కరోనా మహమ్మారి ఏ మాత్రం కనికరించడం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక వైపు నుంచి అందరినీ వెంటాడుతూనే ఉంది. అందుకే సామాన్యులే కాదు...పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆ విషయాన్ని నిరభ్యంతరంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. తమ సందేశాల ద్వారా ఫ్యాన్స్‌లో కొవిడ్ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా తమిళ నటి నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్న ఆమె త్వరలోనే ఈ వైరస్‌పై విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే ఐశ్వర్యారాయ్, స్మిత, ఐశ్వర్యా అర్జున్, రాజమౌళి, ఎస్పీ బాలు, తేజ...తదితరులు కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నిక్కీ గల్రానీ కరోనా బాధితుల జాబితాలో చేరిపోయింది. ‘కృష్ణాష్టమి’, ‘మలుపు’, ‘మరకతమణి’ తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల తార పలు డబ్బింగ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో గత వారం కొవిడ్ బారిన పడిన ఆమె ఈ మహమ్మారికి సంబంధించి తన అనుభవాలను ఓ లేఖ ద్వారా షేర్ చేసుకుంది.
జ్వరం, గొంతునొప్పితో బాధపడ్డాను!
‘నాకు గత వారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. కొవిడ్ నుంచి క్రమంగా కోలుకుంటున్నాను. ఈ సందర్భంలో నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ, ఆరోగ్య సిబ్బందికి, చెన్నై కార్పొరేషన్ అధికారులకు నా కృతజ్ఞతలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై ఏదేదో ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ పక్కన పెడితే ఈ మహమ్మారికి సంబంధించి నా అనుభవాలను షేర్ చేసుకునేందుకు ఇలా మీ ముందుకొచ్చాను. నాకు ప్రారంభంలో గొంతునొప్పి, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఏదేమైనా ప్రస్తుతం నేను కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నాను. ఈ క్రమంలో ఇంట్లోనే క్షేమంగా, సురక్షితంగా ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.’
అది వూహించుకోవడానికే భయంకరంగా ఉంది!
‘కరోనా కారణంగా ప్రస్తుతం మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇదే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, ఎదుటివారి ఆరోగ్యం గురించి ఆలోచించడం చాలా అవసరం. నా వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నేను కరోనా నుంచి సురక్షితంగా బయటపడతానని భావిస్తున్నాను. ఒకవేళ నా తల్లిదండ్రులు, పెద్దలు, స్నేహితులకు ఈ వైరస్ సోకినట్లయితే...ఇది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. కాబట్టి అందరూ దయచేసి మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. నిరంతరం చేతులు శుభ్రం చేసుకోండి. అత్యవసరమైతేనే తప్ప బయటికి వెళ్లొద్దు.’
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
‘కరోనా ప్రభావంతో కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉంటున్నాం. ఇలా అస్తమానం ఇంట్లోనే ఉండాలంటే విసుగొస్తుందని తెలుసు. కానీ మనం ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాం. అదే సమయంలో సమాజం కోసం మన వంతు సహాయం చేయడానికి కూడా ఇదే సరైన సమయం. ఈ హోమ్ క్వారంటైన్లో కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపండి. స్నేహితులతో ఫోన్లో మాట్లాడండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. డిప్రెషన్ లాంటి సమస్యలు ఎదురైతే వెంటనే మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించండి’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.