దియా మీర్జా... కేవలం సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె మోడల్‌గా మెరిసి.. 2000 ‘మిస్ ఏషియా పసిఫిక్’ కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందీ హైదరాబాదీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా పర్యావరణ సమస్యలు, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తోంది. ఈక్రమంలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా మరోసారి యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(UNEP) గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైంది దియా. మరో రెండేళ్ల పాటు (2022 ముగిసే వరకు) ఆమెను ఈ హోదాలో కొనసాగించనున్నట్లు ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్లాస్టిక్ నిషేధమే లక్ష్యంగా!
‘రెహ్నా హై తేరే దిల్ మే’, ‘తుమ్సా నహీ దేఖా’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘క్రేజీ4’, ‘లవ్ బ్రేకప్స్ జిందగీ’, ‘సంజు’ లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది దియా. ఇటీవల తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘థప్పడ్’ సినిమాలోనూ మెరిసి మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిందీ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి పక్కన పెడితే.. సామాజిక సేవలోనూ ముందుండే ఆమె పర్యావరణ పరిరక్షణ కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గతంలో ‘వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన దియా.. మూగజీవాల సంరక్షణకు సైతం కృషి చేస్తోంది. అలాగే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ దానిని నిషేధించాలని కోరుతోందీ అందాల తార. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేపడుతోన్న సేవా కార్యక్రమాలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి దియాను UNEP గుడ్‌విల్ అంబాసిడర్‌గా మరో రెండేళ్ల పాటు కొనసాగించనుంది. 2017 నుంచి ఈ పదవిలో కొనసాగుతోన్న ఆమె.. ఇటీవలి ప్రకటనతో 2022 ముగిసే వరకు UNEP గుడ్‌విల్ అంబాసిడర్‌గా కొనసాగనుంది.
గ్రీన్ గణేశా!!
పర్యావరణ పరిరక్షణ కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో జట్టు కట్టింది దియా. ప్రధానంగా ఒక్కసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా పలు అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముంబైలోని జుహూ బీచ్‌లో, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున మహిమ్ బీచ్‌లలో స్పెషల్ డ్రైవ్ పేరుతో స్వయంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. గతేడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడొద్దంటూ ‘గ్రీన్ గణేశా’ పేరుతో ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేసింది. అదేవిధంగా లాక్‌డౌన్‌కు ముందు ఆమె పాల్గొన్న ఓ షూట్లో భాగంగా అక్కడ ఉండే సిబ్బంది మొత్తానికి వారి పేర్లతో ముద్రించిన మెటల్ వాటర్ బాటిల్స్‌ను వితరణగా అందజేసింది. ఇలా ప్లాస్టిక్‌ను నిషేధించడానికి తన శాయశక్తులా పోరాడుతోందీ అందాల తార.
కృతజ్ఞురాలిని!
ఈక్రమంలో UNEP గుడ్‌విల్ అంబాసిడర్‌గా మరో రెండేళ్ల పాటు కొనసాగడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది దియా. ‘నాకు మరోసారి ఈ అవకాశం కల్పించిన ఐక్యరాజ్యసమితికి నా కృతజ్ఞతలు. UNEPతో కలిసి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యానికి సంబంధించి సామాన్య ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీటితో పాటు దేశంలోని సహజ వనరులను కాపాడడమే లక్ష్యంగా నా తదుపరి కార్యాచరణ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది దియా.
ఇదొక శుభపరిణామం!
కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా దేశంలో పలు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మూతపడడంతో పర్యావరణ కాలుష్యం బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో ఎత్తైన హిమాలయాలు పక్కనే ఉన్నా కనిపించని సమీప రాష్ట్రాల ప్రజలు నేడు స్పష్టంగా మంచు పర్వతాల అందాలను చూసి మురిసిపోతున్నారు. ఎప్పుడూ కలుషిత నీటితో దర్శనమిచ్చే గంగ, యమున తదితర నదులు ప్రస్తుతం ఎంతో స్వచ్ఛతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దియా.. ఈ మార్పులను చూసి ముచ్చటపడుతోంది. ప్రధానంగా పవిత్రమైన గంగా నది తను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా స్వచ్ఛంగా మారిపోవడం శుభపరిణామమని చెబుతోందీ ముద్దుగుమ్మ.
ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి!
ఈక్రమంలో ఇటీవల ‘గంగా ది సోల్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది దియా. ‘వన్ రివర్ ఎ మిలియన్ లైవ్స్... మనమెంతో ఆరాధించే గంగా నది నీరు నేడు పవిత్రతను సంతరించుకుంది. పరిశ్రమలు, ఫ్యాక్టరీల వ్యర్థాలతో ఎంతగానో కలుషితమైన ఈ నది లాక్డౌన్ కారణంగా మళ్లీ తన పూర్వస్థితిని సొంతం చేసుకుంది. నీటి నాణ్యత కూడా 40-50 శాతం వరకు మెరుగైంది. అంతరించిపోతాయనుకుంటున్న డాల్ఫిన్లు కూడా స్వచ్ఛమైన నీటిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది’ అని తన ఆనందానికి ఇన్‌స్టా వేదికగా అక్షర రూపమిచ్చింది దియా.