అమ్మతనం.. ఆడజన్మకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అందుకే పెళ్లైన ప్రతి మహిళా తాను అమ్మగా ఎప్పుడెప్పుడు ప్రమోషన్ పొందుతానా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఇక అలాంటి అమ్మతనాన్ని పరిపూర్ణం చేసే ప్రక్రియ బ్రెస్ట్‌ఫీడింగ్. తల్లి తన బిడ్డకు ఎంత ఎక్కువ కాలం పాటు పాలిస్తే అంత మంచిది. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అయితే కొత్తగా తల్లైన మహిళలు అటు తన పాపాయి సంరక్షణ చూసుకుంటూ, ఇటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. మరోవైపు ఇంటి పనుల్నీ సమన్వయం చేసుకుంటారు. ఈ క్రమంలో వారిపై చాలా ఒత్తిడి పడుతుంది. కానీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవం’ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డి. కొత్తగా అమ్మతనంలోకి అడుగుపెట్టిన మహిళలకు అటు భర్త, ఇటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండదండలు చాలా ముఖ్యమని, తద్వారా అమ్మలు ఎలాంటి ఆందోళన చెందకుండా పిల్లలకు పాలివ్వడం, అన్ని పనుల్ని సమన్వయం చేసుకోవడం వీలవుతుందని చెబుతూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ బ్యూటిఫుల్ మామ్.
సమీరా రెడ్డి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మామ్‌గా నేటి తల్లులందరిచేతా ప్రశంసలందుకుంటోందీ అందాల అమ్మ. ఇందుకు కారణం.. ఆమె తరచూ ఇన్‌స్టా వేదికగా పెట్టే పోస్టులే! బాడీ షేమింగ్, ప్రసవానంతర డిప్రెషన్, తల్లిపాల ప్రాముఖ్యత, కొత్తగా తల్లైన మహిళలు ఎదుర్కొనే సమస్యలు.. తదితర విషయాల గురించి వివరిస్తూ నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపుతోందీ లవ్లీ మామ్. అంతేకాదు.. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు హన్స్, నైరాలతో అనుక్షణం అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ ఆ ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సమీర.
వారికి మీరే మోటివేటర్!
ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా తాజాగా మరో పోస్ట్‌తో మన ముందుకొచ్చేసిందీ అందాల అమ్మ. నైరా పుట్టి ఏడాది దాటినా తాను ఇప్పటికీ తన బిడ్డకు పాలిస్తున్నానని, ప్రతి మహిళా తన పిల్లలకు వీలైనన్ని ఎక్కువ రోజులు పాలివ్వాలని చెబుతూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ని రాసుకొచ్చింది.
తన చిన్నారి పాపను ఎత్తుకొని దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన సమీర.. ‘భర్తలు, స్నేహితులు, అత్తయ్యలు.. ఇలా ఎవరైనా కావచ్చు.. మీ ఇంట్లో కొత్తగా తల్లైన మహిళలకు మీరే ఒక మోటివేటర్ కావాలి.. అన్ని విషయాల్లో వారికి అండగా నిలవాలి. తల్లిపాల వారోత్సవం సందర్భంగా అలాంటి తల్లులందరిపై ప్రేమతో మెలుగుతామని, వారిని ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తామని మీకు మీరే ప్రమాణం చేసుకోండి. ప్రసవం తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అటు పాపాయి ఆలనా పాలన చూసుకోవడం, ఇటు ఇంటి పనుల్ని సమన్వయం చేసుకోవడం, నిద్రలేమి రాత్రులు గడపడంతో వారిపై ఎంతో ఒత్తిడి పడుతుంది. ఇలా అధిక పనిభారం, మానసిక-శారీరక ఒత్తిడితోనే కొంతమంది మహిళలు తమ చిన్నారులకు పాలిస్తున్నారు. కానీ అది తల్లీబిడ్డల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ఇలాంటి సమయంలో కొత్తగా తల్లైన వారికి తమ కుటుంబం పూర్తి మద్దతుగా ఉండాలి. ప్రసవానంతరం వారు తిరిగి పూర్తిగా కోలుకోవడానికి తగిన పోషకాహారం అందించాలి. వారిని అనుక్షణం ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చూసుకోవాలి. తద్వారా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది.
మా ఆయన బంగారం!
నా భర్త అక్షయ్.. ప్రతి విషయంలోనూ నన్ను ప్రోత్సహిస్తుంటారు.. నాకు మద్దతుగా నిలుస్తుంటారు. నాకెదురయ్యే ప్రతికూల పరిస్థితుల గురించి నాతో చర్చిస్తారు.. వాటిని నేను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు అందిస్తారు. అలా తను నన్ను నిరంతరం ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు కాబట్టే నేను నా కూతురు నైరాకు ఏడాది దాటినా పాలివ్వగలుగుతున్నా. ఎనలేని సంతోషంతో పాటు ఒత్తిడిని కూడా అందించే అమ్మతనంలోని మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే కొత్తగా తల్లైన మహిళలందరికీ తమ కుటుంబ సభ్యుల మద్దతు తప్పనిసరిగా ఉండాల్సిందే! తమ ప్రేమకు ప్రతిరూపాన్ని అందించిన భార్యలకు.. భర్తలు అనుక్షణం మద్దతుగా నిలబడాల్సిందే! అందరూ బ్రెస్ట్ఫీడింగ్ని ప్రోత్సహించండి..!’ అంటూ తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తూ క్యాప్షన్‌ని రాసుకొచ్చిందీ లవ్లీ మామ్.
ఇప్పుడే కాదు.. భర్తలు కొత్తగా తల్లైన తమ భార్యలకు అన్నివేళలా మద్దతుగా నిలవాలంటూ గతంలోనూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది సమీర. ఇలా ప్రతిక్షణం సాటి మహిళల్లో స్ఫూర్తి నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోందీ అందాల అమ్మ.