సుశాంత్ సింగ్ రాజ్‌పుత్...తన నటనతో అనతి కాలంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ హీరో అర్ధాంతరంగా తనువు చాలించాడు. కారణమేదైనా తన బలవన్మరణంతో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచాడీ యంగ్ హీరో. సుశాంత్ చనిపోయి సుమారు నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అతని స్నేహితులు, సన్నిహితులు అతడి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా అతనితో గడిపిన అద్భుత క్షణాలు, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంది నటి రియా చక్రవర్తి. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేసింది.
నువ్వు నాతో కలిసి ఈ సినిమా చూస్తున్నావని తెలుసు!
‘చిచ్చోరే’ సినిమా తర్వాత సుశాంత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. సంజనా సంఘి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైంది. సుశాంత్ నటించిన చివరి సినిమా కావడంతో అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని, సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది రియా. ఈ చిత్రం రిలీజ్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ ‘నిన్ను చూసినప్పుడల్లా నాలోని అణువణువూ మరింత బలపడుతుంది. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వు నాతోనే ఉన్నావు. నిన్ను, నువ్వు అందించిన ప్రేమను అనుక్షణం ఆస్వాదిస్తున్నా. నువ్వు ఎప్పటికీ నా హీరోనే. ఇప్పుడు నువ్వు నాతో కలిసి ఈ సినిమా చూస్తున్నావని తెలుసు’ అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చిందీ బ్యూటీ.
నా షూటింగ్ స్టార్ మళ్లీ నా దగ్గరకు రావాలి!
తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమాతో సందడి చేసిన రియా సుశాంత్‌తో డేటింగ్ చేసిందన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కూడా సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుందామె. వివిధ సందర్భాల్లో అతడితో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ ‘నువ్వు లేవన్న నిజాన్ని నమ్మలేక నా భావోద్వేగాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. నా హృదయంలోని అలజడి నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ప్రేమ పట్ల అపార నమ్మకాన్ని కలిగించింది నువ్వే. దాని శక్తిని నాకు తెలిసేలా చేసిందీ నువ్వే. ఓ సింపుల్ మేథమేటికల్ ఈక్వేషన్ ద్వారా మన జీవితాలు ఎలా ఉంటాయో అర్థమయ్యేలా చెప్పావు. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాల నుంచి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానని నీకు ప్రామిస్ చేస్తున్నా. ప్రస్తుతం ఎంతటి ప్రశాంత వాతావరణంలో నువ్వు ఉన్నావో నాకు అర్థమవుతోంది. ‘ఓ గొప్ప భౌతిక శాస్త్రవేత్త మన దగ్గరకు వచ్చాడు’ అంటూ చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు చప్పట్లు కొడుతూ నిన్ను స్వాగతించి ఉంటాయి. ఎంతో ప్రశాంతంగా అక్కడ నువ్వు ఓ షూటింగ్ స్టార్‌గా వెలుగుతూనే ఉంటావని ఆశిస్తున్నా. నా షూటింగ్ స్టార్ మళ్లీ నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను..’
మన అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు..!
‘ఈ ప్రపంచంలో అత్యంత అందమైన, అద్భుతమైన వ్యక్తివి నువ్వు. ఈ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఎంతో మంచి మనసుతో ప్రేమించావు. మన మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. నువ్వు నాకు దూరమై నెల రోజులు దాటింది. అయినా నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. బీ ఇన్ పీస్ సుశీ’ అని ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చింది రియా.
నువ్వెక్కడున్నా మాతోనే ఉంటావు!
సుశాంత్ చనిపోయిన సుమారు 40 రోజుల తర్వాత ‘దిల్ బేచారా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రముఖులు, అభిమానులు సుశాంత్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భూమి పడ్నేకర్, జెనీలియా, తాప్సీ, స్వరా భాస్కర్, అంకితా లోఖండే తదితరులు ‘నువ్వెక్కడున్నా మాతోనే ఉంటావు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.