సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకుంటారు. అంతేకాదు.. వారి జీవితం పూల పాన్పని, సినీ కెరీర్ కూడా ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సునాయాసంగా ముందుకు సాగుతుందని భావిస్తుంటారు చాలామంది. కానీ తన జీవితం మాత్రం ఇందుకు భిన్నం అంటోంది తమిళందం ఐశ్వర్యా రాజేశ్.
పాత తరం తెలుగు నటుడు రాజేశ్ కూతురైన ఐశ్వర్య చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకొని అష్టకష్టాలు పడింది. కుటుంబానికి భారం కాకుండా.. ఆ బాధ్యతలను పంచుకోవడానికి తాను మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తనకెన్నో సవాళ్లు ఎదురయ్యాయని అంటోంది ఐశ్వర్య. తనకెవరూ అండగా నిలవకపోయినా.. అమ్మ ప్రోత్సాహం, స్వీయ ప్రేరణ, కృషి, పట్టుదలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చిందీ ఆన్‌స్క్రీన్ వుమన్ క్రికెటర్. మొన్నామధ్య తమిళనాడులోని తిరుచిరాపల్లి ఐఐఎంలో నిర్వహించిన ‘టెడ్ఎక్స్ టాక్‌షో’ వేదికపై ప్రసంగించిన ఐశ్వర్య.. ఆ వీడియోను ఇటీవలే ట్విట్టర్లో పంచుకుంది. ఇందులో భాగంగా తన జీవిత ప్రయాణంలో తనకెదురైన కష్టాలు, చేదు అనుభవాలు, వాటిని దాటుకుంటూ సక్సెస్ సాధించిన వైనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైందీ బ్యూటీ. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఐశ్వర్యా రాజేశ్.. తెలుగులో నటించిన తొలి చిత్రం ‘కౌసల్యా కృష్ణమూర్తి’తోనే సక్సెస్ సాధించిన ఈ తమిళమ్మాయి.. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ‘రాంబంటు’ చిత్రంలో బాలనటిగా తొలిసారిగా వెండితెరకు పరిచయమైంది. ఆపై తమిళ సినిమాలకే పరిమితమైన ఆమె.. ‘మిస్‌మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. వంటి తెలుగు సినిమాలతో అలరించింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినిమాల్లో అవకాశాల కోసం చాలా కష్టపడ్డానంటోంది. మొన్నమధ్య తమిళనాడు తిరుచిరాపల్లి ఐఐఎంలో నిర్వహించిన టెడ్ఎక్స్ టాక్స్ షోలో ప్రసంగించిన ఐశ్వర్య.. ఇందులో భాగంగా తాను చిన్నతనంలో పడిన కష్టాలు, సినిమాల్లో అవకాశాల కోసం తాను ఎదుర్కొన్న ఆటుపోట్లు, తన సినీ కెరీర్.. తదితర విషయాల గురించి పలు విషయాలు పంచుకుంది. ఆ వీడియోను ఇటీవలే ట్విట్టర్లో పోస్ట్ చేసిందీ తమిళందం. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
అమ్మే.. అన్నీ అయి..!
హాయ్.. నేను మీ ఐశ్వర్యా రాజేశ్. నేను ఇప్పటివరకు తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో కలుపుకొని దాదాపు 25 సినిమాల్లో నటించా. నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే. ఇక్కడి మురికి వాడలుగా పిలుచుకునే హౌసింగ్ బోర్డ్‌లో పుట్టాను. నేనో దిగువ మధ్యతరగతి అమ్మాయిని. అమ్మానాన్నలకు మేం నలుగురం సంతానం. నాకు ముగ్గురు అన్నయ్యలు. నాకు ఎనిమిదేళ్లున్నప్పుడు నాన్న చనిపోయారు. ఆ సమయంలో మా కుటుంబ భారమంతా అమ్మపైనే పడింది. ఆమె చదువుకోకపోయినా మా అందరినీ ఉన్నత విద్యావంతుల్ని చేసింది. చీరలమ్ముతూ, ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ.. నాన్న లేని లోటు తెలియకుండా మమ్మల్ని పెంచింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె ఒక యోధురాలు. నేను ఇప్పుడు ఇలా మీ ముందున్నానంటే అందుకు అమ్మే కారణం.
అంతలోనే మరో కుదుపు!
అప్పటికే నాన్న పోయిన బాధలో ఉన్న మా కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడు నాకు 12, 13 ఏళ్లుంటాయనుకుంటా.. మా పెద్దన్నయ్య చనిపోయాడు. ఆ బాధలోనే కొన్నేళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత మా రెండో అన్నయ్యకు మంచి ఉద్యోగం రావడంతో ‘హమ్మయ్య.. ఇక మా కుటుంబానికంటూ ఓ పెద్ద దిక్కు దొరికాడంటూ’ అమ్మ పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయింది. అయితే ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదంలో అన్నయ్య కూడా చనిపోవడంతో మరోసారి మా కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఆ బాధతో అమ్మ మరింతగా కుంగిపోయింది.
అమ్మ ప్రోత్సాహంతో..!
అలాంటి కష్టసమయంలో నేను నా కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకున్నా. కుటుంబంలో వ్యక్తిగా ఆ బాధ్యతల్ని నేనూ పంచుకోవాలనుకున్నా. అలా 11వ తరగతిలో ఉండగానే నేను చెన్నై బసంత్ నగర్‌లోని ఓ సూపర్ మార్కెట్లో ప్రమోషన్ గర్ల్‌గా మారా. అలా నా తొలి సంపాదన రూ. 225 అందుకున్నా. ఆ తర్వాత ఈవెంట్ ప్లానర్‌గా మారి నెలకు ఐదు వేలు ఆర్జించేదాన్ని. కానీ కుటుంబ అవసరాల కోసం అంత తక్కువ డబ్బు సరిపోదని గ్రహించిన నేను.. సీరియల్స్‌లో నటించాలనే నిర్ణయానికొచ్చా. అయితే ఇంకా ఎక్కువగా సంపాదించాలంటే సినిమాల్లో ప్రయత్నించమని అమ్మ నాకు సలహా ఇచ్చింది. మంచి పాత్రలు చేయడం, వాటిని ప్రేక్షకులు ఆదరించడం వల్ల అటు పేరుప్రఖ్యాతులతో పాటు మంచి పారితోషికం అందుకోవచ్చని అమ్మ నన్ను ప్రోత్సహించింది. అయితే అప్పటికే నాకు డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండడం, ‘మానాడా మయిలాడా’ అనే డ్యాన్స్ రియాల్టీ షో మూడో సీజన్లో విజేతగా నిలవడంతో సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నించా. అలా ‘అవ్రగలుం ఇవ్రగలుం’ అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టా. అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది.
హీరోయిన్గా పనికిరావన్నారు!
సాధారణంగా సినిమా రంగంలో నటీమణులపై లైంగిక వేధింపుల గురించి మనం వింటూనే ఉంటాం. కానీ ఇక్కడున్న సమస్య ఇదొక్కటే కాదు.. చర్మ ఛాయ, శరీరాకృతి, డ్రస్సింగ్.. వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. నేనూ ఈ సమస్యల్ని ఎదుర్కొన్నా. ముఖ్యంగా ఉత్తరాది అమ్మాయిల్లా దుస్తులు ధరించడం, ముస్తాబు కావడం నాకు రాదు. అంతేకాదు.. నాకు తమిళం రాదన్న ఉద్దేశంతో కొందరు నన్ను తిరస్కరించారు కూడా! ఇంకొందరు దర్శకులు.. ‘నువ్వు హీరోయిన్గా పనికిరావు, చిన్న చిన్న పాత్రలు, సహాయక పాత్రల్లో అవకాశమిస్తాం.. అందులో నటించు’ అనేవారు. మరో దర్శకుడైతే.. హాస్య నటుల సరసన నటించమన్నారు. కానీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమాలో హీరోయిన్గా నటించాలనేది నా కల. అలా రెండు మూడేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాకుండా ఖాళీగా ఉన్నా. ఆ తర్వాత ‘అట్టకత్తి’లో చిన్న పాత్రలో నటించా. అందులో నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

అదే నా కెరీర్లో టర్నింగ్ పాయింట్!
ఆ తర్వాత నేను నటించిన ‘కాకా ముట్టై’ చిత్రంతో నా కెరీర్ పూర్తి మలుపు తీసుకుంది. అందులో ఇద్దరు చిన్నారులకు తల్లిగా నటించా. ఈ చిత్ర షూటింగ్లో భాగంగా నా సహనటుల దగ్గర్నుంచి నటనకు సంబంధించిన బోలెడన్ని విషయాలు నేర్చుకున్నా. అంతేకాదు.. ఈ సినిమా నాకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డును కూడా అందించింది. అలాగే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డుకు కూడా నన్ను నామినేట్ చేసింది. ఆపై విజయ్ సేతుపతి (ధర్మ దురై), ధనుష్ (వడ చెన్నై).. వంటి పెద్ద పెద్ద నటులతో కలిసి నటించే అవకాశం నన్ను వరించింది. ఆపై కణా (తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి)తో మహిళా ప్రాధాన్య సినిమాల్లో సైతం నటించి మెప్పించగలనని నిరూపించా. అందులో నేనే హీరో అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇదంతా నాపై నేను నమ్మకముంచి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం వల్లే సాధ్యమైందని చెబుతా.
మనం అంత సమర్థులం కావాలి!
మీరు నమ్ముతారో, లేదో కానీ సినిమాల్లో నేను నిలదొక్కుకోవడానికి నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు. నాపై నేను పూర్తి విశ్వాసం ఉంచడమే నా సక్సెస్ సీక్రెట్ అని చెబుతా.
అలాగే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో నా చర్మ ఛాయ, శరీరాకృతిపై ఎన్నో విమర్శలొచ్చాయి. లైంగిక వేధింపులూ ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ప్రతి మహిళ కూడా తమకు ఎదురైన సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొనేంత బలంగా తయారుకావాలి. ఎవరో వచ్చి తమను కాపాడతారని అనుకోకుండా ఎవరిని వారే రక్షించుకునేంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అలాగే ఇతరులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎదగగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి.. మహిళలందరికీ నేను చెప్పేది ఇదే.