చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఎవరింట్లోనైనా మామిడిపండ్లు కనిపిస్తే దొంగిలించడం, తీరా వాళ్లు చూశాక తప్పించుకొని పారిపోవడం, కాలేజ్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్‌తో సినిమాలకు షికార్లకు వెళ్లడం, టీచర్లకు అబద్ధాలు చెప్పి స్కూల్ మానేయడం.. ఇలాంటివన్నీ సిల్లీగానే అనిపించినా మనకు జీవితాంతం తోడుండే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి అందమైన స్మృతులు తన జీవితంలోనూ బోలెడున్నాయంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన.
‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో అనునిత్యం టచ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మ.. #RushHour పేరుతో ఇటీవలే నిర్వహించిన సోషల్ మీడియా చాట్‌తో మరోసారి తన ఫ్యాన్స్‌ని పలకరించింది. ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. తన బ్యూటీ సీక్రెట్స్, క్రేజీ ఫుడ్ కాంబినేషన్స్, తన అభిరుచులు, చిన్ననాటి మధుర జ్ఞాపకాలెన్నో బయటపెట్టిందీ చక్కనమ్మ. మరి, ఇంతకీ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలేంటి? వాటికి రష్మిక చెప్పిన సమాధానాలేంటి? తెలుసుకుందాం రండి..
కంఫర్ట్‌కే నా తొలి ప్రాధాన్యం!
నెటిజన్ : ‘ఓం శాంతి ఓం’లో దీపిక డైలాగ్ చెప్పండి? రష్మిక: ‘ఏక్ చుట్కీ సింధూర్..’ డైలాగ్ చెబుతూ నవ్వుకున్నారు. మీకిష్టమైన దుస్తులు? సౌకర్యంగా ఉండే దుస్తులకే నేను మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నాకు జిమ్ డ్రస్ అంటే ఇష్టం, చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.. బయటికి వెళ్తున్నప్పుడు గౌన్ ఎంచుకుంటా. ఫ్రీగా ఉంటుంది. రోజూ కెమెరా ముందు పనిచేయడం ఎలా ఉంది? ప్రతిరోజూ పరీక్ష రాసినట్లు ఉంటుంది. మనకు ఇచ్చిన డైలాగ్స్ సాధన చేసి, గుర్తుపెట్టుకుని చెబుతుండాలి. రోజూ అలానే జరుగుతుంది. ఇది కాస్త ఒత్తిడితో కూడుకున్నదే.. కానీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నటన బాగుందని మొత్తం చిత్ర బృందం క్లాప్స్ కొట్టినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. చివరికి సినిమా విడుదలైన తర్వాత మీ అందరూ ఇచ్చే రివ్యూల కోసం ఎదురుచూస్తుంటా. వాటిని చదవడం నాకెంతో ఇష్టం. నటి కావాలంటే ఏం చదవాలి? ఏమో.. నాక్కూడా తెలియదు. ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయండి. నటించాలనే కోరిక ఉంటే సినిమాలు బాగా చూడండి. మీ స్కూల్ లేదా, కాలేజీలో జరిగిన ఫన్నీ మొమెంట్? నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నన్ను ట్యూషన్లో చేర్పించారు. నాకు లెక్కలు బాగా వచ్చు (సరదాగా), అందుకే చేర్పించారు. స్కూల్ నుంచి మళ్లీ అక్కడికి వెళ్లాలంటే చాలా కోపం వచ్చేది. ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో మామిడి కాయలు కోశా. ఆ ఇంట్లో ఉండే ఆంటీ చూసేసింది. కర్ర పట్టుకుని తిడుతూ వచ్చింది. మేం పరిగెత్తాం. అదే నా ఫన్నీ మొమెంట్.
|
అక్కడి షాంపూలు బాగుంటాయి!
ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేస్తారు? జిమ్‌కు వెళ్లి విపరీతంగా వర్కవుట్ చేస్తా. మ్యూజిక్ బాగా వింటా. పిచ్చిగా డ్యాన్స్ చేస్తా. డ్రామాలు చూస్తా, ఐస్‌క్రీమ్ తింటా. హోటల్ నుంచి ఏదైనా దొంగిలించారా? నేను చెప్పే సమాధానంతో చాలా మంది సంతోషిస్తారు. హోటల్లో ఉండే షాంపూలు బాగుంటాయి, అవి తెచ్చేసేదాన్ని. ఓసారి తలగడ కవర్ చాలా నచ్చింది. అందుకే దొంగతనం చేసి తెచ్చుకున్నా.. క్షమించండి. సిగ్గుగా ఉంది. ప్రస్తుత క్లిష్ట సమయం గురించి మీరేం చెబుతారు? ఇది మనందరికీ కష్టంతో కూడుకున్న తరుణం. కానీ ఇలానే ఉండిపోదు. పరిస్థితి చక్కబడిన తర్వాత కాలం వృథా అయ్యిందని బాధపడొద్దు. ఇకనైనా ఈ సమయాన్ని భవిష్యత్తులో ఉపయోగపడే పనుల కోసం వెచ్చించండి. క్లాస్‌లు జరుగుతున్నప్పుడు స్నాక్స్ తిని, టీచర్స్‌కు కోపం తెప్పించారా? లేదు.. నేను చాలా మంచి విద్యార్థినిని. కానీ సరిగ్గా చదవను అంతే.. (నవ్వుతూ). అది జన్యుపరంగా వచ్చిన విషయం. మా అమ్మానాన్న కూడా పెద్దగా చదవలేదు. అది వాళ్ల తప్పు.. నా తప్పు కాదు (నవ్వుతూ). కాబట్టి నా తల్లిదండ్రుల వల్లే చెడు విద్యార్థినిని అయ్యా. పరీక్షల్లో చీట్ చేశారా? కాపీ కొట్టలేదు.. కానీ స్నేహితుల సాయం అడిగా.
|
ఐదు నిమిషాల్లో రడీ అయిపోతా!
మీ ఫ్యాన్ మొమెంట్? నేనిప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్నా. నిజానికి నాకు ఇష్టమైన స్టార్ నా ముందు ఉంటే.. నవ్వుతూ మాట్లాడతా అంతే. అదే నాకు ఫ్యాన్ మొమెంట్. మీలో స్ఫూర్తి నింపే అంశం? నేను జీవితంలో గొప్ప స్థాయికి చేరాలి. దానికి హద్దులు లేవు. దక్షిణాదితోపాటు బాలీవుడ్, ఆపై హాలీవుడ్లో కూడా చేయాలి. నెగెటివిటీని ఎలా డీల్ చేస్తుంటారు? తొలుత ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా స్పందించాలో తెలియలేదు. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు విమర్శలు నా దగ్గరికి రాకుండా చూసుకుంటున్నారు. కొన్ని గ్రూప్స్ నాపై విమర్శలు రాకుండా పోరాడుతున్నాయి. వారి వల్ల నేను సంతోషంగా ఉన్నా. లాక్డౌన్లో ఏం చేశారు? నా కుటుంబ సభ్యులతో కలిసి చాలా సమయం గడిపా. వంట నేర్చుకున్నా. కేక్‌లు తయారు చేశా. నా సహనం బాగా పెరిగింది. కెరీర్‌పై మరింత స్పష్టత వచ్చింది. మీరు రడీ కావడానికి ఎంత సమయం తీసుకుంటారు? రెండు విధాలుగా రడీ అవుతుంటా. ఒకటి ఐదు నిమిషాల్లో సిద్ధం కావడం. రెండోది 2-3 గంటలు కేటాయించడం. ఎలా రడీ అవుతాననేది ఆరోజు పని, పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
|
నా క్రేజీ ఫుడ్ కాంబినేషన్ అదే!
