లారాదత్తా... బాలీవుడ్ సినిమాలు చూసే వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. మొదట ‘మిస్ యూనివర్స్’గా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత బాలీవుడ్ వెండితెరపై కథానాయికగా తళుక్కుమని మెరిసింది. హీరోయిన్గా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, ప్రత్యేక గీతాలతోనూ, విభిన్న పాత్రలతోనూ అంతే పేరు సొంతం చేసుకుంది లారా. తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ మాజీ మిస్ యూనివర్స్.. తాజాగా 42 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈక్రమంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే తన భర్త మహేష్ భూపతి, కూతురు సైరాతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొంది.
మోడలింగ్ టు బాలీవుడ్!
కళాశాలలో చదువుకునే రోజుల్లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన లారా 2000లో విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘అందాజ్’, ‘ముంబై సే ఆయా మేరా దోస్త్’, ‘ఖాకీ,’ ‘మస్తీ’ ‘బర్దాస్త్’, ‘కాల్’, ‘నో ఎంట్రీ’ తదితర సినిమాల్లో హీరోయిన్గా సత్తా చాటింది. ఇక ‘ఖాకీ’, ‘ఆలగ్’, ‘ఫనా,’ ‘ఓం శాంతి ఓం’, ‘రబ్ నే బనాది జోడీ’, ‘డాన్2,’ ‘పార్ట్నర్’, ‘బిల్లూ బార్బర్’, ‘బ్లూ’, ‘హౌస్‌ఫుల్’ తదితర చిత్రాల్లో ప్రత్యేక గీతాలు, ప్రత్యేక పాత్రలతో స్క్రీన్‌పై సందడి చేసింది. 2010లో ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతితో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ... 2011లో అతడితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వీరిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా 2012లో ‘సైరా’ అనే పాప కూడా పుట్టింది.
వర్చువల్ బర్త్‌డే పార్టీ!
తాజాగా 42 వ వసంతంలోకి అడుగుపెట్టిన లారాదత్తా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో సింపుల్‌గా జరుపుకుంది. ఇంట్లోనే లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ తన భర్త, కూతురితో కలిసి వేడుకల్లో పాల్గొంది. వేడుకల కోసం ఇంటిని ఎంతో అందంగా అలంకరించింది. ఇంట్లోనే ప్రత్యేకంగా కేక్, పిజ్జాలు, బర్గర్లు తయారుచేసింది. ఇక పుట్టినరోజు సందర్భంగా వైట్ కలర్ ఆఫ్-షోల్డర్ టాప్ ధరించిన లారా... కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులందరూ వీడియోకాల్‌లో ఉండగా బర్త్‌డే కేక్‌ను కట్ చేసింది. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిందీ అందాల సుందరి.
అందమైన భర్తనిచ్చావ్!
ఈ సందర్భంగా తన సతీమణి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు మహేష్. ‘వర్చువల్ బర్త్‌డే పార్టీ పూర్తయింది. లారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నాకింతటి అందమైన హజ్బెండ్(లారాను ఉద్దేశిస్తూ), అద్భుతమైన కూతురును అందించిన ఆ దేవుడికి ధన్యవాదాలు (స్మైలింగ్ ఎమోజీలు జతచేస్తూ). మరికొన్ని దశాబ్దాల పాటు ఆ దేవుడి ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడీ లవ్లీ హజ్బెండ్.
ఇక తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది లారా. ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. నాపై ఇంతటి ప్రేమ చూపుతోన్న అభిమానులకు నా కృతజ్ఞతలు. మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండి..!’ అని అందరికీ కరోనా జాగ్రత్తలను కూడా సూచించిందీ ముద్దుగుమ్మ.
హ్యాపీ బర్త్‌డే లారా!