షూటింగ్స్, ఫారిన్ టూర్స్.. అంటూ అనునిత్యం ఎంతో సరదాగా గడిపే మన సెలబ్రిటీలు లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే బందీలైపోయారు. తమ జీవితాన్ని సరికొత్తగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్-19 పై ప్రచారం కల్పించడంలో కొందరు నిమగ్నమైతే.. మరికొందరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంకొందరు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా తమ క్వారంటైన్ సమయాన్ని గడుపుతున్నారు. ఇక మరికొందరి విషయానికొస్తే.. తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. వీటిని చూసిన అభిమానులు తమ అభిమాన నటులు చిన్నతనంలో ఎంత క్యూట్ ఉన్నారో అంటూ మురిసిపోతున్నారు. మరి, ఆ ఫొటోలపై, వాటికి వారు జోడించిన క్యాప్షన్స్పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..
* దీపికా పదుకొణె ఏదో స్టేజ్ షోలో పాల్గొన్న నాటి ఫొటోను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..‘టీనేజ్ ఆరంభంలో..’ అంటూ క్యాప్షన్‌ని జతచేసింది.
* టాలీవుడ్ బబ్లీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ చిన్నతనంలో తను కృష్ణుడి వేషం వేసిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘హ్యాపీ విషు’ అంటూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపింది. మనకు ఉగాది ఎలాగో తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రజలకు విషు అలాగన్నమాట!
* బాలీవుడ్ అందాల తార కరిష్మా కపూర్ తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘కుటుంబం ముఖ్యం’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోలో చిన్ననాటి కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్లను కూడా మనం చూడచ్చు.
* వావ్.. పరిణీతి ఎంత క్యూట్‌గా ఉందో..! ఈ ఫొటో చూసిన ఎవరైనా ఈ మాట అనాల్సిందే. తన స్కూ్ల్ డేస్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పరి.. ‘నేను, నా క్లాస్మేట్స్ మా స్కూల్లో ఓ నాటకంలో పాల్గొన్నాం. అప్పుడే నేను నటిని కావాలని బలంగా నిశ్చయించుకున్నా..’ అంటూ తన మనసులోని మాటల్ని అక్షరీకరించిందీ బాలీవుడ్ బేబ్.
* సారా అలీ ఖాన్ తన చిన్ననాటి ఫొటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా క్వారంటైన్ సమయంలో దిగిన ఓ ఫొటోతో, చిన్నతనంలో దిగిన ఫొటోను కొలేజ్ చేసి ఇన్‌స్టాలో పంచుకుంది సారా. ‘నేను చిన్నప్పటి నుంచీ ఇలాగే ఉన్నా..’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ని జత చేసిందీ పటౌడీ ప్రిన్సెస్.
* సోనమ్ కపూర్ కూడా తన చిన్ననాటి స్నేహితులతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీ అందరినీ మిస్ అవుతున్నా..’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
* బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జరీన్ ఖాన్ #ThenAndNowChallenge లో భాగంగా తన చిన్ననాటి ఫొటోను, లేటెస్ట్గా దిగిన ఫొటోతో కొలేజ్ చేసి ‘ఇదిగో నా ఫొటో’ అంటూ పోస్ట్ చేసింది. ఇందులో చిన్ననాటి జరీన్ ఎంత క్యూట్‌గా ఉందో కదూ!!
* బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ తన చిన్నతనంలో అమ్మతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ..‘నేను, మా అమ్మ ఎల్లప్పుడూ కలిసే ఉంటాం.. అది హాలిడేస్లోనైనా.. క్వారంటైన్‌లోనైనా.. మేం ఎల్లప్పుడూ కలిసే ఉంటాం..’ అంటూ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు వరుణ్.
* టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్, అఖిల్ చిన్ననాటి ఫొటోలను షేర్ చేశాడు. టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, అఖిల్ పుట్టినరోజు ఒకే రోజు (ఏప్రిల్ 8) కావడం వల్ల వారి చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో అల్లు అర్జున్‌ని ఉద్దేశిస్తూ.. ‘డ్యాన్స్‌లో గ్రేస్, ఆ వయసు నుంచే ఉంది. బన్నీలో కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌డే బన్నీ. నువ్వు బాగుండాలబ్బా..’ అంటూ బన్నీ డ్యాన్స్ గురించి చెప్పుకొచ్చాడు మెగాస్టార్.
అఖిల్ గురించి చెప్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. చరణ్‌కి ఒక తమ్ముడు.. నాకు, సురేఖకు ఒక కొడుకు లాంటి వాడివి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. మేమంతా ఎంతగానో ప్రేమించే అబ్బాయివి.. రాబోయే ఏడాది నీకంతా బాగుండాలి..’ అంటూ అఖిల్‌పై తన ప్రేమను వ్యక్తం చేశాడు చిరు.