సోషల్ మీడియా... ఎవరైనా సరే.. తమ అభిప్రాయాలను, ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి ఓ చక్కటి వేదిక. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు ఎంత ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఎంతోమంది ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం సోషల్ మీడియాని విరివిగా ఉపయోగిస్తున్నారు.
అందులోనూ- సినిమా తారలైతే ఇక చెప్పే పనే లేదు. తమ లేటెస్ట్ ఫొటోలు, తాజా సినిమా కబుర్లు, ఒక్కటేమిటి... ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలను ఈ వేదికగా పంచుకుంటున్నారు.. నిత్యం తమ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు..
కరోనా నేపథ్యంలో - అందరి లాగానే మన అందాల తారలు సైతం సోషల్ మీడియాని విరివిగా ఉపయోగించేస్తున్నారు. ఈ క్రమంలో - ప్రత్యేకించి కొందరు తారలు 'త్రో బ్యాక్' మెమరీస్ పేరుతో తమ చిన్నప్పటి విశేషాలను, తమకు నచ్చిన ఒకప్పటి అరుదైన ఫొటోలను ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో - తాజాగా బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్, టాలీవుడ్ అందాల సుందరి సమంతలు తమ చిన్నప్పటి ఫొటోలను పంచుకుని మురిసిపోయారు.
తన చిన్నతనంలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ - ‘మనం భిన్న మార్గాల్లో పెరిగి, పెద్దయ్యాం.. కానీ మన మూలం మాత్రం ఒక్కటే.. చాలా మిస్సవుతున్నా’ అంటూ తన బాల్య స్మృతుల గురించి రాసుకొచ్చింది సమంత.
ఈ ఫొటోలో చిన్నారి సమంతతో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు.
ఇక - పొడుగు కాళ్ళ సుందరి సోనమ్ కపూర్ కూడా ఇలాంటి ఫొటోనే తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

తన తల్లి సునీతా కపూర్, చెల్లెలు రియా కపూర్, తమ్ముడు హర్ష వర్ధన్ కపూర్ లతో తన చిన్నప్పుడు దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ ఫొటోని పంచుకుంది సోనమ్.
మరి- ఈ ఇద్దరు బ్యూటీలు చిన్నప్పుడు ఇంకెంత క్యూట్ గా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి!