లావణ్యా త్రిపాఠి... పేరుకు తగ్గట్టే అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించుకుంది. ‘దూసుకెళ్తా’, భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్’, ‘రాధ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అంతరిక్షం’, ‘అర్జున్ సురవరం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకునే ఈ సొగసరి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి ఈ అందాల తారకు, ఫ్యాన్స్‌కు మధ్య జరిగిన సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
ఈ లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు?
ఫ్రీ టైమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓటీటీలో సినిమాలు చూస్తూ సమయం గడుపుతున్నాను.
ఇటీవల మీరు చూసిన మంచి సినిమా ఏది?
‘లూట్కేస్’. నాకు బాగా నచ్చింది. చాలా ఎంటర్టెయినింగ్గా ఉందీ సినిమా.
ఇటీవల మీరు ఏదైనా కొత్త వంటకం నేర్చుకున్నారా?
ఇప్పుడే పాలక్ పన్నీర్ వండాను (నవ్వుతూ).
మీరు హోమ్ బాడీనా?లేదంటే పార్టీలకు వెళుతుంటారా?
నేను హోమ్ బాడీని. ఎక్కువగా ఇంట్లో ఉండడానికే ఇష్టపడతాను. అయితే అప్పుడప్పుడు స్నేహితులతో కలసి పార్టీలకు కూడా వెళుతుంటాను.
రాబోయే రోజులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
నో కరోనా...నో వైరస్ ప్లీజ్! కరోనా అంతమై పోవాలి...ఇతర వైరస్ లేవీ కూడా ఇంకెప్పుడూ రాకూడదని కోరుకుంటున్నా.
మీరు ఎప్పుడైనా ‘టిక్‌టాక్’ ట్రై చేశారా?
ఒకసారి మాత్రమే చేశాను. ఆ తర్వాత నా టిక్‌టాక్ అకౌంట్ డిలీట్ చేశాను.
యూట్యూబ్‌లో చూసి వర్కవుట్లు, వ్యాయామాలు చేయాలని ఎప్పుడైనా ప్రయత్నించారా?
ట్రై చేశాను. కానీ యూట్యూబ్ చూసి ఎప్పుడూ వర్కవుట్లు కంప్లీట్ చేయలేకపోయాను.
మనీషాలా మారిపోయింది!
మనీషా కొయిరాలా-అరవింద్ స్వామి జంటగా నటించిన సినిమా ‘బొంబాయి’. 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్. ప్రత్యేకించి ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ అనే పాట ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతుంది. ఈ సందర్భంగా మణిరత్నం అభిమాని అయిన లావణ్య ఈ అందమైన పాటను మళ్లీ మన ముందుకు తీసుకొచ్చింది. కాసేపు మనీషాలా మారిపోయి అద్భుతమైన స్టెప్పులతో కవర్ సాంగ్‌ను కంపోజ్ చేసింది. అనంతరం ఈ పాటను మణిరత్నం, రెహమాన్, చిత్రలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. అందమైన ఫారెస్ట్ లొకేషన్స్, విజువల్స్‌తో చిత్రీకరించిన ఈ పాటను అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈ పాటను చూసిన సమంత, రితూ వర్మ, శిల్పారెడ్డి, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, దేవిశ్రీ ప్రసాద్...తదితర సెలబ్రిటీలు లావణ్యను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పాటకు ఫిదా అయిన నెటిజన్లు వీడియోపై లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.
ఆ పాటకు కూడా..
ఇలా సరదాగా స్టెప్పులేయడం లావణ్యకు ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నటించిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ సినిమాలోని ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాటకు కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తన అభిమాన హీరోకి అంకితమిస్తూ రూపొందించిన ఈ సాంగ్ కూడా మెగాభిమానులతో పాటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.
|
ఈ సందర్భంగా నెటిజన్లను బాగా ఆకట్టుకున్న ఈ అందాల రాక్షసి వీడియోలు, ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.