అనుష్కా శెట్టి.. నేటి తరంలో హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటీమణుల్లో తన పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల సినిమాలతో సమానంగా మహిళా ప్రాధాన్య సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చింది అందాల అనుష్క. ఇక బాహుబలి సినిమా తర్వాత అనుష్క ట్యాలెంట్ ప్రపంచానికీ పాకింది. ఇలా నటిగా తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న అనుష్క.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజా పరిస్థితులను ప్రతిబింబించేలా ఒక పోస్ట్‌ని షేర్ చేసిందీ బొమ్మాళి. కరోనా కారణంగా ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అందరిలో స్ఫూర్తి నింపేలా సోషల్ మీడియా వేదికగా తను పోస్ట్ చేసిన ఓ సందేశం అందరికీ ప్రేరణనిస్తోంది. మరి తను షేర్ చేసిన ఆ సందేశమేంటో మనమూ చూద్దాం రండి..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం అందరినీ కలవరపరుస్తోంది. దీని అంతెక్కడ.. ఎప్పుడు.. అంటూ అందరూ కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు గాల్లో దీపాలు కావడం చాలామంది హృదయాలను కలచివేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ బ్యూటీ అందాల అనుష్క అందరిలో ప్రేరణ కలిగిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది..
ఇది ప్రపంచానికి నేనిచ్చే సందేశం..
ఇన్‌స్టా వేదికగా ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రజలకు అందిస్తూ.. ‘నిజానికి మనం విడిపోయామని అనుకుంటున్నాం.. వేరుగా ఉంటున్నామని భావిస్తున్నాం.. కానీ, ఇప్పుడే మనమంతా ఏకతాటిపైకి వచ్చాం. ఐక్యంగా నిలిచాం. ఇంతకుముందెన్నడూ లేని సరికొత్త దృక్పథాన్ని అలవర్చుకున్నాం. అవకాశాలన్నీ కనుమరుగైన వేళ.. అసాధ్యమనుకున్న ఓ కొత్త దృష్టి కోణాన్ని సుసాధ్యం చేసి చూపించాం. మనకు తెలిసిన, తెలియని ఎంతోమంది మన కోసం ప్రార్థిస్తున్నారు. మనల్ని రక్షించేందుకు కష్టపడుతున్నారు. మనం కోలుకునేందుకు సహాయపడుతున్నారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు సరితూగే పదం ఏ భాషలోనూ లేదు. ఈ విపత్తు నుండి బయటపడ్డాక.. విలువలను కాపాడడంలో ఎవరి పాత్ర వాళ్లు సక్రమంగా పోషించడమే వారికి మనం చూపించే నిజమైన కృతజ్ఞత. పరస్పర సహకారంతో ఓ కొత్త వాతావరణం సృష్టిద్దాం. మనుషులుగా మానవత్వంతో జీవిద్దాం. అలాగే మన మనుగడకు కారణమైన ఈ భూమి పట్ల మానవత్వాన్ని చూపుదాం..’ అంటూ ఎంతో ఉద్వేగపూరితమైన సందేశాన్ని అందించిందీ బబ్లీ బ్యూటీ.

అనుష్క చెప్పినట్లు.. మనకోసం ప్రాణాలకు తెగించి, అలుపెరగక సేవ చేస్తున్న వారందరికీ ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది. కాబట్టి మనం వారికి చేయగలిగిన సహాయం ఒక్కటే.. అందరం ఇంట్లో ఉందాం.. సామాజిక దూరం పాటిద్దాం.. తద్వారా ఇటు మనల్ని మనం, అటు చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనకోసం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తోన్న వారికి మనం పరోక్షంగా సహకరించినట్లే! అలాగే ఇకనైనా ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతగా మెలుగుదాం..!