శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా, మనసును ప్రశాంతంగా మార్చుకోవాలన్నా మనం జపించే మంత్రం ‘యోగా’. అంతేనా.. ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేసే శక్తి యోగా సొంతం. అందుకే యోగాను మన లైఫ్స్టైల్లో భాగం చేసుకోవడమే కాదు.. దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏటా జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలాంటి పవర్ఫుల్ యోగాతో ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని మన జీవితాల్లో పాజిటివిటీని నింపుకుందాం అని పిలుపునిస్తోంది బాలీవుడ్ ఫిట్టెస్ట్ బ్యూటీ శిల్పాశెట్టి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎవరింట్లో వాళ్లే యోగా చేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అనే థీమ్‌ని రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి యోగా సాధన చేయాలని, తమ జీవితంలో సంతోషాన్ని నింపుకోవాలని తాజా పోస్ట్ ద్వారా తన ఫ్యాన్స్‌ను కోరుతోందీ బాలీవుడ్ యోగిని.
శిల్పాశెట్టి.. నటనకే కాదు.. ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా ఎంతో ప్రాధాన్యమిస్తుందీ బ్యూటీ. పెళ్లై, పిల్లలు పుట్టాక తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోన్న ఈ తార.. తన ఆహార నియమాలు, వ్యాయామాలు, యోగాసనాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. ప్రస్తుతం తను 45 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ నవయవ్వనంతో మెరిసిపోతుందంటే అందుకు తాను చేసే వ్యాయామాలే కారణం అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది శిల్ప. అంతేకాదు.. తాను గతంలో సర్వైకల్ స్పాండిలైటిస్‌తో బాధపడినట్లు, ఫిజియోథెరపిస్ట్ సలహాతో యోగా చేయడం వల్లే ఈ సమస్యను అధిగమించినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టిందీ బాలీవుడ్ మామ్. యోగాను లైఫ్స్టైల్లో భాగం చేసుకోవడం వల్ల అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చని ఇలా చెప్పకనే చెబుతోందీ ఫిట్టెస్ట్ బ్యూటీ.
అదో అద్భుత శక్తి!
తన ఆరోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టుల రూపంలో తెలియజేసే ఈ అందాల తార.. ఈ యోగా దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందరూ యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండచ్చని చెబుతోందీ బాలీవుడ్ అందం.
‘యోగా మనల్ని స్వేచ్ఛ వైపు నడిపించే సాధనం. ఈ ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేసే అద్భుత శక్తి యోగా సొంతం. అందుకే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం యోగాను మన లైఫ్స్టైల్లో భాగం చేసుకుందాం.. తద్వారా మనం సంతోషంగా ఉంటూ, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూనే.. మన చుట్టూ ఉండే వారిలో పాజిటివిటీని, హ్యాపీనెస్‌ని నింపుదాం.. ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అనే థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం యోగా చేస్తూనే.. మన కుటుంబ సభ్యులతో కూడా యోగా సాధన చేయిద్దాం.
అంతేకాదు.. ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తోన్న ‘మై లైఫ్ మై యోగా’ అనే వీడియో బ్లాగింగ్ పోటీలో కూడా పాలుపంచుకుందాం.
ఇంట్లోనే ఉండండి.. కుటుంబంతో కలిసి యోగా సాధన చేయండి..’ అంటూ వీడియోలో తన సందేశాన్ని వినిపించిందీ ఫిట్నెస్ ఫ్రీక్.
అసలేంటీ యోగా పోటీ?
అంతేకాదు.. ఈ వీడియోను ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న యోగా పోటీలకు కూడా పంపించిందీ అందాల యోగిని. ఇంతకీ ఏంటీ యోగా పోటీ అంటే.. ఈసారి కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం కీలకం. అందుకే ఇంట్లోనే కుటుంబంతో కలిసి యోగా చేయాలంటూ ప్రోత్సహిస్తూ ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత సాంస్కృతిక మండలి (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) సంయుక్తంగా ‘మై లైఫ్ మై యోగా’ అనే ఆన్లైన్ వీడియో పోటీకి తెరతీశాయి. ఇందులో భాగంగా అందరూ ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి యోగా చేస్తున్న మూడు నిమిషాల నిడివి గల వీడియోను #MyLifeMyYoga అనే హ్యాష్‌ట్యాగ్ వేదికగా పంచుకోవాల్సి ఉంటుంది. యోగా తమ జీవితాన్ని ఏ విధంగా మార్చిందో ఈ వీడియోలో చిన్న సందేశం రూపంలో జత చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ఈ వీడియో బ్లాగింగ్ పోటీల్లో చిన్నా, పెద్దా, ఆడ, మగ, యోగా నిపుణులు.. అనే వివిధ విభాగాల ద్వారా వచ్చిన వీడియోలను పరిశీలించనున్నారు. ఇందులో గెలుపొందిన తొలి ముగ్గురు భారతీయులకు వరుసగా రూ. లక్ష, రూ. 50 వేలు, రూ. 25 వేల చొప్పున నగదు బహుమతి అందిస్తారు. ఇక వివిధ దేశాల నుంచి ఈ ఆన్లైన్ పోటీలో పాల్గొని గెలుపొందిన తొలి ముగ్గురు విజేతలకు కూడా నగదు బహుమతి అందించనున్నారు.
మరి, శిల్ప చెప్పినట్లుగానే ప్రస్తుతం మన చుట్టూ కమ్ముకున్న కరోనా చీకట్లను జయించేందుకు యోగాను సాధనంగా మలచుకుందాం.. ఇంట్లోనే యోగా చేద్దాం.. సానుకూలతను, సంతోషాన్ని మనలో నింపుకుందాం.. కరోనాను అంతం చేద్దాం..!