సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ర్టీలోని వేధింపులు, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత సినిమా పరిశ్రమలో దాగున్న చీకటి కోణాలు మరోసారి తెరమీదకొస్తున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని, కొందరి వేధింపుల వల్లే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సుశాంత్ స్నేహితురాలు, కథానాయిక రిచా చద్దా కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన స్నేహితుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన సోషల్ మీడియా బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చింది.
నాకో మంచి స్నేహితుడు దూరమయ్యాడు!
‘ప్రస్తుతం బాలీవుడ్ అంతటా బంధుప్రీతి గురించి చర్చ జరుగుతోంది. లోపలివాళ్లు (ఇన్సైడర్స్), బయటివాళ్లు (అవుట్ సైడర్స్) అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ నిజం ఏంటంటే ఇక్కడ ఉన్నవి రెండే వర్గాలు. జాలి ఉన్న వాళ్లు. జాలి లేని వాళ్లు. ఇక ఇన్సైడర్స్ అంటున్న స్టార్స్, స్టార్కిడ్స్లో కొందరు మంచివాళ్లు కూడా ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగి వేరేవారికి చిన్న సహాయం చేయని అవుట్‌సైడర్స్ కూడా ఉన్నారు. ఈ హిందీ పరిశ్రమలో జాలి లేని కొందరు మనుషులు ఎప్పుడూ ఎదుటివాళ్లపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తుంటారు. వాళ్లను రకరకాలుగా వేధిస్తూ వెనక్కులాగుతుంటారు. ఇక సుశాంత్ మరణం తర్వాత సోషల్ మీడియా ద్వారా సంతాపాలు ప్రకటించిన వారు, నీతి వాక్యాలు చెప్పిన వారిలో చాలామంది క్రూరులున్నారు. హీరోయిన్లను చులక భావంతో చూసిన వారున్నారు. గతంలో తమ గదికి రాలేదని హీరోయిన్లను సినిమాల నుంచి తప్పించి పగ తీర్చుకున్న దర్శకులు కూడా ఉన్నారు’ అని చెప్పుకొచ్చింది.
తనే నన్ను రిహార్సల్స్‌కు తీసుకెళ్లేవాడు!
ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంది రిచా. ‘సినిమాల్లోకి రాక ముందు నేను అంధేరీలోని ఓ షేరింగ్ ఫ్లాట్‌లో నివాసముండేదాన్ని. సుశాంత్ కూడా నా ఫ్లాట్‌కు సమీపంలోనే ఉండేవాడు. ఇద్దరం కలిసి థియేటర్ వర్క్‌షాప్స్‌కు వెళ్లేవాళ్లం. రిహార్సల్స్ చేయడానికి సుశాంత్ నన్ను తన బైక్ పైనే తీసుకెళ్లేవాడు.అందరూ బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతి గురించే మాట్లాడుతున్నారే కానీ...ఇలాంటి వేధింపులు ఎదుటి వారిని ఎంతగా కుంగుబాటుకు గురిచేస్తాయో ఎవరూ చెప్పడం లేదు. కారణమేదైనా ఈ బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. అదేవిధంగా నాకు ఓ మంచి స్నేహితుడు దూరమయ్యాడు’ అని విచారం వ్యక్తం చేసింది.