గుంజన్ సక్సేనా.. 20 ఏళ్ల క్రితం జరిగిన భీకర కార్గిల్ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికులను తన చీతా హెలికాప్టర్లో క్షేమంగా బేస్‌క్యాంప్‌కు తరలించిన ధీర వనిత. శత్రువుల చెరకు చిక్కకుండా మెరుపు వేగంతో తన హెలికాప్టర్లో దూసుకుపోయిన ఆమె.. యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలట్‌గా అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. తనదైన ధైర్యసాహసాలను ప్రదర్శించి కార్గిల్ గర్ల్‌గా మారింది. అందుకే ఆమె తెగువ, జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందుతోందే ‘గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్’ సినిమా. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గుంజన్‌గా కనిపించనుంది. అయితే గుంజన్ జీవితంలోని కొన్ని జ్ఞాపకాల సమాహారంతో రూపొందించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న గుంజన్.. ఓ సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చారు. దీనికి జాన్వీ, చిత్ర దర్శకుడు శరణ్ స్పందిస్తూ పెట్టిన పోస్టులు, వీరి సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
అందాల తార జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్’. యుద్ధభూమిలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళా పైలట్‌గా చరిత్రకెక్కిన గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే గుంజన్ జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను కొలేజ్ చేసి, జాన్వీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను దీనికి జతచేసి రూపొందించిన వీడియోను నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేసింది. నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోన్న ఈ వీడియో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తిని అందరిలోనూ రేకెత్తిస్తోంది.
ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయ్!
దాదాపు నిమిషం నిడివి గల ఈ వీడియో తననూ ఎంతగానో ఆకట్టుకుందని చెబుతున్నారు రియల్ లైఫ్ గుంజన్. ఈ నేపథ్యంలో ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవలే ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ కార్గిల్ గర్ల్.. దానికి ఓ సుదీర్ఘమైన క్యాప్షన్‌ను జతచేశారు. ‘నా జీవితంలోని మధుర క్షణాలను రంగరించి రూపొందించిన ఈ వీడియో నన్ను కట్టిపడేసింది. ఇక ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో జాన్వీ వాయిస్ అద్భుతంగా ఉంది. నా గత జ్ఞాపకాలు ఇంత అందంగా నా కళ్ల ముందు కదలాడడం చాలా అరుదు. మూడేళ్ల క్రితం శరణ్ శర్మతో ప్రారంభమైన ఈ అద్భుతమైన ప్రయాణానికి ఇది ముగింపు సమయం అని నేను భావిస్తున్నాను. నా జీవితాన్ని తెరపై ఆవిష్కరించే క్రమంలో ఆయన చూపిన నిజాయతీ, విధేయత, సున్నితత్వాన్ని నేను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను.
నా వయసులో ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్పడానికి ఒక కథంటూ ఉంటుంది. అయితే తమ కథను వెండితెరపై చూసే అదృష్టం నాలాంటి అతి కొద్ది మందికే దక్కుతుంది. ఈ క్రమంలో శరణ్, జాన్వీ లాంటి వృత్తి పట్ల అంకితభావం గల వ్యక్తులు నాకు దొరకడం మరో అదృష్టం. ఏ జీవిత ప్రయాణమూ పార్కులో నడిచినంత సులభమైంది కాదు.. నా జీవితమూ అందుకు భిన్నం కాదు.. కానీ ఒక దశలో మన లక్ష్యంపై మనకున్న దృష్టే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. నేను ఐఏఎఫ్‌లో ఉన్నప్పుడు నేను ఏదైతే సాధించానో.. అది బ్లూ యూనిఫాంలో ఉన్న ఇతర మహిళలు, పురుషుల (తోటి సైనికుల గురించి ప్రస్తావిస్తూ) ద్వారానే అది నాకు సాధ్యమైంది. నా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. కేవలం ఇది నా జీవిత కథ మాత్రమే కాదు.. శరణ్, ఆయన బృందం కలిసి చేసిన హార్డ్ వర్క్ కూడా!’ అంటూ తన మనసులోని మాటల్ని మన ముందుంచారు గుంజన్.
మీరు గర్వపడేలా చేస్తాం!
ఇక గుంజన్ సుదీర్ఘమైన పోస్టుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న జాన్వీ.. ‘మీ జీవిత కథను అర్థం చేసుకొని, దాన్ని ప్రపంచంతో పంచుకునే అదృష్టం దక్కడం ఎంతో గౌరవప్రదం. గుంజన్ మేడమ్.. ఈ సినిమా ద్వారా మేమంతా మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నా..’ అంటూ రాసుకొచ్చింది జానూ.
గుంజన్ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న చిత్ర దర్శకుడు శరణ్ శర్మ.. ‘గుంజన్ మేడం.. మా టీం తరఫున మీకు, మీ కుటుంబానికి ధన్యవాదాలు. మీ జీవిత కథను మాతో పంచుకున్నందుకు, దీన్ని సినిమాగా తెరకెక్కించే క్రమంలో మమ్మల్ని గైడ్ చేసినందుకు, మమ్మల్ని ఓ కుటుంబంలా చేసి.. అందులో మీరూ భాగమైనందుకు మీకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. మేమంతా మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నా..’ అంటూ ఈ రియల్ లైఫ్ కార్గిల్ గర్ల్‌కు ధన్యవాదాలు తెలిపారాయన.
జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ ముఖ్య తారాగణంగా ధర్మ ప్రొడక్షన్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తోన్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.