కనికరం లేని కరోనా అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓవైపు లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటూనే...మరోవైపు బతికున్నవారిని మానసికంగా ఇబ్బంది పెడుతోంది. ప్రత్యేకించి లాక్డౌన్ కాలంలో పలువురి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. కరోనాకు ముందు ఓ మోస్తరుగా జీవించిన కుటుంబాలు కూడా ఈ వైరస్ ధాటికి కకావికలమమయ్యాయి. దీంతో ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లు’ ఉపాధి కోల్పోయిన చాలామంది ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈక్రమంలో గతంలో హిందీ టీవీ సీరియల్స్‌తో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న వందనా విత్లానీ నేడు ఆదాయం కోసం ఆన్లైన్లో రాఖీలు అమ్ముతోంది.
ఆదాయం లేకపోవడంతో ...!
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా, సీరియల్స్ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కరోనా భయం నేపథ్యంలో ఇంకా పూర్తిస్థాయిలో షూటింగ్‌లు జరగడం లేదు. దీంతో నటననే నమ్ముకుని జీవిస్తున్న చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనేపథ్యంలో ‘సాథ్ నిభానా సాథియా’ సీరియల్‌తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న వందనా విత్లానీ నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సీరియల్ ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ పేరుతో తెలుగులోనూ ప్రసారమై విశేష ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్లో ఊర్మిళ పాత్రతో అందరి ప్రశంసలు అందుకున్న వందన నేడు ఆదాయం కోసం ఆన్లైన్లో రాఖీలు విక్రయిస్తోంది. ఈ సందర్భంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె కరోనా తమ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఇలా చెప్పుకొచ్చింది.
ఇంకా లక్షలాది రూపాయలు రావాల్సి ఉంది!
‘నేను గతేడాది ‘హమారీ బహూ సిల్క్’ సీరియల్లో నటించాను. ఇందులో భాగంగా మే నుంచి అక్టోబర్ వరకు రెగ్యులర్‌గా షూటింగ్‌లకు హాజరయ్యాను. అయితే ఇప్పటివరకు నాకు మే మాసానికి సంబంధించిన రెమ్యునరేషన్ మాత్రమే అందింది. ఇంకా నాకు లక్షలాది రూపాయలు రావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఒక్క పైసా అందలేదు. 2019 నవంబర్ లో ‘ముస్కాన్’ అనే ఓ సీరియల్లో కూడా యాక్ట్ చేశాను. అదృష్టవశాత్తూ ఈ సీరియల్ ద్వారా కొంత డబ్బు నాకు చేతికి అందింది. కానీ అవి ఎన్ని రోజులు వస్తాయి? అందుకే ఆదాయం కోసం ఇలా ఆన్లైన్లో రాఖీలు అమ్ముతున్నా. దీని వల్ల మరీ ఎక్కువ ఆదాయమేమీ రావడం లేదు. కానీ ఈ ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఈ మాత్రం డబ్బైనా చేతికందుతున్నందుకు సంతోషంగా ఉంది.’
మా పిల్లల కాలేజీ ఫీజులు కట్టాలి!
‘నా భర్త విపుల్ కూడా వినోద రంగంలోనే ఉన్నారు. థియేటర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఆయనకు ప్రస్తుతం ఎలాంటి ఉపాధి దొరకడం లేదు. కొత్త సీరియల్స్, షోల కోసం జనవరి, ఫిబ్రవరిలో జరిగిన కొన్ని ఆడిషన్లలో పాల్గొన్నాను. కానీ కరోనా దెబ్బకు అన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం నేను ‘క్రైం అలర్ట్’ అనే ఓ సీరియల్లో మాత్రమే నటిస్తున్నా. దీంతో ఆర్థికంగా మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మా పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు కూడా కట్టాల్సి ఉంది. ఈ సమస్యల నుంచి మమ్నల్ని గట్టెక్కించడానికి ఏవైనా కొత్త ప్రాజెక్టులు మా ఇంటి తలుపు తడతాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాం’.
న్యూమరాలజీ ప్రకారం రంగులు !
‘నటిగా నన్ను పక్కన పెడితే నాలో ఓ న్యూమరాలజిస్ట్ కూడా ఉంది. అందుకే ప్రజల జీవితాల్లో ఆనందం నింపడానికి ఇలా ఆన్లైన్లో రాఖీలు విక్రయిస్తున్నాను. ఎవరైతే తమ సోదరులు, ఆత్మీయులకు రాఖీలు పంపాలనుకుంటున్నారో వారి పేరు, పుట్టిన తేదీ పంపితే చాలు. న్యూమరాలజీ ప్రకారం వారికి అనువైన రంగులను ఎంచుకుని అందమైన రాఖీలను తయారుచేస్తున్నాం. మొదటిసారిగా ప్రారంభించిన ఈ వ్యాపారానికి ఇప్పుడిప్పుడే బాగా స్పందన వస్తోంది. ప్రస్తుతం ఒక రాఖీ తయారుచేయడానికి నాకు సుమారు 30-45 నిమిషాలు పడుతోంది. రాఖీలోని డిజైన్ల ఆధారంగా ధరను నిర్ణయించి విక్రయిస్తున్నా. ప్రస్తుతం రాఖీల సేల్స్‌కు సంబంధించి ఫేస్బుక్, వాట్సప్ ద్వారా ప్రమోషన్ నిర్వహిస్తున్నాం. మా స్నేహితులు, సన్నిహితులు వీటిని వారి ఫేస్బుక్ టైమ్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. అయితే ఫేస్బుక్ ద్వారానే మాకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ప్రమోషన్ నిర్వహించి విక్రయాలు ప్రారంభించాలనుకుంటున్నా’అని చెప్పుకొచ్చింది వందన.
కరోనా వల్ల ఎందరి జీవితాలో తల్లకిందులైపోతున్నాయి. ఇందుకు వందన స్టోరీనే ఉదాహరణ. పని చేసే రంగంతో సంబంధం లేకుండా ఎంతోమంది వృత్తి ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే తప్పకుండా మంచి రోజులు మళ్ళీ వస్తాయి. మన పరిస్థితులు బాగుపడతాయి. అప్పటివరకు నిరుత్సాహ పడకుండా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితులకు డీలా పడిపోకుండా వందన మాదిరి మనకున్న నైపుణ్యాలను బయటకు తీయాలి. వచ్చిన విద్యతో ఉపాధి సంపాదించుకోవాలి. ఉన్నంతలో ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాలి.
Photo: Screengrab