కరుణ లేని కరోనాకు పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా అనే తేడాలేమీ తెలియవు. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. సామాన్యులే కాదు...పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతోనే జయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఐశ్వర్యారాయ్ ఆమె ఎనిమిదేళ్ల కూతురు కరోనాపై విజయం సాధించారు. పది రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఈ తల్లీ కూతుళ్లు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చేశారు.
పదిరోజుల తర్వాత ఇంటికి!
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అంతకుముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఈ వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకోగా అమితాబ్ సతీమణి జయా బచ్చన్‌కు నెగెటివ్‌గా తేలింది. ప్రారంభంలో ఎలాంటి కరోనా లక్షణాలు లేని ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. కానీ పది రోజుల క్రితం స్వల్ప లక్షణాలు బయటపడడంతో ఇద్దరూ ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే తాజాగా కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారీ తల్లీకూతుళ్లు.
మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది!
ఇక ఆస్పత్రిలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నాడు అభిషేక్ బచ్చన్. ఈ సందర్భంగా తమ కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు అభిషేక్. ‘ మా ఆరోగ్యం కోసం మీరు చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. తాజాగా ఐశ్వర్య, ఆరాధ్యలకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇద్దరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. నేను, నా తండ్రి ఇద్దరం ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాం’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చాడు అభిషేక్.