సమంత... విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన ఫ్యాషనబుల్ ఫొటోలు, సినిమా విశేషాలతో పాటు బ్యూటీ సీక్రెట్స్, హెల్త్ టిప్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. లాక్డౌన్ కారణంగా పూర్తికే ఇంటికే పరిమితమైన ఈ అందాల తార ఇంట్లోనే ఆహారాన్ని పండిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో పంచుకుంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆన్లైన్లో అభిమానులతో ముచ్చటించే సామ్... తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను పలకరించింది. ట్విట్టర్ వేదికగా ‘#AskSam’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
ఈ కరోనా కష్టకాలంలో మీ ఫ్యాన్స్‌కు మీరెలాంటి సందేశమిస్తారు?
కరోనా కారణంగా ప్రస్తుతం అందరం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొందరైతే మరీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆపత్కాలం త్వరగా అంతమైపోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను.
లాక్డౌన్లో మీరు చేసిన మంచి పని ఏంటో చెబుతారా?
ఈ లాక్డౌన్లో ఓ స్పెషల్ ప్రాజెక్టు మీద వర్క్ చేశాను. అదేంటో త్వరలోనే మీ అందరికీ చెబుతాను. అలాగే ఈ లాక్డౌన్ కారణంగా కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికింది. అలాగే చిన్న విషయాలు కూడా ఒక్కోసారి ఎంతో సంతోషాన్నిస్తాయన్న విషయం ఈ ఖాళీ సమయంలోనే అర్థమైంది.
కష్టపడి పనిచేసేందుకు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు?
గతంలో ఓడిపోతాం అనే భయంతో ఎక్కువగా కష్టపడేదాన్ని. కానీ కరోనా వల్ల నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి నాకు సంతోషాన్నిస్తాయి అనే విషయాలకు మాత్రమే కష్టపడాలని నిర్ణయించుకున్నా. ‘బీ హ్యాపీ’ అనే ఆలోచనే నన్ను మోటివేట్ చేస్తోంది. మరింత కష్టపడేలా చేస్తోంది.
నటిగా మీకెలాంటి రోల్స్ చేయడం కష్టమనిపిస్తుంది?
గౌతమ్ మీనన్‌తో కలిసే వరకు రొమాన్స్ చాలా కష్టమనుకున్నాను. నందినీ రెడ్డితో కలిసి సినిమా తీసే వరకు కామెడీ చేయలేనేమో అనుకున్నాను. అదేవిధంగా రాజ్ అండ్ డీకేతో కలిసే వరకూ యాక్షన్ సీక్వెన్స్ కష్టమనుకున్నాను. కానీ ఇప్పుడెలాంటి పాత్రలైనా భయపడడం లేదు. నటిగా అన్ని క్యారక్టర్లనూ ఎంజాయ్ చేస్తున్నా.
మీరు ఇప్పటివరకు చాలా జోనర్లలో సినిమాలు చేశారు. మరి మీకు ఇష్టమైన జోనర్ ఏది?
ఫేవరెట్ జోనర్ అంటూ ఏదీ లేదు. కానీ గత సినిమాల్లో ఏది చేశానో దాన్ని మళ్లీ పునరావృతం చేయాలనుకోను. వాటికంటే భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తాను. సేమ్ క్యారక్టర్లు రిపీట్ చేస్తే మీతో పాటు నాకు కూడా బోర్ కొడుతుంది.
ఇది న్యూట్రిషన్ వీక్. మీరు చేస్తున్న అర్బన్ గార్డెనింగ్ గురించి కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకోరా?
ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాల్లో మొక్కలు పెంచడం చాలా అవసరం. అదేవిధంగా కరోనా ప్రభావంతో మనతో పాటు మన కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన ఆహారంపై మరింత శ్రద్ధ పెరిగింది. కాబట్టి కొంత మోతాదులోనైనా మన ఆహారాన్ని మనమే పండించుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
మేడమ్! మీరు ఇంట్లో చేస్తున్న గార్డెనింగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి ఇదే స్ఫూర్తితో వారాంతంలో రైతులతో కలిసి వ్యవసాయం చేయొచ్చుగా!