మీ ఫోన్లో బాగా వాడే యాప్స్? వాట్సాప్. నా స్నేహితులతో మాట్లాడుతుంటా. మీ వద్ద ఉన్న బొమ్మలు? నా దగ్గర కుక్కలు ఉన్నాయి. బొమ్మలు లేవు. ఓ వీధి కుక్కను కూడా పెంచుతున్నా. అది నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా మరొకరు సంరక్షించలేరు. మీలో మీకు నచ్చని గుణాలు? అతిగా బాధపడుతుంటా. ఇది అంత మంచిది కాదు. మరొకటి నవ్వడం. అన్నింటికీ నవ్వుతూ సమాధానం ఇస్తుంటా, నాకే నచ్చదు. ఇంకొకటి హైపర్. అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది.. నేను గ్రహాంతర వాసినేమోనని! మీకిష్టమైన స్ట్రీట్ ఫుడ్? పానీపూరీ, స్వీట్ పూరీ. మీరు వివిధ రకాల వంటల్ని కలిపి తింటారా? అందులో నేను క్వీన్. బిర్యానీని రసంతో కలిపి తింటాను. పెరుగన్నంలో లేస్ కలిపి తింటా. రైస్, పప్పు, పెరుగు, కర్రీ.. అన్నీ కలిపి తినేస్తా.
|
నా హెయిర్ కేర్ రొటీన్ ఇదే!
మీరు ట్వీట్లో ఎక్కువగా కోతి ఎమోజీ ఎందుకు వాడుతుంటారు? నా ఎమోషన్‌ను కోతి ఎమోజీలు బాగా తెలుపుతాయని అలా చేస్తుంటా. మీకు అవకాశం ఇస్తే.. ఎలాంటి పవర్ కావాలని కోరుకుంటారు? నేను ఎవర్నైనా తాకితే వాళ్లు అనుకున్నది అయిపోవాలి. వాళ్లు ఏం కావాలన్నా జరిగిపోవాలి. అలాంటి శక్తి కోరుకుంటా. మీ జుట్టు చాలా బాగుంది. కిటుకులు చెబుతారా? బాగా నూనె పెట్టండి. వర్కవుట్ తర్వాత తల స్నానం చేయండి. సీరమ్ ఉపయోగించండి. పాలకూర, చేప, బాదం, గుడ్డు.. వంటి ఆహారం తినండి. పాఠశాల రోజుల్లో క్లాసులు ఎగ్గొట్టారా? పాఠశాల రోజుల్లో హాస్టల్లో ఉన్నా. కాబట్టి ఆ అవకాశం లేదు. కానీ కాలేజీ రోజుల్లో మాత్రం క్లాస్‌లకు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేదాన్ని.. అలా ఓసారి కన్నడ చిత్రం ‘గూగ్లీ’ చూశా.. అది నాకు బాగా గుర్తు! కుక్క లేదా పిల్లి.. ఏది ఎంచుకుంటారు? జంతువుల్ని అలా వేర్వేరుగా చూడలేను. నాకు అన్నీ ఇష్టమే!
|
నన్ను పెళ్లి చేసుకోవాలంటే..!
మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు నన్ను కలవండి. ఆ తర్వాత ముందుకెళ్దాం.. (నవ్వుతూ). నా టీమ్ కి మెసేజ్ చేయండి. వాళ్లు నన్ను ఎలా కలవాలో చెబుతారు. మీకు తెలుగు, మరాఠీ వచ్చా? రాదు.. ఏం చేద్దాం..! మీ పేరుకు అర్థమేంటి? రష్మిక అంటే పువ్వులోని మధ్య భాగం.
|
ఇక చివరిగా మీ అందరికీ కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నా. చేతుల్ని తరచూ శానిటైజ్ చేసుకోండి, మాస్కులు ధరించండి. మాస్కు అసౌకర్యంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ తప్పదు. మనమంతా అలవాటుపడాలి. వ్యాయామం చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మరో విషయం.. మీ అందర్నీ నా అభిమానులు అనలేను. అలాగని స్నేహితులుగా చూడలేను.. మిమ్మల్ని పిలవడానికి నాకు ఓ మంచి పేరు సూచించండి. లవ్యూ..!