ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా ప్రస్తుతం మనదేశంలోనూ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజుకు లక్షకు దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా సోకి కోలుకున్న బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండడం కొంచెం ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మహమ్మారి బారిన పడి కోలుకున్న వారు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక వైరస్‌ను జయించిన సెలబ్రిటీలు కూడా తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌కు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తద్వారా అభిమానుల్లో భయం పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో తమిళ నటి నిక్కీ గల్రానీ కొద్ది రోజుల క్రితం కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వారాల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా కొవిడ్‌కు సంబంధించి తన అనుభవాలను ఓ వీడియో రూపంలో పంచుకుంది.
తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది నిక్కీ గల్రానీ. ‘కృష్ణాష్టమి’, ‘మలుపు’, ‘మరకతమణి’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ సొగసరి...కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్న ఆమె...ఇంట్లోనే చికిత్స తీసుకుని వైరస్‌పై విజయం సాధించింది. ఈ సందర్భంగా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలంటూ కరోనాకు సంబంధించి కొన్ని జాగ్రత్తలను అందరితో షేర్ చేసుకుంది.
అందుకే ఇలా మీ ముందుకొచ్చాను!
‘కొవిడ్-19 కారణంగా కొన్ని నెలలుగా మనందరం చాలా క్లిష్ట పరిస్థితును ఎదుర్కొంటున్నాం. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదృష్టవశాత్తూ నేను ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నాను. మళ్లీ సాధారణ జీవితం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో నా ఆరోగ్యం కోసం ప్రార్థించి, ప్రేమాభిమానాలు పంచి, నాలో సానుకూల దృక్పథం నింపిన వారందరికీ ధన్యవాదాలు. కరోనా కారణంగా భయం, ఆందోళన మన మెదడును తినేస్తున్న క్రమంలో ఈ మహమ్మారికి సంబంధించి నా అనుభవాలను షేర్ చేసుకునేందుకు ఇలా మీ ముందుకొచ్చాను’.
వైరస్ నా దాకా ఎలా వచ్చిందో తెలియట్లేదు!
‘నేను కరోనాకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. అయినా ఈ వైరస్ నాకు సోకింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు ఈ వైరస్ మన దాకా ఎలా వస్తుందో తెలియట్లేదు. మొదట్లో జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కనిపించాయి. సుమారు 5-6 రోజుల పాటు ఈ లక్షణాలు నన్ను బాధించాయి. ఆ తర్వాత దాదాపు 12 రోజుల పాటు వాసన, రుచిని పసిగట్టే సామర్థ్యం కోల్పోయాను. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నాను. అందులో పాజిటివ్ అని తేలడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నాను. అలా సుమారు 2 వారాల అనంతరం మళ్లీ సాధారణ స్థితికి వచ్చాను.’
కరోనా పరీక్షలంటే కంగారెందుకు?
‘దురదృష్టవశాత్తూ చాలామంది కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. టెస్ట్‌లో కరోనా పాజిటివ్ వస్తుందన్న భయమా? లేకపోతే ఒంటరిగా 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలన్నా భయమా ?.. అసలు వారెందుకు కంగారుపడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై ఏదేదో ప్రచారం జరుగుతోంది. అదంతా నిజం కాదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నా మీ దగ్గర మొబైల్ ఫోన్, టీవీ అన్నీ ఉంటాయి. మీకిష్టమైన వారితో రోజూ వీడియో కాలింగ్‌లో మాట్లాడవచ్చు. మీకిష్టమైన సినిమాలు చూడొచ్చు. మీకిష్టమైన ఫుడ్ తినవచ్చు. కాబట్టి ఏ మాత్రం లక్షణాలున్నా నిర్లక్ష్యం చేయద్దు. వెంటనే టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ అని తేలితే భయపడొద్దు. వైద్యుల సలహాల మేరకు చికిత్స తీసుకోండి. ’
ఏమీ లేదనుకోవద్దు!
‘కరోనా మనల్ని ఏం చేయలేదులే’ అని చాలామంది యువకులు, ఆరోగ్య వంతులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. కొవిడ్‌ను సీరియస్‌గా తీసుకోకుండా రిలాక్స్డ్గా, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న చాలామంది యువకులను నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటి వారితోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. దయచేసి ఈ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టండి. ఏమీ లేదనుకుని మీ కుటుంబ సభ్యులను, మీ చుట్టుపక్కల వారిని ఇబ్బందుల్లోకి పడేయకండి. ఈ మహమ్మారి అంతమయ్యేంతవరకు బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం.’
సొంత వైద్యం వద్దు!
‘కరోనా నివారణకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ తెలుసు. కానీ ఈ వ్యాధి నయం అవడానికి చాలామంది బాధితులు సొంత వైద్యాన్ని ఆశ్రయిస్తున్నట్లు నేను విన్నాను. వైరస్ తీవ్రత అనేది మనిషి, మనిషికి మారుతోంది. అదేవిధంగా బాధితుడి వయస్సు, కనిపించే లక్షణాల తీవ్రతను బట్టి కూడా చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్నేహితులు, చుట్టుపక్కల వారిని చూసి సొంత వైద్యం తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. దయచేసి వైద్యుల సలహాలు, సూచనలను పాటించండి. ఇక చివరిగా కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ ధన్యవాదాలు. ఈ విపత్కర పరిస్థితుల్లో బయటకు అడుగుపెట్టేందుకు చాలామంది భయపడుతుంటే మీరు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న నాకు ఫోన్ చేసి మరీ నా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైరస్‌పై విజయం సాధించేందుకు అవసరమైన సానుకూల దృక్పథాన్ని నింపారు. మాలాగే మీకు కుటుంబాలు ఉన్నాయని తెలుసు. అయినా ప్రజల కోసం అలుపెరగని కృషి చేస్తున్న మీ కరోనా వారియర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే ఈ మహమ్మారి మనందరినీ విడిచిపెట్టిపోతుందని ఆశిస్తూ...లవ్యూ ఆల్ !’ అని తన కరోనా కథను అందరితో షేర్ చేసుకుందీ అందాల తార.