వీకెండ్లో రైతులతో కలిసి వ్యవసాయం చేయడమనేది నిజంగా మంచి ఆలోచన. దీని గురించి తప్పకుండా ఆలోచిస్తాను.
‘ఏకమ్’ పాఠశాల ఏర్పాటు చేయడానికి మీకు స్ఫూర్తి ఏంటి?
భవిష్యత్ తరాల ప్రయోజనార్థం కోసమే దీన్ని ఏర్పాటు చేశాం. ఎడ్యుకేషన్ అంటే కేవలం అకడమిక్ చదువులు మాత్రమే కాదు.. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది కూడా. చిన్న వయసులోనే పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్కు ప్రాధాన్యమివ్వాలి. దీంతో పాటు చిన్నారులకు సంబంధించి అన్ని విషయాలపై వారికి అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
జీవితంలో ఎదురైన ఓటములు, ఎదురుదెబ్బలను మీరు ఎలా తీసుకుంటారు?
అందరి జీవితాల్లో ఓటములు, ఎదురుదెబ్బలు ఉంటాయి. నా వరకు వస్తే ఓటముల ప్రభావాన్ని నా పని మీద, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ల మీద పడకుండా జాగ్రత్త పడతాను. వాటిని అధిగమించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.
ఐదారేళ్ల నుంచి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను. కానీ మీరు సమాధానం ఇవ్వడం లేదు?
ఐ యామ్ రియల్లీ వెరీ వెరీ సారీ... మీలాంటి వారి వల్లే నేను ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాను. నేను రిప్లై ఇవ్వకుండా ఎవరినైనా బాధించి ఉంటే దయచేసి నన్ను మన్నించండి. ఐ లవ్యూ ఆల్!
మీ జీవితంలో ఎవరిపై ఎక్కువగా కృతజ్ఞతా భావం ఉంది?
ఉదయం నిద్ర లేవడంతోనే ఆ రోజుకు మొదట నేను కృతజ్ఞతలు చెబుతాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ, పీల్చుకునే స్వచ్ఛమైన గాలి, గార్డెన్, ప్లాంట్స్, పెట్స్...ఇంకా నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞతలు చెబుతుంటాను.
మీ జీవితాన్ని మరింత మెరుగుపరిచిన మూడు అలవాట్లు ఏంటి?
ఆహార నియమాలు, యోగా, మెడిటేషన్.
మీరు ఆరోగ్యంగా, అందంగా, ఫిట్‌గా ఉండడానికి పాటించే డైట్ నియమాలు ఏవి?
నా డైట్ సూపర్ సింపుల్‌గా ఉంటుంది. నేను వీగన్ కావడంతో మాంసాహారం ముట్టుకోను. డెయిరీ ఉత్పత్తులు తీసుకోను. కేవలం కూరగాయలు, అన్నం మాత్రమే తింటాను.
ఇప్పటివరకు మీ సినిమా ప్రయాణం ఎలా సాగింది? కొత్తగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేవారికి మీరిచ్చే సందేశం?
నిజం చెప్పాలంటే నటిగా నేను ఇంకా ఎదగలేదనిపిస్తుంది. నేనింకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మ్యాజికల్ ఫాంటసీ లాంటిది. ఇక్కడ ఉండడం నా అదృష్టమనే చెప్పుకోవాలి.
చివరిసారిగా మీరు ఎప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు?
మూడు రోజుల క్రితం నేను నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రషెస్ చూశాను. అప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నా.
మీరు ఒత్తిడిని ఎలా తట్టుకోగలుగుతారు? మీ స్ట్రెస్ బస్టర్స్ ఏంటి?
నేను ధ్యానం బాగా చేస్తాను. దీని కారణంగా లాక్డౌన్లో మరింత దృఢంగా మారాను. ఇది నాలో సానుకూల దృక్పథాన్ని నింపింది. మీరూ కూడా మెడిటేషన్ చేయండి. కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ ఏడాది పూర్తయ్యేలోపు మీరు పూర్తి చేయాలనుకుంటున్న మూడు పనులు ఏంటి?
2020లో నేను ఎలాంటి ప్రణాళికలు పెట్టుకోలేదు. అదే నా బెస్ట్ ప్లాన్!