‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయానికి తోడు తనకు మాత్రమే సాధ్యమయ్యే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ కన్నడ బ్యూటీ...తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన బీచ్ వర్కవుట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో షేర్ చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఫిట్నెస్ను పెంచుకునేందుకు!
టాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో రష్మిక ఒకరు. తన మనసు బాగోలేనప్పుడల్లా ఎక్కువగా వర్కవుట్లు చేస్తుంటానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ అందాల తార. ఇక లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉన్న ఆమె... మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు రడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తన ఫిట్నెస్ను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇటీవల హైదరాబాద్‌లోని ఓ జిమ్‌లో కూడా జాయిన్ అయ్యిందీ ముద్దుగుమ్మ. రాశీఖన్నా, విజయ్ దేవరకొండ లాంటి సెలబ్రిటీలు కూడా ఇదే జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండడం విశేషం.
సాయంకాలాన... సాగర తీరాన!
సాధారణంగా జిమ్‌లో కుదరకపోతే ఇళ్లల్లోనూ, పచ్చని చెట్ల మధ్యనో వర్కవుట్లు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు చాలామంది. అయితే రష్మిక మాత్రం తాజాగా సముద్రపు ఒడ్డును తన వ్యాయామశాలగా మార్చుకుంది. జిమ్ పరికరాలన్నింటినీ బీచ్‌కు తీసుకెళ్లి ట్రైనర్ సహాయంతో కసరత్తులు చేసింది. సాయంకాలాన..సరిగ్గా సూర్యుడు అస్తమించే వేళ వివిధ రకాల వ్యాయామాలు, వర్కవుట్లు చేసింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.
బాగా అలవాటు పడిపోయాను!
‘ఇది నా మొదటి బీచ్ వర్కవుట్...నిజంగా చెబుతున్నా మొదట చాలా అలసిపోయాను...చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు సముద్రం ఒడ్డున వర్కవుట్లు చేయడానికి బాగా అలవాటు పడిపోయాను. అలల శబ్దం..సముద్రపు మట్టి వాసన...సూర్యాస్తమయాన్ని చూడడం..నా కాళ్ల కింద ఇసుక...ఇదంతా చాలా అందంగా ఉంటుంది. భవిష్యత్‌లో ఇలాంటి వర్కవుట్ వీడియోలను మరిన్ని చేయాలనుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది రష్మిక.
ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు కార్తీ హీరోగా తమిళంలో తెరకెక్కుతోన్న ‘సుల్తాన్’, కన్నడ మూవీ ‘పొగరు’లో హీరోయిన్గా నటిస్తోంది.