ప్రస్తుతం గార్డెనింగ్‌లో తెగ బిజీ అయిపోయింది టాలీవుడ్ బ్యూటీ సమంత. కరోనా ప్రతికూల పరిస్థితులు తనకు జీవితం విలువ తెలియజేశాయని, అవే తనను గార్డెనింగ్ వైపు పురికొల్పాయని గతంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ రూపంలో చెప్పుకొచ్చిన సామ్.. ఇక అప్పట్నుంచి మొక్కల్నే తన కన్న పిల్లలుగా చూసుకుంటోంది. ఇలా తన ఆహారాన్ని తాను పండించుకునే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులు, చిట్కాలను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుల రూపంలో పంచుకుంటూ మురిసిపోతోందీ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తాజాగా మరో పోస్ట్‌తో మన ముందుకొచ్చిందీ టాలీవుడ్ అందం. విత్తనాల్ని ఎలా విత్తుకోవాలి?, ఈ క్రమంలో పాటించాల్సిన నియమాలేంటి? తదితర విషయాలన్నీ తాజా ఇన్‌స్టా పోస్ట్ ద్వారా పంచుకుంది సమంత.
#GrowWithMe అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా తన గార్డెనింగ్ అనుభవాలను పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ అక్కినేని వారి కోడలు పిల్ల.. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడంలో భాగం కావాలని కోరుతోంది. ఈ క్రమంలోనే తమ గార్డెనింగ్ ఫొటోలు, వీడియోలను ఈ హ్యాష్‌ట్యాగ్ వేదికగా పోస్ట్ చేయమని, నలుగురికీ ఆదర్శంగా నిలవమని పిలుపునిస్తోంది.
నాటే ముందు ఇవి గుర్తుంచుకోండి..!
రోజురోజుకీ తన గార్డెనింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటోన్న సామ్.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న చిట్కాల్ని ఇన్స్టాగ్రామ్ పోస్టుల రూపంలో తన ఫ్యాన్స్తోనూ పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విత్తనాల ఎంపిక, వాటిని నాటే విధానం గురించి పలు చిట్కాలు చెబుతూ గార్డెనింగ్ పాఠాలు నేర్పుతోందీ క్రేజీ ప్లాంట్ లేడీ! ‘విత్తనాలు నాటడమెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. * మీరు నాటే విత్తనం ఆరోగ్యంగా ఉండాలి. అలాకాకుండా అనారోగ్యకరమైన విత్తనం నాటితే మొలకలు బలహీనంగా వస్తాయి. అవి అంతే అనారోగ్యంగా పెరుగుతాయి కూడా! * బలహీనమైన విత్తనాలు చాలా తేలికగా ఉంటాయి.. నీటిలో వేస్తే పైకి తేలుతాయి.. సాధారణ పరిమాణం కంటే చిన్నగా ఉంటాయి.. పాలిపోయినట్లుగా, విత్తనాల పైపొర చారల్లా ఉంటుంది. కాబట్టి విత్తనాల్ని కొనేటప్పుడు వాటి ఎక్స్పైరీ తేదీ చూసి కొనడం మంచిది. * విత్తనాల్ని పొడిగా, చల్లగా ఉన్న ప్రదేశంలో, సూర్యరశ్మికి దూరంగా భద్రపరచాలి. నాటే ముందు వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే ఆ విత్తనాల నుంచి వచ్చిన మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.
* విత్తనం నాటే ముందు మట్టి లేదా కోకోపీట్‌ని కాస్త తడపాలి.. అలాగని ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీళ్లు పోయకూడదు. పై పొర తడిసేలా నీళ్లు చల్లితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసినా విత్తనం అడుగుకు వెళ్లిపోతుంది. * మట్టి ఉపరితలం నుంచి ఒకటి లేదా రెండు సెంటీమీటర్ల లోతున విత్తనం నాటాలి. అంతకంటే మరీ లోతుకు నాటడం వల్ల మొక్క బయటికి రావడం కష్టమవుతుంది. * విత్తనం నాటే క్రమంలో కుండీలో నింపే మట్టి లేదా కోకోపీట్ మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా ఉండేలా నింపుకోవాలి. * మీకు వీలైతే విత్తనం నాటిన ప్రదేశాన్ని రెండుమూడు రోజుల పాటు ఏదైనా వస్తువుతో కవర్ చేయండి. అయితే ఆ ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు నీటితో తడపడం మాత్రం మర్చిపోకండి. తద్వారా రెండుమూడు రోజుల్లో విత్తనం నుంచి మొలకలు రావడం గమనించచ్చు. * నర్సరీ బ్యాగ్ లేదా ట్రేలో నాటిన విత్తనం మొలకెత్తి.. దానికి మూడు నాలుగు ఆకులు వచ్చాక కుండీలోకి లేదంటే గార్డెన్‌లోకి మార్చుకోవచ్చు. * ఒకవేళ మీరు హైడ్రోపోనిక్స్ (మట్టి లేకుండా కేవలం నీటి సహాయంతో మొక్కల్ని పెంచే పద్ధతి) విధానంలో మొక్కలు పెంచాలనుకుంటే నెట్ పాట్లో ఉంచిన కోకో కాయిర్ని అలాగే తీసుకెళ్లి NFT ఛానెల్ (మొక్కలకు నీరు అందించే పైపు)లో అమర్చితే సరిపోతుంది. మొక్కలు మన పిల్లల్లాంటివి (బేబీస్).. వాటిని జాగ్రత్తగా చూసుకుందాం.. సో, మరి మీరు కూడా విత్తనాలు నాటిన ఫొటోల్ని #GrowWithMe హ్యాష్‌ట్యాగ్ వేదికగా పంచుకోండి..’ అంటూ అందరికీ ఉపయోగపడే చిట్కాల్ని అందించిందీ ముద్దుగుమ్మ.
|
ఇలా గార్డెనింగ్ టిప్స్ అందిస్తూ సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు స్పందిస్తూ ఈ క్యూటీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘గార్డెనింగ్ గురించి నాకు బోలెడన్ని సందేహాలున్నాయి. మీ పోస్ట్ ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పింది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.