చెప్పే బదులు ‘అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీ అబ్బాయిలకు నేర్పించండి’. ‘అమ్మాయిలు త్వరగా ఇంటికి చేరుకుంటే బాగుంటుంది’ అని ఉచిత సలహాలు ఇచ్చే బదులు ‘మీ కుమారులు త్వరగా ఇంటికి వచ్చేలా చూడండి. అప్పుడే ఆడపిల్లలు సేఫ్‌గా ఉంటారు’ అనే వ్యాఖ్యలతో కూడిన ఓ చిత్రాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసిన కృతి.. ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది.
‘గతేడాది (2019) మనదేశంలో రోజుకు సగటున 87 రేప్ కేసులు నమోదయ్యాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించి ఆ ఏడాది మొత్తం 4,05,861 కేసులు రికార్డయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే ఇవి 7 శాతం అధికం. దేశంలో ఏటేటా అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయనడానికి ఈ గణంకాలే నిదర్శనం. ఇప్పుడు జరిగిన ఘటన కొత్తదేమీ కాదు. గతంలో ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లమీద కొచ్చి గొంతెత్తి నిరసన వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్షలు పడాలని కొవ్వొత్తుల ర్యాలీలు, కవాతులు చేశారు. కానీ ఏం లాభం ?సమాజంలో ఎలాంటి మార్పూ రాలేదు’..
అప్పుడు వాళ్లే స్వతంత్రంగా ఎదుగుతారు!
‘ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడాలంటే ముందుగా ప్రజల మనసుల్లో మార్పు రావాలి. ఎన్నో ఏళ్లుగా అనాదిగా వస్తున్న పితృస్వామ్య వ్యవస్థలోని ఆలోచనల్లో మార్పు రావాలి. ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమే అన్న భావన కలగాలి. అబ్బాయిలు ఎంత పొద్దు పోయినా బయట ఉండొచ్చు. కానీ అమ్మాయిలు ఉండకూడదంటారు. ఇలాంటి భావనలను ఆదిలోనే తుడిచి పెట్టాల్సిన అవసరం ఉంది. దుర్గాష్టమి రోజున కుమార్తెల కాళ్లకు మొక్కి, వారిని పూజించే బదులు వారికి సమానమైన అవకాశాలు కల్పించండి. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని అవగాహన కల్పించండి. అప్పుడు వాళ్లే స్వతంత్రంగా ఎదుగుతారు.
ఇక అబ్బాయిలు అడిగిందే ఆలస్యం.. అన్నీ అందించే బదులు ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలో వారికి అవగాహన కల్పించండి. తమ భార్యలను ఎలా గౌరవించాలో చెప్పండి. ఒక స్త్రీని గౌరవించలేని పురుషుడు ‘మగవాడు’ కాదని వారికి నేర్పించండి. ఇంట్లో లింగ సమానత్వం ప్రారంభమైనప్పుడు, మార్పు అనేది తప్పక వస్తుంది’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది కృతి.
‘వన్..నేనొక్కడినే’, ‘దోచెయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘హీరో పంతి’, ‘రాబ్తా’, ‘దిల్వాలే’, బరేలి కీ బర్ఫీ’, ‘లుకాచుప్పి’, ‘హౌస్‌ఫుల్ 4’, ‘పానిపట్’ వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ‘మిమి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో సరొగేట్ మదర్‌గా కనిపించేందుకు ఏకంగా 15 కిలోలు పెరిగి పెద్ద సాహసమే చేసింది కృతి.