కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలకు తమ బిజీ లైఫ్ నుంచి చిన్న విరామం దొరికినట్లయింది. అనుకోకుండా వచ్చిన ఈ సెలవులను చాలామంది తమ మనసుకు నచ్చిన పనులు చేసేందుకు వినియోగిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో కొంతమంది కాలక్షేపం కోసం ఇంట్లో ఉన్న ఫొటో ఆల్బమ్స్, కుటుంబ సభ్యుల పెళ్లి వీడియోలు.. వంటివి చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందాల నటి నమ్రతా శిరోద్కర్ కూడా తన ఫోన్లో దాగున్న పాత ఫొటో ఆల్బమ్స్ తిరగేస్తోంది. అంతేకాదు, ఆ ఫొటోలను.. అవి దిగిన సందర్భాలను రోజుకొకటి చొప్పున సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని నిర్ణయించుకుందీ మిసెస్ మహేష్. ఈ క్రమంలో మొదటి రోజు పోస్ట్ చేసిన ఫొటోలు.. వాటి వెనకున్న విశేషాలేంటో మీరే చూడండి.
‘పాత ఫొటో ఆల్బమ్స్ చూడడం ద్వారా.. అప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదలాడతాయి. దీనినే మెమరీ థెరపీ అంటారు. అందుకే ఇప్పటినుంచి రోజుకొకటి చొప్పున ప్రతిరోజూ ఓ జ్ఞాపకాన్ని మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నా..! ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం ద్వారా నా ఆలోచనలు పాజిటివ్‌గా మారతాయని అనుకుంటున్నాను. ఫొటోలు చూడడం వల్ల ఆనందం దొరుకుతుంది; బాధ, ఆందోళనల నుంచి మనసుకు ఊరట లభిస్తుంది.. అని నమ్మేవాళ్లు ఈ చిట్కాను తప్పక ప్రయత్నించండి’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది నమ్రత.
తొలి జ్ఞాపకం - ‘1 నేనొక్కడినే’ సెట్స్‌లో..!
‘1 నేనొక్కడినే’ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోన్న సమయంలో తీసిన ఫొటోలివి..! ఈ ఫొటో తీసే సమయంలో మా అబ్బాయి గౌతమ్ అక్కడ లేడు..!
మొత్తానికి గౌతమ్‌ని కలుసుకోగలిగాను..! ‘1’ సినిమా సెట్స్‌లో మా చిన్ని కుటుంబం గడిపిన ఆనంద క్షణాలను ఇలా నెమరు వేసుకొంటున్నా..!
సాధారణంగా వీళ్లిద్దరూ (సితార, గౌతమ్) ఎప్పుడూ కలిసే ఉంటారు. కానీ.. వీళ్లను ఒకే ఫ్రేమ్‌లో ఉంచి ఫొటో తీయడం కొంచెం కష్టమైన పనే అని తెలిసినా ఇలా ప్రయత్నించాను..!
మరి నమ్రత లాగే మీరూ ఈ మెమరీ థెరపీని ప్రయత్నించి.. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి.