మోడల్‌గా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది బిపాసా బసు. హిందీ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ, హాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల తార 2016లో సహనటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోన్న బిపాసా ఐదేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం ‘డేంజరస్’. బిపాసా తన భర్తతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ వెబ్‌సిరీస్ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ..
అందుకే ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను!
నేను 15 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించాను. 19 ఏళ్ల నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. నా జీవితంలో అధిక సమయాన్ని సినిమాలకే కేటాయించాను. దీంతో జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించింది. ప్రత్యేకించి నా వ్యక్తిగత జీవితం కోసం కొంచెం సమయం వెచ్చించాలనుకున్నాను. అందుకే ఈ ఐదేళ్లు సినిమాల నుంచి విరామం తీసుకున్నాను. నా భర్తతో మరింత అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకున్నాను. అదేవిధంగా నా తల్లిదండ్రులు, సోదరీమణులతో గడిపాను. మన జీవితం ఎప్పుడెలా మారుతుందో మనం వూహించలేం. అందుకే నాకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకున్నాను. నటిగా నేను సాధించిన దానితో నేనెంతో సంతృప్తిగా ఉన్నాను. కానీ జీవితం అంటే అదొక్కటే కాదు కదా. మనల్ని ఇష్టపడే వ్యక్తుల కోసం, కుటుంబం కోసం కొంచెం సమయమైనా కేటాయించాలి కదా..! ప్రస్తుతం నేను నా భర్త, కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నాను. సినిమాలు, కుటుంబానికి సమ ప్రాధాన్యమిస్తూ వృత్తిగత, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చేస్తున్నాను.
అలా లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేశాం!
లాక్డౌన్ సమయాన్ని మేమిద్దరం బాగా సద్వినియోగం చేసుకున్నాం. మెడిటేషన్, వర్కవుట్స్, గార్డెనింగ్, కుకింగ్‌కి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. గార్డెనర్ అవసరం లేకుండానే ఎన్నో కొత్త మొక్కలు నాటాం. నేను కూడా ఇంట్లోనే కూరగాయలు పండించాను. వాటితో రుచికరమైన వంటకాలు తయారుచేసి ఓ ఇంటర్నేషనల్ చెఫ్‌లా మారిపోయాను (నవ్వుతూ). అదేవిధంగా టీవీలో ఇష్టమైన సినిమాలు, కార్యక్రమాలు చూస్తూ గడిపాం.
కరణ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు!
నేను, కరణ్ కలిసి గతంలో ‘ఎలోన్’ అనే సినిమాలో నటించాం. పెళ్లయ్యాక మళ్లీ నేను ముఖానికి మేకప్ వేసుకోలేదు. దీంతో సినిమాల్లో ఎందుకు నటించడం లేదని చాలామంది దర్శకులు, నిర్మాతలు నన్ను అడిగారు. ఒక సందర్భంలో అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయం గురించి నన్ను అడిగారు. అదే సమయంలో నా భర్త కరణ్ కారణంగానే నేను సినిమాల్లో నటించడం లేదనుకుని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయమై కరణ్ కూడా చాలా బాధపడ్డాడు. అందుకే సినిమాల్లో నటిస్తానని నా భర్తకు ప్రామిస్ చేశాను. అనుకున్నట్లే మీ ముందుకు వచ్చాను.
కలిసి నటిస్తే అదే అడ్వాంటేజ్!
సినిమాల్లో నటించేటప్పుడు నటిగా నాకు కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నాను. రొమాంటిక్ సీన్స్ షూట్‌కి సంబంధించి గతంలో నేనెంతో ఇబ్బంది పడ్డాను. ప్రత్యేకించి మాధవన్‌తో లిప్‌లాక్ అంటే చాలా భయపడిపోయాను. ఎందుకంటే అతను నా క్లోజ్ ఫ్రెండ్. అంతమంది షూటింగ్ సిబ్బంది మధ్య రొమాంటిక్ సీన్స్ చేయాలంటే సహజంగానే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయంలో కో-స్టార్‌గా కరణ్ నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. అతనితో కలిసి నటించడం వల్ల అడ్వాంటేజ్ అదే. భార్యా భర్తలు కలిసి నటిస్తే చాలా ఉపయోగాలున్నాయి. భావోద్వేగాలు చాలా సహజంగా పలుకుతాయి. ప్రత్యేకించి శృంగార, ప్రణయ సన్నివేశాల్లో నటించడం ఈజీ అవుతుంది.
నా కరణ్ అలాగే చేస్తాడు!
లాక్డౌన్లో భార్యాభర్తలుగా మా బంధం మరింత బలపడింది. భర్తలందరూ రోజూ పడుకునే ముందు ఓ అరగంట పాటు భార్య పాదాలకు మసాజ్ చేస్తే చాలు. భార్యలు ఎంతో ప్రేమ నింపేసుకుంటారు. నా కరణ్ అలాగే చేస్తాడు (నవ్వుతూ). దాంపత్య బంధంలోకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తికావడంతో చాలామంది ‘పిల్లలెప్పుడు’? అని అడుగుతున్నారు. మా జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించేందుకు మేం కూడా ఆశగా ఎదురుచూస్తున్నాం. మాకు సొంతంగా పిల్లలు పుట్టకపోయినా ఈ లోకంలో చాలామంది అనాథ పిల్లలున్నారు. వారిలో ఒకరిని దత్తత తీసుకుంటాం. మరి దేవుడు ఏం రాసిపెట్టాడో!