‘దిల్ బేచారా’...సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. యాదృచ్ఛికమో, కాకతాళీయమో లేక కథ అలాగే కుదిరిందేమో తెలియదు కానీ... ఈ సినిమాలో మాదిరిగానే రియల్ లైఫ్‌లోనూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు సుశాంత్. దీంతో ‘దిల్ బేచారా’ సినిమాను చూసిన వారంతా ఈ యంగ్హీరోని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక ఈ సినిమాను వీక్షించిన సుశాంత్ తోటి నటీనటులు అతనితో గడిపిన అద్భుత క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ కృతి సనన్ కూడా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
కంటతడి పెట్టిస్తున్నాడు!
అందం, అభినయం ఉన్న సుశాంత్ గతేడాది చివరిలో ‘చిచ్చోరే’ అనే సినిమాలో కనిపించాడు. సినిమా చివరలో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడీ యంగ్‌హీరో. ఇక అతడు చనిపోయాక సుమారు నలభై రోజుల తర్వాత విడుదలైన చిత్రం ‘దిల్బేచారా’. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇద్దరు ప్రేమికులకు సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా తన నటనతో కంటతడి పెట్టించాడు సుశాంత్. ప్రత్యేకించి ఈ సినిమాలో క్యాన్సర్‌తో కన్నుమూసే సుశాంత్ క్యారక్టర్‌ను చూసి అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ‘రాబ్తా’ సినిమాలో అతడితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న కృతి సనన్ కూడా ఈ సినిమాను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయింది. ఈ సందర్భంగా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది.
నా హృదయం మళ్లీ ముక్కలైంది!
సుశాంత్‌కు సంబంధించిన ఫొటోలను ఓ వీడియో రూపంలో పంచుకున్న కృతి ఇలా రాసుకొచ్చింది. ‘నేను దీనిని జీర్ణించుకోలేకపోతున్నా. మ్యానీ (సినిమాలో సుశాంత్ పేరు)ని చూసి నా హృదయం మరోసారి ముక్కలైపోయింది. చాలా సందర్భాల్లో నువ్వు నిజంగానే మళ్ళీ పుట్టి ఈ లోకంలోకి వచ్చావనిపించింది. ఇక ఎప్పటిలాగే నీ అసలైన క్యారక్టర్‌ను ఆ పాత్రలో పెట్టి అలరించావు. సినిమాలో నువ్వు సైలెంట్ గా ఉన్న సన్నివేశాలన్నీ నాకు ఓ మేజిక్‌లా అనిపించాయి. మౌనంగా ఉంటూనే కళ్లతోనే విషయాలన్నీ చెప్పేశావు’ అంటూ రాసుకొచ్చిన కృతి ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సంజనా సంఘీకి కూడా అభినందనలు తెలిపింది. ఇక ఈ పోస్ట్‌ను చూసిన దియామీర్జా, హ్యుమా ఖురేషి, రితేష్ దేశ్‌ముఖ్ తదితర సెలబ్రిటీలు లవ్, హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు.
ఆ ఒక్క క్షణం నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుండేది!
‘రాబ్తా’ లో కలిసి నటించిన సుశాంత్, కృతి ఆ సినిమా తర్వాత మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో గతంలోనూ సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టిందామె. వివిధ సందర్భాల్లో అతడితో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ ‘ సుశ్...ఎంతో చురుకైన నీ మెదడే నీ బెస్ట్ ఫ్రెండ్. కానీ అదే నీ శత్రువని నాకు తెలుసు. బతకడం కంటే చావడమే సులభమని నువ్వు భావించే క్షణం వచ్చిందన్న విషయం నన్ను బాగా కుంగదీస్తోంది. ఆ ఒక్క క్షణం నీ చుట్టూ మనుషులు ఉంటే బాగుండేది అనిపిస్తోంది. నీ మనసులో రేగిన అలజడిని నేను గుర్తించాల్సింది. కానీ నేను అలా చేయలేకపోయాను. ఇంకా ఏవేవో జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా హృదయంలోని ఒక భాగాన్ని నువ్వు పట్టుకెళ్లావు. అది ఎప్పుడూ నిన్ను సజీవంగానే ఉంచుతుందనుకుంటున్నా. నీ సంతోషం కోసం నిరంతరం ప్రార్థిస్తూనే ఉంటాను’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది కృతి.
Photo: Instagram