అందాల తారలను అభిమానించే వారే కాదు... వారిపై విమర్శనాస్త్రాలు సంధించే వారూ చాలామందే ఉంటారు. నేరుగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా పలువురు సెలబ్రిటీలపై విమర్శలు రావడం సహజమే. ఈ క్రమంలో శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ కూడా తన డ్రస్సింగ్, సినిమాలు, ఇతర విషయాల్లో అప్పుడప్పుడు విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉంది. ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమా విడుదలై కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో- తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను ఎలా సానుకూలంగా మార్చుకుంటుందో జాన్వీ ఓ సందర్భంలో షేర్ చేసుకుంది.
అతిలోక సుందరి ‘శ్రీదేవి’ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ‘ధడక్’ తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటనలో తల్లికి తగ్గ తనయ అనిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్న ఆమె ఇటీవల ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ గా మన ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కూడా జాన్వీ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో చిత్రం కొన్ని వివాదాల్లో చిక్కుకుపోవడంతో ఆమెపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.
ఆ మాటలకు బాధపడను!
జాన్వీ మొదటి సినిమా ‘ధడక్’ విడుదలకు కొన్ని నెలల ముందే శ్రీదేవి మరణించింది. దీంతో వెండితెరపై తన కూతురిని చూడాలనుకున్న తన ఆకాంక్ష నెరవేరకుండానే ఆమె కన్ను మూసింది. ఈ క్రమంలో మొదటి సినిమా నుంచే తనపై విమర్శలు మొదలయ్యాయంటోంది జాన్వీ.
‘నాపై విమర్శలు రావడం మొదటి సారేమీ కాదు. రెండేళ్ల క్రితం నా మొదటి సినిమా ‘ధడక్’ విడుదలైనప్పుడు నాకు తీవ్రమైన విమర్శ ఒకటి ఎదురైంది. ఇప్పుడు నీ సినిమా చూసేందుకు మీ అమ్మ (శ్రీదేవి) లేకపోవడం మంచిదైందని కొందరు కామెంట్ చేశారు. అయితే అలాంటి విమర్శల ప్రభావం నాపై పడకుండా చూసుకుంటాను. ఆ మాటలతో నన్ను నేను బాధకు గురి చేసుకోను. ఆ విమర్శలను నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు లభించిన ఓ అవకాశంగా భావిస్తాను’ అని తన సానుకూల దృక్పథాన్ని బయటపెట్టిందీ ముద్దుగుమ్మ.
అదే నన్ను ముందుకు తీసుకెడుతోంది!
బాలీవుడ్లో ప్రస్తుతం బంధుప్రీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో దివంగత నటి శ్రీదేవి-నిర్మాత బోనీ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీపై కూడా విమర్శలు వస్తున్నాయి. ‘నాకున్న సినీ నేపథ్యం కారణంగానే ‘ధడక్’ సినిమా నాకు దక్కింది. అందులో దాచడానికి ఏమీ లేదు. ఈ విషయంలో నాపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను చూసి నేనేమీ బాధపడట్లేదు. సినిమా ఇండస్ట్రీలో నా కాళ్లమీద నేను నిలబడేందుకు, నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఈ విమర్శలను ఆయుధంగా మలుచుకొంటాను. సినిమా పరిశ్రమలో నన్ను నేను నిరూపించుకోవాలన్న ఒత్తిడి కారణంగానే ‘గుంజన్ సక్సేనా’ కోసం ఎంతో కష్టపడ్డాను. నా శ్రమకు తగ్గట్లే సినిమాలో నా నటన విమర్శకుల మెప్పు పొందింది. కొన్ని రివ్యూలు చదువుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయితే ఈ ప్రశంసలతో నేనేమీ పొంగిపోవడం లేదు. ఇప్పటికీ నా భవిష్యత్‌పై నాకు చాలా బెంగ ఉంది. అయితే ఆ ఒత్తిడే నన్ను మరింత ముందుకు తీసుకెళుతుంది. ఓ మంచి నటిగా, అంతకంటే మంచి వ్యక్తిగా ఎదిగేందుకు నాకెంతగానో సహకరిస్తుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
అమ్మలేని లోటు తెలియకుండా!
శ్రీదేవి జయంతి (ఆగస్టు 13) ఒక్కరోజుకు ముందే ‘గుంజన్ సక్సేనా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ‘ఆగస్టు 12న నా రెండో సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నా అభినయాన్ని మెచ్చుకుంటూ మరుసటి రోజు చాలామంది నాకు సందేశాలు పంపారు. అదే రోజు అమ్మ పుట్టిన రోజూ కావడంతో నా సంతోషం డబుల్ అయ్యింది. ఒకవేళ అమ్మ ప్రస్తుతం ఈలోకంలో ఉండి ఉంటే నన్ను చూసి చాలా గర్వపడేది. నా నటనకు దక్కిన ప్రశంసలను చూసి చాలా మురిసిపోయేది. తన సంతోషాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలను చెన్నైలోని తన సోదరి, కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ పంపేది. అయితే అమ్మలేని లోటు తెలియకుండా ప్రస్తుతం నాన్న ఆ పని చేస్తున్నాడు’ అని తన తండ్రి గురించి తెలిపింది జాన్వీ.
అమ్మే ఆదర్శం కానీ...!
శ్రీదేవి నట వారసురాలిగా తల్లికి తగ్గ తనయ అని నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది జాన్వీ. అయితే అభినయంలో అమ్మను అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటానంటోంది ముద్దుగుమ్మ. ‘అమ్మలాగే నటన కూడా నా జీన్స్‌లోనే ఉంది. అందుకే అమ్మను ఆదర్శంగా తీసుకునే సినిమాల్లోకి వచ్చాను. అయితే అభినయంలో అమ్మను అందుకోవడం నాకు సాధ్యం కాదని తెలుసు. అందుకే ఆమెను అనుకరించకుండా నాకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘రూహీ అఫ్జానా’, ‘దోస్తానా 2’ తదితర చిత్రాలు ఆ కోవలోకే వస్తాయి. నా మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాల్లో నా నటన చాలా వైవిధ్యంగా, విభిన్నంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది జాన్వీ.